దిశ దశ, నిజామాబాద్:
మరి కొన్ని గంటల్లో అన్నా చెల్లెల్ల అనుభందానికి ప్రతీక అయిన రక్షాబంధన్ పర్వదినం జరగనుంది. ఈ వేడుకల్లో బాగంగా సోదరుని చేతికి రాఖీ కట్టి స్వీట్ తినిపించడం సాంప్రాదాయంగా వస్తోంది. అయతే ఆ ప్రాంతంలో దశాబ్దాల కాలంగా సంబరాలతో పాటు తీపి కబుర్లను పంచుకోవడంలో తనవంతు పాత్ర పోషించిన ఆ స్వీట్ షాప్ యాజమాన్యం చేదు వార్తను అందించింది. రాఖీ పౌర్ణమి రోజున ప్రెష్ మిఠాయి కొనుక్కుని సోదరుల నోరు తీపి చేద్దామని కలలు కన్న ఆడపడుచులకు ప్రముఖ మిఠాయి దుకాణం యాజమాన్యం తీసుకున్న నిర్ణయం సంచలనంగా మారింది. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో దాదాపు ఐదు దశాబ్దాలుగా స్వీట్స్ విక్రయిస్తున్న ‘‘ఢిల్లీ వాలా స్వీట్ హోమ్’’ యాజమాన్యం ఓ హట్ హాట్ బ్యానర్ ను ఏర్పాటు చేసి దుకాణాన్ని క్లోజ్ చేసింది. నగరంలోని రాష్ట్రపతి రోడ్డులో ఉన్న ఈ స్వీట్ హోమ్ లో కొనుగోలు చేసేందుకు వందల సంఖ్యలో వినయోగదారులు రాకపోకలు సాగిస్తుంటారు. అసలే ఇరుకుగా ఉన్న నిజామాబాద్ రోడ్లలో వాహనాల రాకపోకలకు ఇబ్బందికరంగా మారింది. ఢిల్లీ వాలా స్వీట్ హోమ్ ముందు కూడా పెద్ద ఎత్తున వాహనాల పార్కింగ్ ఉంటున్న విషయాన్ని గమనించిన పోలీసులు స్వీట్ షాపు యజమానికి అంక్షలు విధించారు. ట్రాఫిక్ క్రమబద్దీకరణకు ఆటంకం కలగకుండా చూసుకోవాలని, వాహనాల పార్కింగ్ వంటి విషయాల్లో ప్రత్యేకంగా చొరవ తీసుకోవాలని నగర పోలీసులు ఢిల్లీ వాలా స్వీట్ హోమ్ యజమానికి హెచ్చరికలు జారీ చేశారు. దీంతో రాఖీ పౌర్ణమికి ముందు రోజున స్వీట్ షాప్ యజమానికి ఓ భారీ ఫ్లెక్సీని ఏర్పాటు చేసి షాపు క్లోజ్ చేస్తున్నామని వెల్లడించారు. అంతేకాకుండా పోలీసుల వేధింపులే కారణమని కూడా అందులో పేర్కొన్నారు. దీంతో ఈ ప్లెక్సీ ఫోటో సోషల్ మీడియా వేదికల్లో తెగ చక్కర్లు కొడుతోంది.