వైరల్ అవుతున్న ఓ లేఖ…
దిశ దశ, వరంగల్:
సిల్వర్ జుబ్లీ సెలబ్రేషన్స్ ఏర్పాట్లలో బిజీ బిజీగా ఉన్న గులాభి పార్టీ అధినేత ముందు ఉద్యమకారులు ఓ డిమాండ్ ఉంచారు. తమ కోరిక మేరకు నిర్ణయం తీసుకోవల్సిందేనని కోరుతూ విడుదల చేసిన ఆ లేఖ నెట్టింట వైరల్ అవుతోంది. బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్ర శేఖర్ రావు గారికి లేఖ పేరిట విడుదలైన ఈ ప్రకటనలో స్వరాష్ట్ర కల సాకారం కావడంలో భాగస్వాములు అయిన ఉద్యమకారులు కీలకమైన అంశాన్ని వెల్లడించారు. ఈ నెల 27న జరిగే మీ పార్టీ బహిరంగ సభలో తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమంపై ప్రకటన చేయాలని కోరారు. తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఛైర్మన్ డాక్టర్ చీమ శ్రీనివాస్ పేరిట విడుదలైన ఈ లేఖలో… తెలంగాణ ఉద్యమ నాయకుడిగా మాకు మీపై చాలా గౌరవం, అభిమానం ఉన్నాయి… కానీ మీరు ముఖ్యమంత్రి అయిన తరువాత 10 సందత్సరాలు ఉద్యమకారుల సంక్షేమం కోసం ప్రత్యేక పథకం పెట్టకుండా పూర్తిగా నిర్లక్ష్యం చేశారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో మీరు ఓడిపోవడానికి కారణం తెలంగాణ ఉద్యమ కారులను నిర్లక్ష్యం చేయటమే. 27న జరుగుతున్న మీ పార్టీ బహిరంగ సభలో తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమం, ఆత్మ గౌరవానికి మద్దతుగా ప్రకటన చేయాలని కోరుతున్నాం అంటూ ఆ లేఖ ద్వారా తమ గళాన్ని వినిపించే ప్రయత్నం చేశారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ లేఖను ఉద్యమకారులు షేర్ చేస్తుండడం విశేషం.