మరోసారి ప్రివిలేజ్ పిటిషన్..
ముచ్చటగా మూడో సారి
దిశ దశ, కరీంనగర్:
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ వర్సెస్ పోలీసులు అన్నట్టుగా తయారైంది రాష్ట్రంలో. ఎలాంటి ఆందోళనలు జరిగినా పోలీసులు సంజయ్ ని కస్టడీలోకి తీసుకోవడం ఆయన స్పీకర్ కు ఫిర్యాదు చేయడం ఇది మూడో సారి. దేశంలోనే ఒక ఎంపీ పోలీసులపై ప్రివిలేజ్ పిటిషన్ మూవ్ చేయడం చాలా అరుదుగా ఉంటుంది. కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ మాత్రం ఏకంగా మూడు సార్లు కరీంనగర్ పోలీసులపై ఫిర్యాదు చేశారు. ఇప్పటికే రెండు సార్లు సంజయ్ చేసిన ఫిర్యాదు కారణంగా పలుమార్లు కరీంనగర్ సీపీ, ఏసీపీ, సీఐలు లోకసభ స్పీకర్ వద్ద హాజరయ్యారు. తాజాగా మరోసారి సంజయ్ ప్రివిలేజ్ పిటిషన్ మూవ్ చేయడంతో కరీంనగర్ పోలీసులు మళ్లీ దేశ రాజధానికి వెల్లక తప్పదు.
ఆర్టీసీ సమ్మెతో స్టార్ట్…
కరీంనగర్ లోక సభ పరిధిలోని ఏడు సెగ్మెంట్లలో ప్రజలతో మమేకం కావాలన్న లక్ష్యంతో ఎంపీ బండి సంజయ్ కమలాపూర్ నుండి పాదయాత్ర స్టార్ట్ చేశారు. ఈ క్రమంలో కరీంనగర్ చేరుకునే సరికి ఆర్టీసీ సమ్మెకారణంగా డ్రైవర్ చనిపోవడంతో అర్థాంతరంగా తన పాదయాత్రను రద్దు చేసుకున్న సంజయ్ డ్రైవర్ కుటుంబానికి సంఘీభావం తెలిపేందుకు వెల్లారు. ఈ క్రమంలో బాధిత కుటుంబానికి బాసటనిచ్చిన సంజయ్ మృతదేహాన్ని అక్కడే ఉంచి నిరసన చేపట్టారు. ఈ క్రమంలో పోలీసులు పెద్ద ఎత్తున అక్కడకు చేరుకుని ఆందోళనలను విరమింపజేసే ప్రయత్నం చేసినా బండి సంజయ్ సహా బీజేపీ శ్రేణులు ససేమిరా అన్నారు. దీంతో పోలీసులకు బీజేపీ శ్రేణులకు మధ్య జరిగిన వాగ్వాదం కాస్తా ఉద్రిక్తలకు దారి తీసింది. ఈ క్రమంలో తనపై పోలీసులు దురుసుగా ప్రవర్తించారంటూ లోక సభ స్పీకర్ కు ఫిర్యాదు చేశారు. దీంతో స్పీకర్ కార్యాలయం నుండి పలువురు పోలీసు అధికారులకు సమన్స్ జారీ కావడంతో ఢిల్లీకి వెల్లి తమ వాదనలు వినిపించారు. ఆ తరువాత టీచర్ల బదిలీల వ్యవహారంలో విడుదలైన జీఓ టీచర్లకు అశనిపాతంగా మారిందని దీనివల్ల ఉపాధ్యాయ లోకం అంతా నష్టపోతోందని బండి సంజయ్ ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ జీఓ విషయంలో పునరాలోచించుకోవాలన్న డిమాండ్ తో కరీంనగర్ లోని ఎంపీ కార్యాలయంలో దీక్షకు కూర్చున్నారు. అర్థరాత్రి వరకూ అక్కడకు చేరుకున్న పోలీసు బలగాలు బండి సంజయ్ ని అరెస్ట్ చేయాలని నిర్ణయించుకోగా కార్యాలయానికి లోపల తాళం వేసుకుని సంజయ్ సహ పలువురు బీజేపీ నాయకులు అందులోనే ఉండి పోయారు. దీంతో పోలీసులు గ్యాస్ కట్టర్ల సాయంతో గ్రిల్స్ డోర్లను తొలగించి మరీ సంజయ్ ని మానకొండూరు పోలీస్ స్టేషన్ కు తరలించారు. తన కార్యాలయంలోకి పోలీసులు బలవంతంగా చొరబడ్డారని, లోకసభ సభ్యునికి ఇవ్వాల్సిన ప్రోటోకాల్ విస్మరించారంటూ మరోసారి స్పీకర్ కార్యాలయానికి ఫిర్యాదు చేశారు. దీంతో కరీంనగర్ పోలీసులకు మరోసారి ప్రివిలేజ్ పిటిషన్ నోటీసులు జారీ అయ్యాయి. తాజాగా మంగళవారం అర్థరాత్రి కరీంనగర్ లోని జ్యోతినగర్ లో ఉన్న బండి సంజయ్ ని పోలీసులు అరెస్ట్ చేశారు. కారణం చెప్పకుండా వారెంట్ చూపించకుండా అరెస్ట్ చేసి బొమ్మల రామారం పోలీస్ స్టేషన్ కు తరలించడంతో మళ్లీ బండి సంజయ్ ప్రివిలేజ్ పిటిషన్ దాఖలు చేస్తున్నట్టు తెలిపారు. ఇప్పటికి మూడు సార్లు పోలీసులే లక్ష్యంగా బండి సంజయ్ లోకసభ స్పీకర్ కార్యాలయంలో ఫిర్యాదు చేయడం సంచలనంగా మారింది.
సమిధులవుతున్నారా..?
అయితే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ విషయంలో వ్యవహరిస్తున్న తీరు కారణంగా పోలీసులు సమిధులుగా మారుతున్నట్టుగా స్పష్టమవుతోంది. సంజయ్ ని అరెస్ట్ చేయాలన్న ఆదేశాలు ఉన్నతాధికారుల నుండి రావడం క్షేత్ర స్థాయి పోలీసులు తప్పని సరి పరిస్థితుల్లో అతన్ని అరెస్ట్ చేయడం జరుగుతోంది. ఈ క్రమంలో బండి సంజయ్ ప్రివిలేజ్ పిటిషన్ మూవ్ చేస్తుండడంతో పోలీసులు ఢిల్లీ చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఏర్పడింది. లోక సభ స్పీకర్ అధికారాల దృష్ట్యా డిసిప్లేనరీ డిపార్ట్ మెంట్ కు చెందిన తాము ఖచ్చితంగా వెల్లి తీరాల్సిందేనని లేనట్టయితే మళ్లీ మళ్లీ నోటీసులు జారీ అవుతూనే ఉంటాయని పోలీసు వర్గాలు అంటున్నాయి. స్పీకర్ వెంటనే కేసుపై నిర్ణయం తీసుకోనట్టయితే ఎప్పుడు పిలుపు వచ్చినా పార్లమెంటుకు చేరుకోవల్సి ఉంటుందని చెప్తున్నారు. ఒక వేళ స్పీకర్ ఇచ్చిన నోటీసులకు రెస్పాండ్ కాకపోతే శాఖపరమైన చర్యలకు సిఫార్సు చేసే అవకాశం కూడా ఉంటుందని తెలుస్తోంది. దీంతో కరీంనగర్ పోలీసుల పరిస్థితి విడవమంటే పాముకు కోపం, పట్టమంటే కప్పకు కోపం అన్నట్టుగా తయారైంది.