ఫేక్ డాక్యూమెంట్లు చూపించి భూమిని విక్రయించి… భూ వివాద పరిష్కార ఒప్పంద పత్రాలు రాసిచ్చి…

దిశ దశ, కరీంనగర్:

అండదండలు అందించే వారు ఉంటే ఏ స్థాయిలో అయినా అక్రమాలకు పాల్పడవచ్చన్నట్టుగా వ్యవహరించారు కరీంనగర్ లోని అక్రమార్కులు. అధికార పార్టీలో చెలామణి అవుతూ అమాయకుల జీవితాలతో చెలగాటమాడడమే పనిగా పెట్టుకున్నట్టుగా ఉంది కొందరి తీరు. కార్పోరేటర్ల భర్తలు ఇద్దరిని కరీంనగర్ పోలీసులు అరెస్ట్ చేయడంతో అసలు వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. సంఘటనా వివరాల్లోకి వెల్తే… కొత్తపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని రేకుర్తిలో విలువైన భూమి ఉందని నకిలీ డాక్యూమెంట్లు చూపించి రూ. కోటి 37 లక్షలు వసూలు చేశారు 17, 18వ డివిజన్ల కార్పోరేటర్ల భర్తలు కోల ప్రశాంత్, సుధగోని కృష్ణ గౌడ్ లో పాటు ఏలేటి భరత్ రెడ్డిలను శుక్రవారం అరెస్ట్ చేసి కరీంనగర్ కోర్టులో హాజరు పరిచారు. రాజన్న సిరిసల్ల జిల్లా వేములవాడ పట్టణం శివసాయి నగర్ కు చెందిన గునుకుల రాజిరెడ్డి అనే వ్యక్తికి రేకుర్తి శివార్లలోని 119 సర్వే నెంబర్ లో 25 గంటల భూమి ఉందని 100 ఫీట్ల రోడ్డుకు అనుకుని ఉన్న ఈ భూమి కమర్షియల్ బిట్ అని అమ్మకానికి ఉందని కృష్ణ గౌడ్ చెప్పాడు. ఆయన మాటలు నమ్మిన రాజిరెడ్డి భూమి కొనుగోలు చేసేందుకు ముందుకు రావడంతో కృష్ణ గౌడ్, జక్కులు మల్లేశలు గుంటకు రూ. 6 లక్షల చొప్పన విక్రయించేందుకు అగ్రిమెంట్ చేసుకున్నారు. ఇందుకు గాను రూ. 31 లక్షల అడ్వాన్స్ కూడా ఇఛ్చిన రాజిరెడ్డి భూమి హద్దులు పెట్టుకునేందుకు వెళ్లాడు. అయితే ఆ స్థలం తమదని స్థానికులు కొంతమంది అడ్డు రావడంతో రాజిరెడ్డి ఈ విషయాన్ని కృష్ణ గౌడ్ కు తెలిపాడు. దీంతో సర్వే నెండర్ 79/Bలో 20 గంటుల భూమి అమ్మకానికి ఉందని, గుంటకు రూ. 9 లక్షల చొప్పున విక్రయిస్తామని తెలిపారు. ఇందుకు కూడా సమ్మతించిన రాజిరెడ్డి 2016 జులై 1న సేల్ అగ్రిమెంట్ డీడ్ చేసుకున్న తరువాత రూ. 76 లక్షలు కూడా ముట్టచెప్పాడు. ఈ భూమి రిజిస్ట్రేషన్ చేయాలని కృష్ణ గౌడ్ కోరగా కంకణాల భాగ్య లక్ష్మీ, కంకణాల సుజాతల పేరిట ఉన్న 700 గజాల స్థలాన్ని రాజిరెడ్డి తమ్ముడు సంపత్ కుమార్ పేరిట రిజిస్ట్రేషన్ చేయించాడు. మిగతా భూమి సంగతేంటని అడగగా వడ్డేపల్లి కరుణా దేవి పేరిట ఉన్న 1210 గజాల భూమిని కూడా సంపత్ పేరిట రిజిస్ట్రేషన్ చేయించాడు. ఈ రెండు భూములకు సంబంధించిన లింక్ డాక్యూమెంట్లు కావాలని అడగగా గజ్జెల స్వామి పేరిట 2006లో జీపీఏ చేసిన డాక్యూమెంట్లు ఇచ్చాడు. అయితే ఈ డాక్యూమెంట్లను పరిశీలించగా వివాదంలో భూమికి సంబంధించిన పేపర్లను తేలింది. 1991లో హస్తాపురం అంజయ్యకు అసైన్డ్ చేసిన భూమి కాగా ఇందులో 10 గంటుల భూమిని రేకుర్తికి చెందిన వడ్డెపల్లి కరుణా దేవికి మరో 10 గుంటల భూమి వడ్డెపల్లి రాకేష్ లకు విక్రయించారు. అంతేకాకుండా 700 గజాల స్థలాన్ని తిరిగి గజ్జెల స్వామి పేరిట జీపీఏ చేయించగా ఇట్టి భూమిని కంకఱాల భాగ్యలక్ష్మీ, సుజాతల పేరిట రిజిస్ట్రేషన్ చేశారన్నారు. అయితే తనకు ఇప్పించవల్సిన భూమి గురించి కృష్ణ గౌడ్ ను పలుమార్లు అడగగా దాటవేస్తూ వచ్చాడని రాజిరెడ్డి వివరించారు. ఒక రోజు తనను రేకుర్తిలోని కృష్ణ గౌడ్ ఆఫీసుకు పిలిపించుకుని కోల ప్రశాంత్ ను పరిచయం చేశాడు. భూమికి సంబంధించిన సమస్యను కోల ప్రశాంత్ పరిష్కరిస్తాడని కృష్ణ గౌడ్ చెప్పారు.

