దండకారణ్యంలో అసలేం జరిగింది..?
దిశ దశ, దండకారణ్యం:
దండకారణ్యంలో బలగాలకు, మావోయిస్టులకు మధ్య భీకర పోరు సాగింది. ఆపరేషన్ జలశక్తి పేరిట నిర్వహించిన కూంబింగ్ నేపథ్యంలో ఎనిమిది మంది మావోయిస్టులు మరణించారు. చత్తీస్ గడ్ రాష్ట్రంలోని దంతెవాడ, బీజాపూర్, నారాయణపూర్ జిల్లాల సరిహధ్దు అటవీ ప్రాంతంలో మావోయిస్టులు 60 మంది వరకు ఉన్నారన్న సమాచారం అందుకున్న బలగాలు జాయింట్ ఆపరేషన్ చేపట్టాయి. ఆపరేషన్ జలశక్తి ద్వారా దంతెవాడ, నారాయణపూర్, బస్తర్ డీఆర్జీ, బస్తర్ ఫైటర్స్, ఎస్టీఎఫ్ బలగాలు ఈ నెల 21న అడవుల్లో కూంబింగ్ కోసం రంగంలోకి దిగాయి. మూడు జిల్లాల సరిహద్దు అటవీ ప్రాంతంలోని హంద్వారా, రేకవాయ గ్రామాల మధ్య విస్తరించి ఉన్న అడవులు, గుట్టల్లో మావోయిస్టులు తారసపడడంతో సెర్చింగ్ ఆపరేషన్ బలగాలకు మధ్య ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ అటవీ ప్రాంతంలో మావోయిస్టులు ఏర్పాటు చేసుకున్న శిక్షణ శిబిరాన్ని బలగాలు విచ్ఛిన్నం చేశాయి. 21వ తేది కూంబింగ్ కోసం అటవీ ప్రాంతంలోకి ఎంట్రీ ఇచ్చిన బలగాలు 23వ తేదికి మావోయిస్టుల శిక్షణా శిబిరం వద్దకు చేరుకున్నాయి. గురువారం ఉదయం 11 గంటల నుండి శుక్రవారం మద్యాహ్నం వరకు మావోయిస్టులకు, బలగాలకు మధ్య ఏడు నుండి ఎనిమిది సార్లు ఎదురు కాల్పులు జరిగాయి. డీవీసీఎం దీపక్, కమలాకర్, 16వ ప్లాటూన్ కమాండర్ స్వప్న అలియాస్ స్వప్నక్క, మల్లేశ్, మాద్ డివిజన్, తూర్పు బస్తర్ డివిజన్ కమిటీ పరిధిలోని ఇంద్రావతి ఏరియా కమిటీ డీవీసీఎం మల్లేశ్ లతో పాటు 60 మంది నక్సల్స్ ఈ శిక్షణా శిబిరంలో ఉన్నారని పోలీసు వర్గాలు తెలిపాయి. డీఆర్జీ, బస్తర్ ఫైటర్స్ తో పాటు డీఎస్పీలు రాహుల్ ఉయికే ఆశిష్ నేతమ్, ప్రశాంత్ దేవగన్ నేతృత్వంలోని ఎస్టీఎఫ్ బలగాలు కూడా పాల్గొన్నాయి. ఘటనా స్థలం నుండి ఎనిమిది మావోయిస్టుల మృతదేహాలను స్వాధీనం చేసుకున్నామని వీరిలో నలుగురు మహిళలు ఉన్నారని పోలీసు అధికారులు వివరించారు. అలాగే 315 గన్, రెండు 12 బోర్ గన్స్, నాలుగు ఎస్బీఎంల్ గన్స్, ఏడు బీజీఎల్ సెల్స్, రెండు కుక్కర్ ఐఈడీ, వైర్ లెస్ సెట్లు, బ్యాటరీలు, మావోయిస్టుల యూనిఫాం, కరెంటు తీగలు, ప్రచార సామాగ్రి, 400 జతల స్లిప్పర్లు, కుట్టు మిషన్, నిత్యవసరాలను బలగాలు స్వాధీనం చేసుకున్నాయి.
తిరుగు ప్రయాణంలో…
కీకారణ్యాల్లో జరిగిన ఎదురు కాల్పులు ముగిసిన తరువాత తిరుగు ప్రయాణంలో బలగాలను మట్టుబెట్టేందుకు మావోయిస్టులు 15 కిలోల మందుపాతరను సిద్దం చేసిన విషయం గమనించి దానిని విచ్ఛిన్నం చేశారు. అయితే ఎన్ కౌంటర్ ఘటనా స్థలం నుండి తప్పించుకున్న కొంతమంది నక్సల్స్ యూనిఫారం వదిలి సివిల్ దుస్తులు వేసుకుని వెనక్కి వస్తున్న బలగాలను ముట్టడించేందుకు పథకం వేశారు. అనుమానితులను గమనించిన బలగాలు వారిని అదుపులోకి తీసుకుని హెడ్ క్వార్టర్స్ కు తరలించాయి.