జిల్లాలో సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీసు ఏర్పాటు
దిశ దశ, భూపాలపల్లి:
ఎట్టకేలకు ఆ జిల్లా వాసుల కష్టాలు తీరాయి. ఏండ్లుగా పొరుగు జిల్లా కేంద్రం చుట్టూ తిరుగుతూ ఇబ్బందులు పడ్డవారికి రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఇక నుండి జిల్లా కేంద్రంలోనే కమర్షియల్ భూ లావాదేవీలు చేసుకునేందుకు అనువుగా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం ఏర్పాటు చేస్తూ జీఓ జారీ చేసింది.
తీరనున్న ఇబ్బందులు
జిల్లాలోని 11 మండలాలకు చెందిన వారు ములుగు జిల్లా కేంద్రంలో ఉన్న సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో కమర్షియల్ భూములకు సంబంధించిన రిజిస్ట్రేషన్ల ప్రక్రియ కొనసాగించాల్సి వచ్చేది. జిల్లాలోని తూర్పు డివిజన్ ఐదు మండలాల ప్రజలు అప్పటి వరకు మంథని రిజిస్ట్రేషన్ కార్యాలయం ద్వారా సేవలు పొందుతుండే వారు. అయితే నూతన జిల్లాల ఆవిర్భావం తరువాత ములుగు జిల్లా కేంద్రానికి వెల్లాల్సిన పరిస్థితి తయారైంది. దీంతో లోతట్టు ప్రాంతాలకు చెందిన వారే అయినా ఇతర ప్రాంతాలకు చెందిన వారే అయినా కమర్షియల్ భూముల లావాదేవీలు అధికారికంగా చేసుకునేందుకు ములుగు వరకు వెల్లాల్సి వచ్చేది. కొత్త జిల్లాగా భూపాలపల్లి ఆవిర్భవించినా ఈ జిల్లా వాసులంతా కూడా పొరుగు జిల్లా కేంద్రానికి వెల్లి రిజిస్ట్ర్రార్ విభాగం సేవలు అందుకోవల్సి రావడంతో తీవ్ర ఇబ్బందులు పడ్డారు. సర్కారు తీసుకున్న నిర్ణయంతో తమ కష్టాలు తీరనున్నాయని భూపాలపల్లి జిల్లా ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సింగరేణి విస్తరించిన ప్రాంతం కావడంతో పాటు కాళేశ్వరం ప్రాజెక్టు, అంతరాష్ట్ర వంతెన, రోజు రోజుకు విస్తరిస్తున్న కాటారం సెంటర్ లతో నిత్యం భూ క్రయవిక్రయాలు ఈ ప్రాంతంలో తీవ్రంగా పెరిగిపోయాయి. అయితే వీరంతా కూడా రిజిస్ట్రేషన్ కోసం పొరుగు జిల్లా వరకు వెల్లడంపై అసహనం వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని గమనించిన రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ కూడా కొత్తగా సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయం ఏర్పాటు చేస్తూ జీఓ జారీ చేసింది. జీఓఎంఎస్ నెంబర్ 70 తేది 26.06.2023 న విడుదల చేసిన ప్రభుత్వం జులై నుండి భూపాలపల్లి నుండే సేవలు అందించాలని కూడా దిశానిర్దేశం చేసింది.