“కగార్” అక్కడ… కంగారు అంతటా…

నక్సల్స్ ఏరివేతపై ఆందోళనలు

ఫ్రంటల్ ఆర్గనైజేషన్స్ పైనా ఉక్కుపాదం

దిశ దశ, దండకారణ్యం:

దండకారణ్యంలో కాల్పుల మోత దద్దరిల్లిపోతోంది. అన్నల ఏరివేతే లక్ష్యంగా బలగాలు ముందుకు సాగుతున్నాయి. సాయుధ నక్సల్స్ ను సమూలంగా ఏరివేయడమే లక్షంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పెషల్ ఆపరేషన్ చేపట్టాయి. ఆపరేషన్ “కగార్” పేరిట అంతిమ యుద్ధం జరుపుతున్నారని మావోయిస్టులు ఆరోపిస్తున్నారు.

ఫ్రంటల్ ఆర్గనైజేషన్స్ పైనా …

దండకారణ్య ప్రాంతమైన చత్తీస్ గడ్ రాష్ట్రంలోని పూర్వ బస్తర్, మాఢ్, అభూజామఢ్ కీకారణ్యాలను కంచుకోటగా మార్చుకుని మావోయిస్టులు విప్లవ పోరాటం సాగిస్తున్నారు. ఓ వైపున సమాంతర ప్రభుత్వం నడుపుతూనే మరో వైపున బలగాలు దండకారణ్యంలోకి చొచ్చుకరాకుండా నిలువరించేవారు. అయితే వామపక్ష నక్సలిజం(LWE)ని సమూలంగా అంతమొందించాలన్న లక్ష్యంతో భారీ ఎత్తున బలగాలను మోహరించారు. ఒకప్పుడు కూంబింగ్ ఆపరేషన్ చేపట్టే బలగాలు క్షేమంగా క్యాంపులకు చేరుకుంటాయా లేదా అన్న సంశయంతో పరిస్థితులు ఉండేవి. ఇటీవల కాలంలో ఆ పరిస్థితులకు పూర్తి భిన్నంగా మారిపోయాయి. బలగాలు క్రమక్రమంగా దండకారణ్యాన్ని ఆక్రమిస్తూ మావోయిస్టుల ఇలాకాపై పట్టు బిగించాయి. 2026 మార్చి నాటికల్లా నక్సల్స్ ను తుద ముట్టించాలన్న లక్ష్యం నిర్దేశించుకున్నాయి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు. దీంతో బలగాల మోహరింపు మరింత తీవ్రంగా పెరిగిపోవడంతో మావోయిస్టులు షెల్టర్ జోన్ లోకే పరిమితం అయ్యాయి. ఆ ప్రాంతాలపై కూడా నక్సల్స్ కోసం బలగాలు జల్లెడ పడుతున్నాయి. దీంతో నక్సల్స్ కార్యకలాపాలు ముందుకు సాగలేని పరిస్థితి ఎదురవుతోంది. అయితే చత్తీస్ గడ్ లో కేవలం సాయుధ నక్సల్స్ ఏరివేతే కాకుండా ఫ్రంటల్ ఆర్గనైజేషన్స్ పై కూడా కన్నేశాయి నిఘా వర్గాలు. దండకారణ్యంలో మావోయిస్టు పార్టీ అనుబంధ సంఘాలపై డాటా సేకరించిన పోలీసులు వారిని కూడా కట్టడి చేసే పనిలో పడ్డాయి. మూలవాసీ బచావో మంచ్ (MBM)కు ప్రతినిధులను పోలీసులు పట్టుకున్నారు. పలువురిని అరెస్ట్ చేసి నగదు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసును దర్యాప్తు చేసేందుకు నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (NIA)కూడా జోక్యం చేసుకుంది. ఇటీవల ఈ సంఘం నాయకుడు రఘు మిడియామిని NIA అరెస్ట్ చేసింది. 2023లో నమోదయిన ఈ కేసును వివిధ కోణాల్లో NIA దర్యాప్తు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. దీంతో పాటు ఇతర అనుబంధ సంఘాలపై కూడా దర్యాప్తు సంస్థలు ఓ కన్నేశాయి. దీంతో దండకారణ్య ప్రాంతంలో మావోయిస్టులు బాహ్య ప్రపంంచంలోకి అడుగు పెడితే చాలు ఎటువైపు నుండి తూటాల వర్షం కురుస్తుందోనన్న ఆందోళనలో మావోయిస్టులు కొట్టుమిట్టాడుతున్నారు.

అంతటా కంగారు…

దండకారణ్యంలో మావోయిస్టుల ఏరివేతతో దేశ వ్యాప్తంగా ఉన్న విప్లవ అభిమానుల్లో ఆందోళన నెలకొంది. అక్కడ మారణహోమం సాగుతోందని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దారుణంగా వ్యవహరిస్తున్నాయన్న విమర్శలు వస్తున్నాయి. చత్తీస్ గడ్ లో కొనసాగుతున్న మారణకాండకు పుల్ స్టాప్ పెట్టాలన్న డిమాండ్ వినిపిస్తోంది.

తెలంగాణలో

మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో ఆపరేషన్ కగార్ పేరిట అంతిమ యుద్ధం కొనసాగిస్తున్నారని హక్కుల సంఘాలు గళం విప్పాయి. చత్తీస్ గడ్ తో పాటు విప్లవ పోరాటాలు సాగుతున్న ప్రాంతాల్లో ఖనిజ సంపద దోచుకునేందుకు, కార్పోరేట్ కంపెనీలకు ధారదత్తం చేసేందుకు కుట్ర పన్నుతున్నారని ఆరోపణలు చేస్తున్నాయి. ఆదివాసీ హక్కుల పోరాట సంఘీబావ వేదిక, డిఫెన్స్ ఫోర్స్, పౌర హక్కుల సంఘం వంటి ఆర్గనైజేషన్లు రౌండ్ టేబుల్ సమావేశాలు ఏర్పాటు చేస్తున్నాయి. తెలంగాణ వ్యాప్తంగా కూడా ప్రజా సంఘాలు కేంద్ర ప్రభుత్వ వైఖరిని ఎండగడుతున్నాయి. ఆదివాసీలను, మూలవాసీలను నిర్మూలించే కుట్రలో భాగంగానే కూంబింగ్ ఆపరేషన్ చేపట్టాయని ఆరోపిస్తున్నాయి.

You cannot copy content of this page