వసూలు చేయాల్సింది ఎంత…?
జగిత్యాల బల్దియా తీరు…
ఆర్థిక సంవత్సరం ముగియడానికి సరిగ్గా మరో ఐదు రోజులు ఉంది. పన్నుల వసూళ్లలో అంతగా శ్రద్ద చూపని మునిసిపాలిటీలు హాడావుడి చేస్తూ డిఫాల్టర్లపై తమ ప్రతాపం చూపిస్తున్నాయి. సరిగ్గా ఇదే కోవలోకి వస్తుంది జగిత్యాల బల్దియా తీరు. ఇన్ని రోజులూ అంటి ముట్టనట్టుగా వ్యవహరించిన జగిత్యాల మునిసిపాలిటీ యంత్రాంగానికి మార్చి 31 దగ్గర పడిందన్న విషయం గుర్తొచ్చినట్టుగా ఉంది ఇప్పుడు బలవంతపు వసూళ్లకు శ్రీకారం చుట్టారు. దీంతో ట్యాక్స్ పే చేయాల్సిన వారు లబోదిబోమంటున్నా పట్టించుకోకుండా మునిసిపల్ సిబ్బంది మాత్రం షాపులకు తాళాలు వేస్తున్నారు.
జగిత్యాల పరిస్థితి ఇది…
జగిత్యాలలో మొత్తం కమర్షియల్, నాన్ కమర్షియల్ ఇండ్లు 25 వేల వరకు ఉన్నాయి. వీటి ద్వారా రూ. 12.40 కోట్లు పన్నుఈ ఏడాది వసూలు చేయాల్సి ఉండగా ఇప్పటి వరకు 18వేల ఇండ్ల నుండి 6.65 కోట్లు మాత్రమే వసూలు అయింది. దీంతో మరో నాలుగు రోజుల్లో ఆర్థిక సంవత్సరం ముగుస్తున్న నేపథ్యంలో బకాయిలు వసూలు చేసే పనిలో బల్దియా యంత్రాంగం నిమగ్నం అయింది. ఇంతకాలం పట్టిచుకోని వైఖరి అవలంబించి తీరా సమయం ముగుస్తున్న తరుణంలో వసూళ్ల కోసం రంగంలోకి దిగారన్న విమర్శలు జగిత్యాల మునిసిపల్ యంత్రాంగంపై వస్తున్నాయి. అయితే ఇటీవల ఛైర్ పర్సన్ బోగ శ్రావణి ఎపిసోడ్ తో కొంతకాలం మునిసిపల్ లో స్తబ్దత నెలకొనడం వల్లే ట్యాక్స్ వసూళ్లపై అంతగా దృష్టి పెట్టనట్టుగా తెలుస్తోంది. పొలిటికల్ వ్యవహారాలు ఎలా ఉన్నా అధికార యంత్రాంగం ఏటా నిర్వహించాల్సిన వ్యవహారాలను చక్కబెట్టకపోవడం ఏంటన్నదే అంతుచిక్కకుండా పోయింది. ఆదివారం నుండి పెండింగ్ ట్యాక్స్ వసూలు చేయాలన్న ఆలోచనతో మునిసిపల్ సిబ్బంది కమర్షియల్, నాన్ కమర్షియల్ ఇండ్ల చుట్టూ తిరగడం ఆరంభించారు. ఈ పనేదో జనవరి నుండి స్టార్ట్ చేసినట్టయితే ఇంత దూరం వచ్చేది కాదు కదా అని అంటున్న వారూ లేకపోలేదు.
కలెక్టర్ సీరియస్..?
జగిత్యాల మునిసిపల్ ట్యాక్స్ వసూళ్ల విషయంలో యంత్రాంగం విఫలం అయిందని తెలుసుకున్న జిల్లా కలెక్టర్ యాస్మిన్ భాషా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్టు సమాచారం. వంద శాతం పన్నులు వసూలు చేయాల్సిందేనని స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడంతో మునిసిపల్ యంత్రాంగంలో చలనం మొదలైందన్న ప్రచారం జరుగుతోంది. ఏది ఏమైనా ఈ నెల 31లోగా రూ. 5.75 కోట్లు వసూలు చేస్తారో లేదో చూడాలి మరి.