ఆన్ లైన్ గేమ్స్ కు అడిక్ట్ అయి… కుటుంబాన్ని బలి తీసుకుని…

దిశ దశ, హైదరాబాద్:

ఆన్ లైన్ మాయా ప్రపంచానికి అతుక్కుపోతున్న వారి బలహీనతలే మోసగాళ్లకు కోట్లు కుమ్మరిస్తున్నాయి. కంటికి కనపడకుండా నెట్టింట యాప్స్ క్రియేట్ చేసి సామాన్యులను నిలువుదోపిడీ చేయడమే పనిగా పెట్టుకున్న సైబర్ క్రిమినల్స్ ఉచ్చులో చిక్కుకుంటున్న వారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. వీరి వలలో పడ్డ కొంతమంది ఆత్మహత్యలకు పాల్పడుతుంటే మరికొంతమంది కుటుంబాలను సైతం బలి తీసుకుంటున్నారు. ఆస్తులను తెగనమ్మేందుకు కూడా వెనకాడకుండా వ్యవహరించే పరిస్థితికి చేరుకోవడం ఆందోళన కల్గిస్తున్నది. ఆన్ లైన్ గేమ్స్ జోలికి వెళ్లకుండా ఉండడమే బెటర్ అంటున్నారు పోలీసులు. తాజాగా హైదరాబాద్ లో చోటు చేసుకున్న ఈ ఘటన ప్రతి ఒక్కరి హృదయాన్ని కలిచివేస్తోంది. సంఘటనా వివరాల్లోకి వెల్తే… బండ్లగూడ జారీర్ సన్ సిటీలోని ఓ అపార్ట్ మెంట్లో నివాసం ఉంటున్న ఆనంద్ (42) ఆన్ లైన్ గేమ్స్ వలలో చిక్కుకుని అప్పుల ఊబిలో కూరుకపోయాడు. ఇప్పటికే తన భార్య ఇందిర నగలు, కారు అమ్ముకున్నాడు. మిగిలిన అపార్ట్ మెంట్ కూడా అమ్మేయాలని ఆనంద్ నిర్ణయించుకోగా ఆయన భార్య ఇందిర వారించింది. అప్పులు తీర్చే మార్గం లేక ఆన్ లైన్ గేమ్స్ ను వదులుకోకలేక… చేసిన అప్పులు తీర్చే పరిస్థితి కానరాకపోవడంతో తన భార్య ఇందిర (38)కి, కొడుకు విక్కి (3)లకు కూల్ డ్రింక్ లో విషం కలిపి చంపేశాడు. అనంతరం తాను కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. గత 15 రోజులుగా ఆనంద్ కుటుంబంలో గొడవలు జరుగుతున్నాయని ప్రత్యక్ష్య సాక్షులు చెప్తున్నారు. రాజేంద్ర నగర్ పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. అయితే ఆనంద్ మొదటి భార్యకు విడాకులు ఇవ్వగా, ఇందిర తన భర్త చనిపోవడంతో రెండో వివాహం చేసుకున్నారని తెలుస్తోంది. ఆన్ లైన్ గేమింగ్ ఛట్రంలో చిక్కుకుని బెట్టింగ్ ద్వారా కోట్లు కొల్లగొట్టుకోవల్సిందేనన్న విషయాన్ని గుర్తించాల్సిన అవసరం ఉందని పోలీసులు అంటున్నారు.

You cannot copy content of this page