దేశంలో రెండో ముఖ్యమంత్రిగా రికార్డు
దిశ దశ, న్యూ ఢిల్లీ:
సుదీర్ఘ కాలం ముఖ్యమంత్రులుగా బాధ్యతలు నిర్వర్తించిన రికార్డుల్లో మరో మైలు రాయిని చేరుకున్నారు ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా కంటిన్యూగా వ్యవహరించిన జాబితాలో నేటితో రెండో స్థానానికి చేరుకున్నారు. ఇప్పటి వరకు రెండో స్థానంలో ఉన్న జ్యోతిబసు రికార్డును శనివారంతో సమం చేసిన ఆయన ఆదివారం నాటితో ఆ రికార్డును అధిగమించనున్నారు.
టాప్ సీఎంల లిస్ట్ ఇదే…
సిక్కిం డెమెక్రటిక్ ఫ్రంట్ నేత పవన్ కుమార్ ఛామ్లింగ్ 1994 డిసెంబర్ 12 నుండి 2019 మే 26 వరకు ఆయన ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. మొత్తం 24 ఏళ్ల 165 రోజుల పాటు పవన్ కుమార్ ఛామ్లింగ్ సిక్కిం ముఖ్యమంత్రిగా పని చేశారు. ఆయన తరువాత పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి జ్యోతీబసు 1977 జూన్ 21 నుండి 2000 నవంబరు 5వరకు బాధ్యతలు నిర్వర్తించారు. మొత్తంగా 23 ఏళ్ల 137 రోజుల పాటు పశ్చిమ బెంగాల్ సీఎంగా పనిచేసిన జ్యోతి బసు రెండో స్థానంలో నిలిచారు. ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ శనివారంతో జ్యోతీబసు రికార్డును సమం చేయగా ఆదివారం నుండి అధిగమించనున్నారు. నవీన్ పట్నాయక్ 2000 మార్చి 5నుండి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పని చేస్తున్నారు. ఆయన మరో ఏడాదిపై 28 రోజుల పాటు సీఎంగా కొనసాగినట్టయితే సిక్కిం సీఎంగా పని చేసిన పవన్ కుమార్ ఛామ్లింగ్ రికార్డును సమం చేయనున్నారు. భారతదేశంలోని రాష్ట్ర ముఖ్యమంత్రులుగా సుదీర్ఘ కాలం పనిచేసిన జాబితాలో అరుణాచల్ ప్రదేశ్ సీఎం జీగోంగ్ అపాంగ్ 1980 జనవరి 18 నుండి 1999 జనవరి 18వరకు, 2003 ఆగస్టు 3 నుండి 2007 ఏప్రిల్ 9వరకు పని చేసి 22 ఏళ్ల 250 రోజుల పాటు సేవలందించారు.