ఒడిశా రైలు ప్రమాదం

అమీర్ ఖాన్ జేఈ అద్దె ఇల్లు సీజ్

సీబీఐ షాకింగ్ నిర్ణయం

దిశ దశ, ఒడిశా:

దేశ వ్యాప్తంగా సంచలనం కల్గించిన ఒడిశా రైల్ ప్రమాదంలో ఓ జూనియర్ ఇంజనీర్ అద్దె ఇంటిని సీబీఐ సీజ్ చేసింది. కొద్ది సేపటి క్రితం జూనియర్ ఇంజనీర్ అమీర్ ఖాన్ అద్దెకు ఉంటున్న ఇంటిని సీజ్ చేయడం కలకలం సృష్టిస్తోంది. బాలసోర్ ట్రిపుట్ ట్రైన్ యాక్సిడెంట్ పై విచారణ చేపట్టిన సీబీఐ ఈ నెల 16 వరకు క్షేత్ర స్థాయిలో దర్యాప్తు చేసి జూనియర్ ఇంజనీర్ అమీర్ ఖాన్ ను కూడా విచారించినట్టుగా తెలుస్తోంది. అదే రోజున బాలసోర్ ప్రాంతం నుండి తిరిగి వెల్లిపోయిన సీబీఐ బృందాలు మంగళవారం వచ్చి జేఈ అమీర్ ఖాన్ నివాసం ఉంటున్న అద్దె ఇంటిని సీజ్ చేయడం చర్చనీయాంశంగా మారింది. ఈ ట్రిపుల్ ట్రైన్ యాక్సిడెంట్లో 292 మంది మృత్యువాత పడగా, 900 మందికి పైగా గాయపడిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై దర్యాప్తు చేయాలని రైల్వే బోర్డు సీబీఐని కోరడంతో జాతీయ దర్యాప్తు సంస్థ ఎంట్రీ ఇచ్చింది. ఈ నెల 2న బహనాగా రైల్వే స్టేషన్ సమీపంలో జరిగిన మూడు రైళ్ల ప్రమాదం తరువాత అమీర్ ఖాన్ తో పాటు అతని కుటుంబ సభ్యుల ఆచూకి కూడా లభించడం లేదని అధికార వర్గాలు చెప్తున్నాయి. అయితే అమీర్ ఖాన్ ను సీబీఐ రహస్య ప్రాంతంలోకి తీసుకెళ్లి విచారించిన తరువాత ఢిల్లీకి వెల్లిపోయినట్టుగా స్థానికంగా ప్రచారంలో ఉంది. ఉన్నట్టుండి మంగళవారం సీబీఐ బృందం ఆయన అద్దె ఇంటిని సీజ్ చేయడం వెనక ఏం జరిగి ఉంటుందోనన్నదే హాట్ టాపిక్ గా మారింది. సిగ్నల్స్, ట్రాక్ సర్క్యూట్‌లు, పాయింట్ మెషీన్‌లు, ఇంటర్‌లాకింగ్ సిస్టమ్‌తో సహా సిగ్నలింగ్ పరికరాల ఇన్‌స్టాలేషన్, నిర్వహణ, మరమ్మతులకు సిగ్నల్ JE బాధ్యత వహించాల్సి ఉంటుందని రైల్వే అధికారులు చెప్తున్నారు. 24 గంటల పాటు రైళ్ల రాకపోకలు సాఫీగా సాగాడంలో సిగ్నల్ ఇంజనీర్ల పాత్ర కీలకం. ఒడిశా రైలు దుర్ఘటన “ఎలక్ట్రానిక్ ఇంటర్‌లాకింగ్ సిస్టమ్‌ విషయంలో ఉద్దేశపూర్వకంగా జోక్యం చేసుకోవడం” వల్లే జరిగిందని రైల్వే అధికారులు మొదటి నుండి చెప్తున్నారు. రూట్ క్లియర్ గా సెట్ చేచడం, సాంకేతిక సమస్యలు ఎదురు కాకుండా చూడడం వంటి చర్యలను ముందుగానే చెక్ చేసుకున్న తరువాతే గ్రీన్ సిగ్నల్ ఇవ్వాల్సి ఉంటుందని చెప్తున్నారు. ఎంత చిన్న సమస్య వచ్చినా, సాంకేతిక సమస్య ఉత్పన్నం అయనా గ్రీన్ సిగ్నల్ ఇవ్వకూడదని రైల్వే నియమావళి చెప్తోంది. ఇలాంటి సమయంలో ఎరుపు రంగు బల్బు వేసి ట్రాక్ క్లియర్ గా లేదన్న సంకేతాలు ఇవ్వాల్సి ఉంటుందని దీంతో ఆ ట్రాక్ మీదుగా వెల్లే ట్రైన్ ఎక్కడికక్కడ నిలిచిపోతుందని ఇలాంటి చర్యలు ప్రమాదాలకు తావివ్వకుండా ఉంటాయని రైల్వే అధికారులు చెప్తున్నారు. టెక్నికల్ సమస్య పరిష్కరం అయితే తప్ప గ్రీన్ సిగ్నల్ వెలగదని, ఇలాంటి పరిస్థితుల్లో మ్యానువల్ గా మారిస్తే తప్ప రెడ్ సిగ్నల్ పోయి గ్రీన్ లైట్ రావడం కుదరనే కుదరదన్న అభిప్రాయాలు రైల్వే అధికారులు వ్యక్తం చేస్తున్నారు. బాలాసోర్‌ రైలు ప్రమాదాన్ని విచారించేందుకు ఈ నెల 6న సీబీఐ రంగంలోకి దిగి ఎలక్ట్రానిక్ ఇంటర్‌లాకింగ్ సిస్టమ్‌ను ట్యాంపరింగ్ చేసిన విషయంపై వివిధ కోణాల్లో దర్యాప్తు చేపట్టింది. అయితే తాజాగా జూనీయర్ ఇంజనీర్ అమీర్ ఖాన్ అద్దె ఇంటిని సీజ్ చేసిన సీబీఐ అధికారులు బహనాగ బజార్‌ స్టేషన్ మాస్టర్‌తో సహా ఐదుగురు రైల్వే ఉద్యోగులను కూడా విచారిస్తున్నట్టు సమాచారం.

You cannot copy content of this page