దండకారణ్యం దద్దరిల్లిపోవడం వెనక..? ‘‘ఆపరేషన్ కగార్’’ సాగుతోందా..?

దిశ దశ, దండకారణ్యం:

దండకారణ్య అటవీ ప్రాంత అట్టుడికిపోవడానికి కారణం ఏంటీ..? మావోయిస్టుల ఏరివేతే లక్ష్యంగా సాగుతున్న ఆపరేషన్ కొత్త పేరేంటీ..? అభూజామడ్ అడవుల్లో వేల సంఖ్యలో బలగాలు మోహరించడంతో అసలు అక్కడేం జరుగుతోంది..? కీకారణ్యాలు, కొండలు విస్తరించిన దండకారణ్య అటవీ ప్రాంతంలో యుద్దం తీవ్ర రూపం దాల్చినట్టుగా స్పష్టం అవుతోంది. కేంద్ర ప్రభుత్వం కూడా మావోయిస్టుల అణిచివేతపై స్పెషల్ ఆపరేషన్ కొనసాగించినట్టుగా స్పష్టం అవుతోంది.

వరస ఘటనలు…

ఇటీవల కాలంలో మావోయిస్టు పార్టీ, బలగాల మధ్య ఎదరు కాల్పుల ఘటనలు సాధారణంగా మారిపోయాయి. దట్టమైన అడవుల్లో అన్నలు క్రాంతి కారీ జనతన్ సర్కార్ పేరిట సమాంతర ప్రభుత్వం కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. వీరిని ఏరివేయాలన్న సంకల్పంతో అభూజామడ్ అటవీ ప్రాంతంపై స్పెషల్ ఆపరేషన్ చేపట్టడమే ఇందుకు కారణమని తెలుస్తోంది. ‘‘ఆపరేషన్ కగార్’’ పేరిట తుదిపోరు కొనసాగిస్తున్నారని మావోయిస్టు పార్టీ మధ్య రీజనల్ బ్యూరో అధికార ప్రతినిధి ప్రతాప్ ఒక ప్రకటనలో ఆరోపించారు. 10 వేల మంది పోలీసు బలగాలను దండకారణ్య అటవీ ప్రాంతంలో మోహరించి ఏరివేత కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారని మండిపడ్డారు. 35 వేల జనాభా ఉన్న ప్రాంతంలో కొత్తగా బేస్ క్యాంపులను ఏర్పాటు చేశారని, పూర్వ బస్తర్ అటవీ ప్రాంతంలోని గుట్టలను జల్లెడ పడుతున్నారని ప్రతాప్ వివరించారు. ఈ ఏడాది జనవరి 1 నుండి నిర్భందాన్ని తీవ్రంగా పెంచి మూల ఆదివాసీలను అంతమొందించడమే లక్ష్యంగా సాగుతున్న తీరును ప్రజాస్వామ్య వాదులంతా కూడా ఖండించాలని పిలుపునిచ్చారు.

దశాబ్దాల కాలంగా…

దండకారణ్య అటవీ ప్రాంతంలో మావోయిస్టుల ఏరివేతే లక్ష్యంగా బలగాలు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నాయి. ఇక్కడ వేళ్లూనుకున్న నక్సల్స్ కార్యకలాపాలను నిలువరించడమే లక్ష్యంగా పనిచేస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వంతో పాటు ఝార్ఖండ్, చత్తీస్ ఘడ్ రాష్ట్రాలు చేపట్టిన ఆపరేషన్లతో అట్టుడికిపోతున్నాయనే చెప్పవచ్చు. మావోయిస్టు పార్టీ ఆవిర్భావం నుండి కూడా ఏరివేత కోసం ముమ్మర ప్రయత్నాలు సాగుతున్నాయి. 2005 నుంబి 2009 వరకు సల్వా జూడుం కార్యకలాపాలు కొనసాగిన సంగతి తెలిసిందే. మహేంద్ర కర్మ ఏర్పాటు చేసిన సల్వా జూడుం మావోయిస్టులకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోరాటం చేసింది. 2009 నుండి 2017 వరకు ఆపరేషన్ గ్రీన్ హంట్ పేరిట కూడా నక్సల్స్ ఏరివేత కార్యకలాపాలు కొనసాగాయి. 2017 నుండి ఆపరేషన్ సమాధాన్, ఆపరేషన్ ప్రహర్ పేరిట బలగాలను మోహరించారు. తాజాగా ఆపరేషన్ కగార్ (తుది పోరు) పేరిట నక్సల్స్ కార్యకలాపాలను నిలువరించడమే లక్ష్యంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ముందుకు సాగుతున్నాయి. ఇంతకాలంలో బలగాలే లక్ష్యంగా దాడులకు పాల్పడిన మావోయిస్టుల ఏరివేతే లక్ష్యంగా అభూజామడ్ ప్రాంతంలోకి బలగాలు చొచ్చుకపోతున్నాయి. గతంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా కూడా బస్తర్ అటవీ ప్రాంతంలో పర్యటించిన సందర్బంగా కూంబింగ్ ఆపరేషన్లు నిర్వహిస్తున్న బలగాలతో ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ మావోయిస్టుల ఇలాకాలోకి చొచ్చుకపోతున్న తీరు అభినందనీయమని కూడా వ్యాఖ్యానించారు. నక్సల్స్ షెల్టర్ తీసుకున్న అభూజామడ్ అటవీ ప్రాంతంలోకి బలగాలు వెల్తూ బేస్ క్యాంపులను ఏర్పాటు చేస్తున్న తీరుపై కూడా ఎప్పటికప్పుడు కేంద్ర హోం శాఖ పర్యవేక్షణ చేస్తోంది. తాజాగా చేపట్టిన ఆపరేషన్ కగార్ కారణంగా దండకారణ్య అటవీ ప్రాంతం వరస ఘటనలతో అట్టుడికిపోతోంది. ఇటీవల కాలంలో దండకారణ్య అటవీ ప్రాంతంలో మావోయిస్టులకు, పోలీసులకు మధ్య ఎదురు కాల్పుల ఘటనలు సర్వసాధారణంగా మారిపోయాయి. దీంతో సరిహద్దు అడవులు కాల్పుల మోతలతో దద్దరిల్లిపోతున్న తీరు ప్రస్తావనార్హం. ఆపరేషన్ కగార్ పేరిట చేపట్టిన ఏరివేత కార్యక్రమం ద్వారా మావోయిస్టుల ఉనికిని సమూలంగా అంతమొందించాలన్న లక్ష్యంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వ్యూహాలు రచించాయని ఇటీవల కాలంలో సాగుతున్న ఘటనలు రుజువు చేస్తున్నాయి.

You cannot copy content of this page