ఎల్లంపల్లి నుండి నీటి తరలింపు షురూ…

దిశ దశ, పెద్దపల్లి:

శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు నుండి ఎగువ ప్రాంతాలకు నీటిని ఎత్తిపోసే ప్రక్రియ మొదలైంది. ఈ ప్రాజెక్టుకు ఎగువ ప్రాంతం నుండి భారీగా వరద నీరు వచ్చి చేరుతుండడంతో ఇక్కడి నుండి నందిమేడారం పంప్ హౌజ్ కు నీటిని తరలించే ప్రక్రియకు శ్రీకారం చుట్టారు.

వచ్చి చేరుతున్న నీరు…

కడెం నారాయణ రెడ్డి ప్రాజెక్టుతో పాటు క్యాచ్ మెంట్ ఏరియాల నుండి శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చింది. ఈ నెల 18న 20.175 టీఎంసీల సామర్థ్యం ఉన్న ఈ ప్రాజెక్టులో 5.1409 టీఎంసీల నీరు మాత్రమే నిలువ ఉండేది. కడెం నారాయణ రెడ్డి ప్రాజెక్టు గేట్లు ఎత్తడం, క్యాచ్ మెంట్ ఏరియాల నుండి నీరు వస్తుండడంతో ప్రస్తుతం ఎల్లంపల్లిలో 17.3969 టీఎంసీలకు నిలువ ఉంది. దీంతో అధికారులు శనివారం మద్యాహ్నం నుండి ధర్మారం మండలం నందిమేడారంలోని నంది పంప్ హౌజుకు 9,450 క్యూసెక్కుల నీటిని వదిలారు. ఇక్కడి నుండి కరీంనగర్ జిల్లా రామడుగు మండలం లక్ష్మీపూర్ గాయత్రి పంప్ హౌజ్ కు నీటిని ఎత్తిపోసేందుకు అదికారులు చర్యలు చేపట్టారు. నందిమేడారంలోని 4, 6 పంపులను స్టార్ట్ చేసిన అధికారులు గాయత్రి పంప్ హౌజుకు ఎల్లంపల్లి నుండి తరలివస్తున్న నీటిని ఎత్తిపోస్తున్నారు. గాయత్రి పంప్ హౌజ్ నుండి శనివారం సాయంత్రం  రాజన్న సిరిసిల్ల జిల్లాలోని మిడ్ మానేరు ప్రాజెక్టుకు ఎత్తిపోయనున్నారు. మిడ్ మానేరు జలాశయం నిండిన తరువాత ఎల్ఎండీకి, ఆ తరువాత అనంతగిరి ప్రాజెక్టు మీదుగా సిద్దిపేట జిల్లాలోని వివిధ ప్రాజెక్టులకు నీటిని తరలించే అవకాశం ఉంది.

కడెం నుండి బ్రేక్… 

అయితే ఎల్లంపల్లి ప్రాజెక్టుకు శనివారం ఉదయం 9 గంటల వరకు కడెం నారాయణరెడ్డి ప్రాజెక్టు నుండి వచ్చిన ఇన్ ఫ్లో ఆగిపోయింది. శనివారం ఉదయం వరకు 4,195 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరగా మద్యాహ్నం 12 గంటల నుండి మాత్రం కడెం నీరు ఎల్లంపల్లికి రావడం ఆగిపోయింది. అయితే క్యాచ్ మెంట్ ఏరియాల నుండి 13, 631 క్యూసెక్కుల వరద నీరు ఎల్లంపల్లికి వస్తోంది. దీంతో ఈ ప్రాజెక్టులోని నీటిని ఎగువ ప్రాంతానికి తరలించినట్టయితే ఎస్సారెస్పీ, కడెం ప్రాజెక్టు గేట్లు ఎత్తినట్టయితే అక్కడి నుండి వచ్చే నీటిని ఇక్కడే స్టోర్ చేసి ఎగువ ప్రాంతాలకు తరించే విధంగా ప్రణాళికలు తయారు చేసుకున్నట్టుగా తెలుస్తోంది. మహారాష్ట్రలో కూడా వర్షాలు విపరీతంగా కురుస్తున్నందున వరద నీరు వచ్చి చేరే అవకాశాలు ఉన్నాయని అంచనా వేస్తున్నారు. దీంతో ఎగువ ప్రాంతంలో ఖాలీ అయిన జలశయాలను నింపినట్టయితే ఆ తరువాత ఎల్లంపల్లికి చేరుకోనున్న నీటిని కూడా సమృద్దిగా వాడుకునే అవకాశం ఉంటుందని అధికారులు భావిస్తున్నట్టుగా సమాచారం. 

You cannot copy content of this page