ఒడిశా మంత్రిపై దుండుగుల కాల్పులు చోటు చేసుకున్నాయి. ఇవాళ ఝార్సుగూడ జిల్లాలోని బ్రజరాజ్ నగర్ సమీపంలోని గాంధీచౌక్ సమీపంలో మంత్రి నవకిశోర్ దాస్‌పై గుర్తు తెలియని దుండగులు ఒక్కసారిగా కాల్పులు జరిపారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు.. దుండగులను అడ్డుకున్నారు. తీవ్ర గాయాల పాలైన నవ కిశోర్ దాస్‌ను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
ఝార్సుగూడలో ఓ కార్యక్రమానికి హాజరయ్యేందుకు వెళుతుండగా.. వాహనం దిగుతున్న సమయంలో మంత్రి నవ కిశోర్ దాస్‌పై కాల్పులు జరిపాడు. దీంతో ఆయన ఛాతిలోకి బుల్లెట్ దూసుకెళ్లింది. వెంటనే ఆయన్ను చికిత్స కోసం సమీపంలో ఆసుపత్రిలో చేర్చారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. కాగా, దాడి వెనుక ఉద్దేశాలు ఇంకా స్పష్టంగా తెలియరాలేదు. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులను పట్టుకునే పనిలో పడ్డారు.
అయితే మంత్రిపై దాడి విషయం తెలియగానే బీజేడీ కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. దీంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. గోపాలచంద్ర దాస్ అనే ఏఎస్సై సర్వీస్ రివాల్వర్‌తో మంత్రిపై కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది. మెరుగైన వైద్యం కోసం మంత్రిని హైదరాబాద్ తరలించే ప్రయత్నాలు చేస్తున్నారు. మంత్రిపై కాల్పుల గురించి తెలిసిన సీఎం నవీన్ పట్నాయక్ వెంటనే స్పందించారు. ఆయన ఆరోగ్యంపై అధికారులను అడిగి తెలుసుకున్నారు.
బీజేడీలో సీనియర్ నేత అయిన నవ కిశోర్ దాస్ ఓ దేవాలయానికి రూ.కోటికిపైగా విలువ చేసే బంగారు, వెండి ఆభరణాలు విరాళం ఇచ్చి వార్తల్లో నిలిచిన విషయం తెలిసిందే. అయితే, 2024 అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తోన్న వేళ మంత్రిపై దాడులు జరగడం పార్టీలో తీవ్ర ఆందోళనను రేకెత్తిస్తోంది. ఈ వ్యవహారంపై దర్యాప్తు ప్రారంభించినట్లు పోలీసులు ఉన్నతాధికారులు వెల్లడించారు.