10 టేబుళ్లు… స్కానర్లు… ప్రింటర్లు
దర్మపురి స్ట్రాంగ్ రూంలో ఏం జరుగుతోంది?
దిశ దశ, జగిత్యాల:
జగిత్యాల జిల్లా ధర్మపురి ఈవీఎం స్ట్రాంగ్ రూంలో రికార్డుల సేకరణ కార్యక్రమం ఆదివారం మద్యాహ్నం నుండి సాగుతోంది. హై కోర్టు ఆదేశాలతో జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ యాస్మిన్ భాషా సమక్షంలో కౌంటింగ్ కు ప్రక్రియకు సంబంధించి వివరాలను సేకరించే పనిలో నిమగ్నం అయ్యారు. మద్యాహ్నం వరకు తాళాలు పగల గొట్టడం, ట్రంక్ బాక్సులను ఓపెన్ చేయడం వంటి పనులు చేపట్టిన అధికారులు ఆ తరువాత డాక్యూమెంట్ల నఖల్లను సేకరిస్తున్నారు.
ఎలా చేపడుతున్నారు..?
అయితే కోర్టులో విచారణలో ఉన్న ధర్మపురి ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ సంబంధించిన 17ఏ, 17సి, 17 సి పార్ట్ 2 ఫామ్స్ నఖల్లను సేకరించేందుకు జిల్లా అధికారులు భారీ కసరత్తు చేశారు. ఈ నెల 10న స్ట్రాంగ్ రూమ్స్ ఉన్న మెయిన్ డోర్ సమీపంలోకి మీడియాను అనుమతించిన అధికారులు ఆదివారం మాత్రం వీఆర్కె కాలేజీ మెయిన్ గేటు వరకే పరిమితం చేశారు. గేట్ వద్ద పోలీసు అధికారులను నియమించి కేవలం జిల్లా అధికార యంత్రాంగం జారీ చేసిన ఐడీ కార్డులు ఉన్న వారిని మాత్రమే లోపలకు అనుమతించే విధంగా చర్యలు తీసుకున్నారు. అంతేకాకండా స్ట్రాంగ్ రూం ఎంట్రన్స్ వద్ద కూడా ప్రత్యేకంగా పోలీసులను నియమించి లోపల డ్యూటీ చేసేందుకు వెల్లే వారి మొబైల్ ఫోన్లను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఏ స్థాయి అధికారి ఫోన్ అయినా స్ట్రాంగ్ రూం మెయిన్ ఎంట్రన్ప్ వద్దే వదిలేయాలని కలెక్టర్ యాస్మిన్ భాషా ఆదేశాలు జారీ చేశారు. స్ట్రాంగ్ రూం లాక్స్ బ్రేక్ నుండి మొదలు పరిశీలించిన తీరు. ట్రంక్ బాక్సుల తాళాలు ఓపెన్ చేసిన తీరు, సంబంధిత ఫామ్స్ నఖల్లు సిద్దం చేస్తున్న తీరును క్షుణ్నంగా వీడియో ద్వారా చిత్రీకరిస్తున్నారు. ఈ తంతుకు సంబంధించిన ప్రతి అంశాన్ని కూడా రికార్డు చేయాలని హైకోర్టు ఆదేశించడంతో ఈ మేరకు చర్యలు తీసుకున్నారు.
10 టేబుళ్లు… స్కానర్లు…
హై కోర్టుకు సమర్పించాల్సిన 268 పోలింగ్ బూతులకు సంబంధించిన ఫామ్స్ నఖల్లు సేకరించేందుకు స్ట్రాంగ్ రూంలో ప్రత్యేకంగా 10 టేబుళ్లను ఏర్పాటు చేశారు. స్కానర్లు, ప్రింటర్లను కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేసి బూతుల వారిగా డాక్యూమెంట్ల నఖల్లను సిద్దం చేస్తున్నారు. ఇందులో 17ఏ, 17 సి, 17 సి పార్టు 2 ఫామ్స్ అన్నింటిని కూడా స్కాన్ చేసి ప్రింట్ చేసే పనిలో జిల్లా అధికార యంత్రాంగం నిమగ్నం అయింది. ధర్మపురి నియోజకవర్గానికి సంబంధించిన మొత్తం డాక్యూమెంట్లు ప్రింట్ చేసి సీల్డ్ కవర్లలో ఉంచి హైకోర్టుకు సమర్పించేందుకు సిద్దం చేసేవరకు స్ట్రాంగ్ రూం నుండి డ్యూటీలో ఉన్న యంత్రాంగం ఎవరూ కూడా బయటకు వచ్చే అవకాశాలు లేవు. ఈ ప్రక్రియ అంతా ముగిసే వరకు రాత్రి 11 గంటలు అయ్యే అవకాశాలు ఉన్నాయని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ ప్రక్రియలో భాగస్వామ్యం అవుతున్న అధికార యంత్రాంగానికి భోజన ఏర్పాట్లు కూడా చేస్తోంది జిల్లా అధికార యంత్రాంగం.
అవినాష్ కుమార్ పర్యవేక్షణ
కోర్టు పరిధిలో ఉన్న ధర్మపురి ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ విషయంలో ఎన్నికల కమిషన్ కూడా తీవ్రంగానే పరిగణించినట్టుంది. స్ట్రాంగ్ రూం కీస్ మిస్సింగ్ మిస్టరీపై విచారణ జరపాలని రాష్ట్ర హైకోర్టు ఈసీఐని ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఇటీవల ప్రిన్సిపల్ సెక్రటరీ అవినాష్ కుమార్ తో పాటు పలువురు అధికారులు విచారణ జరిపిన సంగతి తెలిసిందే. అయితే ఆదివారం నాడు స్ట్రాంగ్ రూమ్స్ లాక్స్ బ్రేక్ చేయాలని కోర్టు ఆదేశించడంతో తిరిగి భారత ఎన్నికల సంఘం ప్రిన్సిపల్ సెక్రటరీ అవినాష్ కుమార్ మళ్లీ జగిత్యాలకు చేరుకున్నారు. కౌంటింగ్ ప్రక్రియకు సంబంధించిన వివరాలు సేకరించే స్ట్రాంగ్ రూంలోకి అవినాష్ కుమార్, జిల్లా కలెక్టర్, యాస్మిన్ భాష, అడిషనల్ కలెక్టర్ లతల ఫోన్లను మాత్రమే లోపలకు అనుమతించారు.