పలు జిల్లాలు అతలాకుతలం
దిశ దశ, కరీంనగర్:
ప్రకృతి ప్రకోపం ఇంకా కొనసాగుతున్నట్టుగా ఉంది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో గురువారం అర్థరాత్రి నుండి ఈదురు గాలులు, వర్షం బీభత్సం సృష్ఠించడంతో జనజీవనం అతలాకుతలమై పోయింది. పంటలు తీవ్రంగా నష్టపోయి రైతాంగం అంతా మరింత నష్టపోయే ప్రమాదంలో చిక్కుకుంది. గురువారం అర్థరాత్రి జగిత్యాల జిల్లాలోని కోరుట్ల, మెట్ పల్లి ప్రాంతాల్లో అతి వేగంగా వీచిన ఈదురు గాలులతో విద్యుత్ స్తంభాలు నేలకూలాయి. దీంతో ఆ ప్రాంతంలో విద్యుత్ సరఫరా నిలిచిపోగా, నిజామాబాద్ హైవేపై రాకపోకలు తాత్కాలికంగా నిలిచిపోయాయి. ఇదే సమయంలో వర్షం కూడా కురియడంతో సామాన్య జనం తీవ్ర ఇబ్బందుల పాలయ్యారు. ట్రాన్స్ కో అధికారులు విద్యుత్ సరఫరాను పరిష్కరించి రోడ్లపై పడిపోయిన స్తంభాలను తొలగించడంతో వాహనాల రాకపోకలు యథావిధిగా సాగాయి. ఈదురుగాలులు, వర్షం ప్రభావం ఉత్తర తెలంగాణాలోని పలు జిల్లాల్లో కూడా ఉండడంతో మామిడి పంటపై తీవ్ర ప్రభావం పడింది. దక్షిణాది రాష్ట్రాల్లోనే అతి ఎక్కువ మామిడి ఎగుమతి చేసే జగిత్యాల జిల్లాల్లో వేలాది ఎకరాల్లో మామిడి కాయ రాలిపోయింది. కోతకు వచ్చిన సమయంలో ఈదురుగాలుల కారణంగా పంట అంతా కూడా నేలరాలిపోయిందని రైతాంగం ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఈ సీజన్ లో అకాల వర్షాలు రెండో సారి కావడంతో ఇతర పంటలకు కూడా నష్టం వాటిల్లింది. కోతకు వచ్చిన వరి పొలాల్లో వర్షపు నీరు చేరడంతో మురిగిపోయే ప్రమాదం ఉండగా, కొన్ని ప్రాంతాల్లో ఈదురు గాలుల కారణంగా వరి నేలకు వాలిపోయింది. ఒక్క సారిగా వాతావరణంలో వచ్చిన మార్పులతో ప్రజలు ఉక్కిరిబిక్కిరయ్యారు. ఈదురు గాలుల ప్రభావంతో చాలా చోట్ల విద్యుత్ సరఫరా నిలిపోయింది. దీంతో తమకు సమాచారం ఇచ్చిన వెంటనే విద్యుత్ సరఫరా పునరుద్దరిస్తామని ట్రాన్స్ కో అధికారులు ప్రకటించారు.
Disha Dasha
1884 posts
Prev Post
Next Post