కిష్టంపేటలో చేపల వేటకు వెళ్లి ఒకరి మృత్యువాత

దిశ దశ, పెద్దపల్లి:

పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలం కిష్టంపేట సమీపంలోని మానేరు నదిలో చేపల వేటకు వెళ్లిన ఓ వ్యక్తి మృత్యువాత పడినట్టుగా తెలుస్తోంది. సంచార జాతికి చెందిన బండి కొమురయ్య అనే వ్యక్తి శనివారం మానేరు నదిలో చేపలు పట్టేందుకు వెళ్లి ఇసుక తవ్వకాల కారణంగా ఏర్పడిన గోతిలో పడి మరణించినట్టుగా సమాచారం. అయితే కొమురయ్య మృత దేహాన్ని శవపంచనామ చేయకుండానే ఘటనా స్థలం నుండి తరలించారని మీర్జంపేట ఎంపీటీసీ సభ్యుడు జనార్థన్ రెడ్డి ఆరోపించారు. సాయంత్రం నాలుగు గంటల ప్రాంతంలో జరిగిన ఘటనను బయటకు పొక్కకుండా జాగ్రత్తలు తీసుకుని రాత్రి 8 గంటలకు శవాన్ని స్టేషన్ కు తరలించారన్నారు. శవాన్ని ఘటనా స్థలంలో ఉంచితే బాధితుని తరుపున పెద్ద సంఖ్యలో జనం అక్కడకు చేరుకుని ఆందోళన చేసినట్టయితే పరిస్థితి చేయి దాటిపోతుందన్న అనుమానంతో హుటాహుటిన తరలించినట్టుగా స్థానికంగా ప్రచారం జరుగుతోంది. అయితే చేపల వేటకు వెళ్లిన వ్యక్తి నీటి గుంటలో పడిపోవడానికి కారణం ఏంటీ అన్న విషయాన్ని విస్మరిస్తున్నారన్న విమర్శలు కూడా వెల్లువెత్తుతున్నాయి. అనుమతులకు మించి ఇష్టారీతినీ జేసీబీలతో మానేరు నదిలో తవ్వకాలు జరపడం వల్లే నీటి గుంటలో పడి చనిపోతున్నారని, ఇటీవల కరీంనగర్, పెద్దపల్లి జిల్లాల మీదుగా ప్రవహిస్తున్న మానేరు నదిలో ఇలాంటి మరణాలు సర్వసాధరణంగా మారాయని పరివాహక గ్రామాల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. టీఎస్ఎండీసీ మానేరులో ఇసుక తవ్వకాలకు ఎంతమేర విస్తీర్ణంలో అనుమతి ఇచ్చింది..? ఎంత లోతు వరకు తవ్వాలన్న నిభందనలు విధించింది అన్న విషయాలను ఆధారం చేసుకుని క్షేత్ర స్థాయిలో విజిలెన్స్ బృందాలు తనిఖీలు చేస్తే వాస్తవాలు వెలుగులోకి వస్తాయని అంటున్న వారూ లేకపోలేదు. పర్యావరణ పరిరక్షణ నిభందనలకు విరుద్దంగా టీఎస్ఎండీసీ ఇచ్చిన అనుమతులకు మించి ఇసుక తవ్వకాలు జరుపుతున్నారన్న ఆందోళన వ్యక్తమవుతోంది.

You cannot copy content of this page