మంథనిలో అసమ్మతి రాగం…

ముత్తారంలో ప్రత్యేక సమావేశం

పుట్ట మధు లక్ష్యంగా ఆరోపణల పర్వం

దిశ దశ, పెద్దపల్లి:

మంథని బీఆర్ఎస్ పార్టీలో మళ్లీ అసమ్మతి రాగం తెరపైకి వచ్చింది. జడ్పీ ఛైర్మన్ పుట్ట మధు లక్ష్యంగా అసమ్మతి వాదులంతా కూడా సమావేశం అయ్యారు. నియోజకవర్గంలోని 9 మండలాలకు చెందిన ఉద్యమకారులు, ప్రజా ప్రతినిధులు, మాజీ ప్రజా ప్రతినిధులు ఈ సమావేశానికి హాజరయ్యారు. వచ్చే ఎన్నికల్లో ఎలాంటి వ్యూహంతో ముందుకు సాగాలి అన్న అంశంపై చర్చించిన అనంతరం మీడియాతో మాట్లాడారు. సుమారు 100 నుండి 150 మంది ప్రతినిధులు హాజరైన ఈ సమావేశంలో పుట్ట మధుకు టికెట్ ఇవ్వవద్దని అధిష్టానాన్ని కోరాలని నిర్ణయించారు. పుట్ట మధుకు తప్ప వేరే ఎవరికి టికెట్ ఇచ్చినా తాము మద్దతు ఇస్తామని అసమ్మతి నాయకులు తేల్చి చెప్తున్నారు.

అవమనాలు ఎన్నో…

మంథని నియోజకవర్గంలో ఉద్యమ కారులకు నామినేటెడ్ పోస్టులు ఇచ్చామని చెప్తున్నప్పటికీ తమను ఎన్నో అవమానాలకు గురి చేశారంటూ ఉద్యమకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా కూడా ఉద్యమ కారుల పట్ల వివక్ష చూపారని పెద్దపల్లి జిల్లా గ్రంథాలయ సంస్థ డైరక్టర్ గట్టయ్య ఆవేదన వ్యక్తం చేశారు. ఏ కార్యక్రమంలో కూడా తమకు ప్రయారిటీ ఇవ్వడం లేదని, 2007 నుండి ఉద్యమంలో కొనసాగుతున్న తనలాంటి వారెందరో కూడా మానసిక వేదనకు గురవుతున్నారన్నారు. వచ్చే ఎన్నికల్లో పుట్ట మధుకు టికెట్ ఇవ్వకూడదంటూ ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ లను అభ్యర్థించనున్నామన్నారు.

ప్రజల్లోకి వెళ్లలేం

పుట్ట మధు అభ్యర్థిత్వం ఖరారు అయితే తాము ప్రజలను ఓట్లు అడిగే పరిస్థితి లేదని, పలు నేరాల్లో ఆయనపై ఆరోపణలు వచ్చినందును ఈ పరిస్థితి నెలకొందని మాజీ జడ్పీటీసీ సభ్యుడు నాగినేని జగన్ మోహన్ రావు అన్నారు. పుట్ట మధు వైఖరి సరిగా లేదని, ప్రజల్లో వ్యవహార శైలి బాగా లేదని, ఆరోపణలు ఉన్న వ్యక్తిని గెలిపిస్తో ఎంతోమందిని కూడా కాలరాసే అవకాశం ఉందన్న ఆందోళన ప్రజల్లో నెలకొని ఉందన్నారు. పార్టీ శ్రేణులు కలిసికట్టుగా పనిచేయాలంటే నియోజకవర్గంలోని అన్ని వర్గాల వారిని సమన్వయం చేసుకపోవల్సిన అవసరం ఉందన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రత్యామ్నాయ నాయకుడికి టికెట్ ఇవ్వాలని, ఈ విషయాన్ని పార్టీ అధిష్టానం దృష్టికి కూడా తీసుకెల్తామని జగన్ మోహన్ వెల్లడించారు.

You cannot copy content of this page