అంజన్న ఆలయ ట్రస్టీకి షాక్…
దిశ దశ, జగిత్యాల:
హుండీ లెక్కింపు వ్యవహారంలో హస్తలాఘవాన్ని ప్రదర్శించిన ఓ ఫౌండర్ ట్రస్టీపై వేటు పడింది. మూడో నేత్రంలో రికార్డయిన దృశ్యాలు రెడ్ హ్యాండెడ్ గా పట్టించడంతో అతనిపై చర్యలు తీసుకోక తప్పలేదు. సంఘటనా వివరాల్లోకి వెల్తే… జగిత్యాల జిల్లా కొండగట్టు ఆంజన్న క్షేత్రంలో ఆగస్టు 9న హుండీ లెక్కింపు ప్రక్రియ కొనసాగింది. ఈ సమయంలో ఆలయ ఫౌండర్ ట్రస్టీ మారుతి స్వామి బంగారు వస్తువును చేతి వేళ్లకు తగిలించుకుని వెళ్లినట్టుగా ఆలయ ధర్మకర్త జున్న సురేందర్, ముత్యంపేట సర్పంచ్ తిరుపతి రెడ్డిలు ఆలయ ఈఓకు ఫిర్యాదు చేశారు. సీసీ ఫుటేజీ ఆధారంగా విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని వారు వినతి చేశారు. ఈ మేరకు ఆగస్టు 19న దేవాదాయ అడిషనల్ కమిషనర్ కృష్ణవేణి విచారణ చేపట్టారు. ఇందులో భాగంగా కొండగట్టు ఔట్ పోస్ట్ సీసీ ఫుటేజీలతను పరిశీలించడంతో బంగారు వస్తువు తన చేతి వేళ్లకు తగిలించుకున్నట్టుగా గుర్తించారు. ఈ మేరకు అడిషనల్ కమిషన్ దేవాదాయ శాఖ కమిషనర్ కు ఇచ్చిన నివేదిక ఆధారంగా ఫౌండర్ ట్రస్టీ మారుతి స్వామిని సస్పెన్షన్ చేస్తూ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ విషయాన్ని ఆలయ ఏఈఓ బుద్ది శ్రీనివాస్ మీడియాతో ధృవీకరించారు. అయితే ఈ విషయంపై శాఖపరమైన చర్యలతోనే సరిపెడ్తారా లేక చట్టపరమైన చర్యలు తీసుకుంటారా అన్న విషయంపై మాత్రం స్పష్టత లేదు. దేవాదాయ శాఖ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు కొండగట్టు ఆలయ అధికారులు నడుచునే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తోంది. ఏది ఏమైనా కొండగట్టు అంజన్న ఆలయంలో జరిగిన ఈ ఘటన చర్చనీయాంశంగా మారింది.