ఉమ్మడి జిల్లాలో ఇద్దరు రంజీ క్రికెట్ ప్లేయర్ల పోటీ
దిశ దశ, కరీంనగర్:
రంజీ క్రికెట్ ప్లేయర్లుగా ఎదిగి ఆ ఇద్దరు పాలిటిక్స్ లో దూకుడు ప్రదర్శిస్తున్నారు. ఓపెనింగ్ బ్యాట్స్ మెన్ గా క్రికెట్ ఆడిన ఒకరు ఇప్పటికే లోకసభకు ప్రాతినిథ్యం వహిస్తూ అసెంబ్లీ బరిలో నిలవబోతుండగా, వీణవంక ఎక్స్ ప్రెస్ గా పేరొందిన మరోకరు మండలి సభ్యుడిగా వ్యవహరిస్తూ ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు.
కోరుట్ల నుండి ధర్మపురి…
నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ జగిత్యాల జిల్లా కోరుట్ల నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. 2019 ఎన్నికల్లో తొలిసారి ప్రజాక్షేత్రంలోకి ఎంట్రీ ఇచ్చిన అరవింద్ కల్వకుంట్ల కవితపై విజయం సాధించారు. తాజాగా జరగుతున్న ఎన్నికల్లో కోరుట్ల నుండి అసెంబ్లీలోకి అడుగుపెట్టాలని లక్ష్యంగా పెట్టుకుని ముందుకు సాగుతున్నారు. అయితే అరవింద్ గతంలో అండర్ 19, 21, 23, 25 రంజీ క్రికెట్ లో హైదరాబాద్ తరుపున ఓపెనింగ్ బ్యాట్స్ మెన్ గా ఆడారు. 1995, 96 ప్రాంతంలో ఆయన రంజీ క్రికెట్ లో ఓపెనర్ గా ఎంట్రీ ఇవ్వగా, 2019 లోకసభ ఎన్నికల్లో రాజకీయాల్లోకి వచ్చారు.
హుజురాబాద్ నుండి కౌశిక్…
హుజురాబాద్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా పాడి కౌశిక్ రెడ్డి పోటీ చేస్తున్నారు. వీణవంక మండలకేంద్రానికి చెందిన కౌశిక్ రెడ్డి 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బరిలో నిలిచి ఓటమి పాలుకాగా ఉప ఎన్నికల తరువాత గులాభి కండువా కప్పుకున్నారు. ఆయనకు సీఎం కేసీఆర్ మండలి సభ్యునిగా అవకాశం ఇవ్వడంతో పాటు మండలిలో విప్ గా కూడా ప్రమోట్ చేశారు. తాజా ఎన్నికల్లో బీఆర్ఎస్ తరుపున పోటీ చేస్తున్న ఆయన రెండో సారి అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలుస్తున్నారు. 2004 నుండి 2007 మధ్యలో జరిగిన 15 ఫస్ట్ క్లాస్ మ్యాచుల్లో ఆడాడు. ఫాస్ట్ బౌలర్ అయిన కౌశిక్ రెడ్డి వీణవంక ఎక్స్ ప్రెస్ అనిపిలిచేవారు.
రాజకీయ భవిష్యత్తు..?
రంజీ ప్లేయర్లుగా కెరీర్ ప్రారంభించిన ఇద్దరు కూడా రాజకీయాల్లోకి రావడం… ఈ సారి ఎన్నికల్లో ఇద్దరూ కూడా ఉమ్మడి కరీంనగర్ నుండే పోటీ చేయడం గమనార్హం. ఇప్పటికే లోకసభకు ప్రాతినిథ్యం వహిస్తున్న అరవింద్ ఈ ఇన్నింగ్స్ లోనూ హెలిక్యాప్టర్ షాట్లతో సిక్సర్ల పరంపర కొనసాగిస్తారా..? వీణవంక ఎక్స్ ప్రెస్ గా పేరున్న ఫాస్ట్ బౌలర్ కౌశిక్ రెడ్డి ప్రత్యర్థులను క్లీన్ బౌల్డ్ చేస్తారా అన్నది తేలాలంటే వేచి చూడాలి.