తండ్రిపై అలా… తనయుడిపై ఇలా…

మావోయిస్టుల ప్రకటనతో చర్చ

దిశ దశ, మంచిర్యాల:

క్సల్స్ పేరిట విడుదల అయిన ఓ లేఖ సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. దళిత ఎమ్మెల్యేకు హెచ్చరికలు జారీ చేస్తు విడుదలైన ఈ ప్రకటన హాట్ టాపిక్ గా మారింది. తండ్రి వైపు ఏనాడూ వేలెత్తి చూపని నక్సల్స్ తనయుడిని టార్గెట్ చేయడం వెనక ఆంతర్యం ఏంటన్నదే అంతుచిక్కకుండా పోతోంది. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత ఓ ప్రజాప్రతినిధిని లక్ష్యం చేసుకుని చేసిన ప్రకటన కూడా ఇదే మొదటిది కావడం గమనార్హం.

తండ్రిపై అలా…

కాంగ్రెస్ పార్టీలో కాకలు తీరిన నేత జి వెంకటస్వామిపై అప్పటి పీపుల్స్ వారే అయినా ఇప్పటి మావోయిస్టు పార్టే అయినా ఏనాడు కూడా విమర్శలు చేయలేదు. ఉత్తర తెలంగాణాలో నక్సల్స్ కార్యకలాపాలు ఉధృతంగా ఉన్న సమయంలో వెంకటస్వామి పెద్దపల్లి లోకసభ పరిధిలో తన పట్టు బిగించారు. గడ్డం కుటుంబానికి అచ్చొచ్చిన పెద్దపల్లి నుండే వెంకటస్వామి జాతీయ స్థాయి నేతగా ఎదిగారు. కేంద్ర మంత్రిగా, సీడబ్లుసీ మెంబర్ గా పనిచేసిన కాకపై నక్సల్స్ విమర్శానస్త్రాలు సంధించిన ఘటనలు అంతంతమాత్రమే. రామగుండం సమీపంలోని పాలకుర్తి ఎన్ కౌంటర్ ఘటన సమయంలో వెంకటస్వామి అధికార పార్టీలో ఉన్నప్పటికీ పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంకటస్వామి ఆగ్రహం వ్యక్తం చేసిన తీరు అప్పట్లో సంచలనంగా మారింది. అంతేకాకుండా రాష్ట్ర ప్రభు్త్వంతో శాంతి చర్చలు ముగిసిన తరువాత నల్లమల అటవీ ప్రాంతంలో మావోయిస్టు పార్టీ నేత రామకృష్ణ అలియాస్ ఆర్కేను బలగాలు చుట్టుముట్టిన సందర్భంలో కూడా వెంకటస్వామి అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం తీరును తప్పిపట్టారు. పోలీసు ఉన్నతాధికారులు, ప్రభుత్వంలోని ముఖ్య నేతలతో కూడా మాట్లాడిన వెంకటస్వామి తప్పు పట్టారన్న ప్రచారం కూడా సాగింది. సింగరేణిలో సికాస బలంగా ఉన్నప్పుడు కూడా ఆయన తీరును నక్సల్స్ వ్యతిరేకించిన దాఖలాలే లేవు. సింగరేణి కార్మికుల సంక్షేమం కోసం ఆయన తీసుకున్న నిర్ణయాలు, పోరాటాలు కూడా ఆయనకు కలిసొచ్చాయి.

తనయుడిపై గుర్రు…

ప్రస్తుతం బెల్లంపల్లి ఎమ్మెల్యేగా ఉన్న ఆయన తనయుడు గడ్డం వినోద్ పై మావోయిస్టులు ఘాటైన లేఖ విడుదల చేయడం సంచలనంగా మారింది. ఆయన వ్యవహారశైలిని తప్పు పడుతూ వినోద్ అనుచరులు చేస్తున్న దరాక్రమణల తీరును మావోయిస్టు పార్టీ తప్పు పట్టింది. మంత్రి పదవి కోసం ప్రయత్నాలు చేస్తున్న వినోద్ అనచరుల ఆగడాలు సరైనవి కావంటూ మావోయిస్టు మండిపడుతున్నారు. బెల్లంపల్లిలోని క్వార్టర్స్ కు పట్టాలతో పాటు ఇంటి నంబర్లు కెటాయించాలని లేనట్టయితే సింగరేణి జీఎం మనోహర్, ఎమ్మెల్యే వినోద్ లు తగిన మూల్యం చెల్లించాల్సి వస్తుందని కూడా మావోయిస్టు పార్టీ హెచ్చరించడం గమనార్హం. ఈ క్వార్టర్లకు వెంటనే విద్యుత్ సరఫరా అయ్యేలా చర్యలు చేపట్టాలని కూడా డిమాండ్ చేశారు. ఈ క్వార్టర్లకు ఇంటి నంబర్లు ఇప్పిస్తామని వినోద్ అనుచరులు లక్షల రూపాయలు వసూలు చేశారని కూడా మావోయిస్టు పార్టీ ఆరోపిస్తోంది. సింగరేణి కోల్ బెల్ట్ కమిటీ కార్యదర్శి ప్రభాత్ పేరిట విడుదలైన ఈ లేఖలు పలు అంశాలను ప్రస్తావించారు.

You cannot copy content of this page