ఖాళీ అవుతున్న అన్నారం…

దిశ దశ, భూపాలపల్లి:

కాళేశ్వరం ప్రాజెక్టులోని మరో బ్యారేజ్ బ్యాక్ వాటర్ దిగువకు వదులుతున్నారు. అన్నారం బ్యారేజీలో నిలువ ఉన్న 2 టీఎంసీల నీటిని దిగువకు వదలాలని ఉన్నతాధికారులు ఆదేశించడంతో శనివారం గేట్లు ఎత్తారు. ఉదయం 5 గేట్లను ఎత్తగా మద్యాహ్నం కల్లా 10 గేట్లను ఎత్తి 2 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలేస్తున్నారు. అన్నారంలో 2 టీఎంసీల బ్యాక్ వాటర్ నిలువ ఉన్నట్టుగా అధికారులు చెప్తున్నారు. ఈ బ్యారేజీ మొత్తం ఖాలీ అయిన తరువాత మరమ్మత్తులు చేసే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తోంది. నిర్మాణ కంపెనీ కూడా రిపేర్లు చేస్తామని చెప్తుండడంతో అన్నారం బ్యారేజీ నీటిని దిగువకు వదులుతున్నట్టుగా అధికార వర్గాలు చెప్తున్నాయి. అయితే అన్నారం బ్యారేజీకి గేట్లకు దిగువన బుంగలు పడడంతో అదంతా సేపేజ్ అంటూ కప్పి పుచ్చిన అధికారులు ఆ తరువాత కొన్ని చోట్ల మరమ్మత్తులు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా మరిన్ని చోట్ల మరమ్మత్తులు చేసేందుకు నీటిని వదిలేస్తుండడం గమనార్హం. అయితే గతంలోనే నిర్మాణ కంపెనీ రిపేర్లు చేసేందుకు ముందుకు వచ్చినప్పటికీ నీటి నిలువ ఉంచారని, తాజాగా సీఐ సుధాకర్ రెడ్డికి బాధ్యతలు అప్పగించడంతో నీటిని దిగువకు వదలాలని ఆదేశాలు జారీ చేశారని స్థానికంగా ప్రచారం జరుగుతోంది.

లీకేజీలున్నాయా..?

అయితే అన్నారంలోనూ లీకేజీలు ఉన్నాయని అసెంబ్లీలో శ్వేత పత్రం సమర్పించినప్పుడు మంత్రి ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. మేడిగడ్డలోనే కాదు అన్నారం బ్యారేజీలోనూ లోపాలు ఉన్నాయని చెప్పడం, మంత్రి ప్రకటనకు కొన్ని గంటల ముందు నీటిని దిగువకు వదలడం ఆశ్యర్యానికి గురి చేస్తోంది. క్షేత్ర స్థాయిలో అధికారులు మాత్రం మరమ్మత్తుల కోసమేనని చెప్తున్నప్పటికీ భారీ లోపం ఏదైనా గుర్తించారా అన్న చర్చ మొదలైంది. మరో వైపున నేషలనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ (ఎన్డీఏస్ఏ) నిపుణుల బృందం గత నవంబర్ లోనే మేడిగడ్డతో పాటు అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు కూడా3 ఒకే డిజైన్ లో నిర్మించారని తేల్చింది. ఈ రెండు బ్యారేజీల్లోనూ నీటిని దిగువకు వదిలి లోపాలను గుర్తించాల్సి ఉందని కూడా ఎన్డీఎస్ఏ తన నివేదికలో స్పష్టం చేసింది. అయితే అప్పుడు ఎన్డీఎస్ఏ ఇచ్చిన రిపోర్టును తప్పు పడుతూ ఇరిగేషన్ ఉన్నతాధికారులు కౌంటర్ లేఖలు రాశారు. అసలు అన్నారం బ్యారేజీని సందర్శించకుండానే ఎలా లోపాలు చూపుతారంటూ ప్రశ్నించారు. మరో వైపున అన్నారంలో ఉన్న నీటిని అప్పుడు దిగువకు వదిలిన అధికారులు కొంత నిలువ అలాగే ఉంచారు. గేట్లకు దిగువన పడ్డ బుంగలను పూడ్చడంతో పాటు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిన తరువాత ఇప్పుడు మళ్లీ రిపేర్ల కోసం 2 టీఏంసీల నీటిని వదిలేస్తుండడం హాట్ టాపిక్ గా మారింది.

You cannot copy content of this page