అధికారికంగా శ్రీపాదరావు జయంతి

దిశ దశ, హైదరాబాద్

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్ దుద్దిళ్ల శ్రీపాదరావు జయంతి వేడుకలు అధికారికంగా జరపాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు శనివారం ఉత్తర్వులు జారీ చేసింది తెలంగాణ ప్రభుత్వం. మార్చి 2న ఆయన జన్మదినాన్ని పురస్కరించుకుని స్టేట్ ఫంక్షన్ గా నిర్వహించాలని జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. కరీంనగర్ ఉమ్మడి జిల్లాలోని మంథని ఎమ్మెల్యేగా మూడుసార్లు గెలిచిన శ్రీపాదరావు స్పీకర్ గా పని చేశారు. కాటారం మండలం ధన్వాడ గ్రామానికి చెందిన శ్రీపాదరావు సర్పంచ్ గా, సమితి ఉపాధ్యక్షుడిగా ఎల్ఎంబి బ్యాంక్ చైర్మన్ గా బాధ్యతలు నిర్వర్తించారు. 1983 నుండి వరుసగా మూడుసార్లు మంథని ఎమ్మెల్యేగా గెలిచారు. 1999 ఏప్రిల్ 13న మహదేవపూర్ మండలం అన్నారం సమీపంలో అప్పటి పీపుల్స్ వార్ నక్సలైట్లు హత్య చేశారు. అజాత శత్రువుగా పేరొందిన శ్రీపాదరావును బుచ్చి పంతులు అని పిలిచేవారు. ఆయన మరణానంతరం వారసుడిగా రాజకీయాల్లోకి వచ్చిన దుద్దిళ్ల శ్రీధర్ బాబు మంథని నుండి ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ప్రస్తుతం ఆయన ఐటి, పరిశ్రమల శాఖల మంత్రిగా వ్యవహరిస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్యాబినెట్లో కీలక భూమిక పోషిస్తున్నారు. తాజాగా తెలంగాణ ప్రభుత్వం శ్రీపాదరావు జయంతిని అధికారికంగా చేపట్టాలని ఉత్తర్వులు జారీ చేయడంతో అరుదైన గుర్తింపునిచ్చినట్టయింది.

You cannot copy content of this page