సెటిల్ మెంట్ డీడ్…

రాజిరెడ్డి కొనుగోలు చేయాలనుకున్న భూమి బసవయ్య పేరిట ఉందని ఈ సమస్య పరిష్కరించేందుకు రూ. 50 లక్షలు ఇవ్వాలన్న ప్రతిపాదన చేశారు. ఇందుకు గాను సెటిల్ మెంట్ అగ్రిమెంట్ డీడ్ కూడా రాసకుని రూ. 20 లక్షల అడ్వాన్స్ గా రాజిరెడ్డి కోల ప్రశాంత్ కు అప్పగించాడు. అయితే భూమి సమస్య పరిష్కారం కాకపోవడంతో ఆ విలువకు తగిన భూమిని తన పేరిట రిజిస్ట్రేషన్ చేయాలన్న ప్రతిపాదన కూడా రాజిరెడ్డి చేశాడు. అయితే మిగతా రూ. 30 లక్షలు ఇవ్వాలని లేనట్టయితే భూమికి సంబంధించిన సమస్య పరిష్కారం కాకుండా చూస్తామంటూ హెచ్చరించారు. అయితే తాను మోసపోయిన విషయం గ్రహించిన రాజిరెడ్డి కొత్తపల్లి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. క్రైం నంబర్ 52/2024లో 420, 465, 467, 468,471,386,506,120-b r/w 34 ఐపీసీ సెక్షన్లలో కేసు దర్యాప్తు చేసిన పోలీసులు కార్పోరేటర్ల భర్తలు సుదగోని కృష్ణగౌడ్, కోల ప్రశాంత్, ఏలేటి భరత్ రెడ్డిలను శుక్రవారం అరెస్ట్ చేసి కరీంనగర్ కోర్టులో హాజరు పరిచారు. వీరిని 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధిస్తూ కరీంనగర్ కోర్టు ఆధేశించింది.

రెండు రోజుల క్రితమే…

అయితే ఈ కేసు విషయం గురించి తెలిసిన ప్రశాంత్ రెండు రోజుల క్రితమే కరీంనగర్ నుండి వెల్లిపోయినట్టుగా తెలుస్తోంది. కరీంనగర్ లోని ఓచోట పార్టీలో ఉన్న సమయంలోనే అక్కడి నుండి అదృశ్యం అయ్యాడు. అతని కోసం గాలింపు చేపట్టిన స్పెషల్ టీం శుక్రవారం హైదరాబాద్ లో అదుపులోకి తీసుకున్నారు.

You cannot copy content of this page