పోలీసులపై చేయి చేసుకున్న షర్మిల
పావులుగా మారిన పోలీసులు
దిశ దశ, హైదరాబాద్:
రాష్ట్రంలో అరెస్టుల వ్యవహారం పరాకష్టకు చేరిందా..? ప్రతి పక్ష పార్టీల నుండి తిరుగుబాటు ఎదురవుతోందా..? పోలీసు యంత్రాంగం పావులుగా మారిపోయిందా..? తెలంగాణ వ్యాప్తంగా సాగుతున్న తంతును చూస్తే అచ్చంగా ఇలాగే ఉంది. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయాల్సిన పోలీసులే ముప్పు తిప్పలు పడుతున్నారు. పై అధికారులు చెప్పింది చేయక తప్పని పరిస్థితితో ముందుకు సాగుతుంటే ప్రతి పక్ష పార్టీల నాయకులు వారిపై చట్టపరంగా పోరాటాలు చేస్తూ ఎదురు తిరిగే పరిస్థితికి చేరుకున్నారు. రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీల నాయకుల అరెస్ట్ సర్వసాధారణంగా మారిపోయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయా పార్టీల నాయకులు కూడా పోలీసులపై రివైంజ్ తీసుకునే స్థితికి చేరుకుంటున్నారు. తాజాగా హైదరాబాద్ లోటస్ పాండ్ వద్ద వైఎస్సార్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల ఎస్సైతో పాటు మరో పోలీసుపై చేయి చేసుకున్న ఘటనే ఇందుకు ఉదాహారణగా చెప్పవచ్చు. గతంలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆందోళనలకు పిలుపునిచ్చారంటే చాలు ఆయన ఇంటి వద్ద భారీగా పోలీసులు మోహరించే వారు. దీంతో రేవంత్ రెడ్డి పలుమార్లు పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేసిన సందర్భాలు ఉన్నాయి. ప్రతి విషయంలోనూ పోలీసులు పావులుగా మారడంతో అటు ప్రతిపక్ష నాయకులతో ఇటు పై అధికారులతో ఇబ్బందులు తప్పడం లేదు. దీంతో తాము విధులు నిర్వర్తించాలో లేక దూరంగా ఉండాలోనన్న ఆలోచనలతో చాలా మంది పోలీసు అధికారులు సతమతవుతున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ విషయంలో కూడా ఇదే విధానంతో ముందుకు సాగిన పోలీసులు ఇప్పటికే మూడు సార్లు ప్రివిలేజ్ పిటిషన్ల బారిన పడ్డారు. లోక సభ సభ్యునిగా ఉన్న బండి సంజయ్ స్పీకర్ ఓం బిర్లాకు ఫిర్యాదు చేయడంతో ఈ మేరకు సమన్లు జారీ అయ్యాయి. ఇప్పటికే పోలీసు అధికారులు ఢిల్లీలోని లోకషభ స్పీకర్ ముందు హాజరయ్యారు. తాజాగా కమలాపూర్ పేపర్ లీకేజీలో కుట్ర కేసు ఉందని బండి సంజయ్ ని ఏ1గా అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే అంతకుముందు సంజయ్ ని ఇంటి నుండి అరెస్ట్ చేసి తీసుకెళ్లిన వైనాన్ని, తనపై 120బి కుట్ర కేసుతో పాటు మాల్ ప్రాక్టీస్ సెక్షన్లలో కేసు నమోదు చేసిన విషచంపై కరీంనగర్, వరంగల్ కమిషనరేట్లకు సంబంధించిన పోలీసు అధికారులపై ప్రివిలేజ్ పిటిషన్ మూవ్ చేశారు. ఇలా ప్రతిపక్ష పార్టీల ఒత్తిడి తీసుకొచ్చేందుకు ప్రభుత్వం పోలీసులను ఉపయోగిస్తుండడంతో ప్రతిపక్ష పార్టీల నాయకుల చర్యలతో నలిగిపోవల్సిన పరిస్థితికి వారికి ఎదురవుతోంది. తాజాగా వేములవాడలో అధికార పార్టీకి చెందిన నేత జన్మదినం సందర్భంగా ఫ్లెక్సీ ఏర్పాటు చేసిన ఘటనలో స్థానిక ఎమ్మెల్యే ఫోటో పెద్దగా లేదన్న కారణంతో అక్కడి సీఐ ఫ్లెక్సీ ఏర్పాటు చేసిన కౌన్సిలర్ నిమ్మశెట్టి విజయ్ ని పిలిచి మందలించారు. రాత్రి ఆయన్ను స్టేషన్ కు తీసుకరావాలని కానిస్టేబుల్ ను పంపించడంతో విజయ్ డీఎస్సీకి ఫోన్ చేశారు. సోమవారం ఈ ఘటనపై తాను మంత్రి కేటీఆర్ కు ఫిర్యాదు చేస్తానని కూడా మీడియాకు వివరించారు. సోషల్ మీడియాలో పోస్టుల నుండి మొదలు లా ఆర్డర్ తో సంబంధం లేని విషయాల్లోనూ పోలీసులను భాగస్వాములను చేస్తూ తమ లక్ష్యాలను ఛేదించుకునేందుకు అధికార పార్టీ నాయకులు వ్యవహరిస్తున్న తీరు మాత్రం విమర్శలకు దారి తీస్తోంది. ఈ విషయంపై బాహాటంగా ఎవరూ అనకపోయినప్పటికీ సామన్యుడి మనసులో మాత్రం ఈ విషయం పదిలంగా నిండుకుంది. దీని ప్రభావం అధికార పార్టీపై తీవ్రంగా పడే అవకాశం ఉందన్న విషయం విస్మరించుకూడదు. చీటికి మాటికి అరెస్టులు, నిర్భదించడాలు చేస్తుండడం వంటి చర్యలకు పూనుకుంటుండడం పోలీసులకు ఇబ్బందిగా మారుతున్నప్పటికీ, వీటి ప్రతి ఫలాలు మాత్రం ప్రభుత్వమే చవి చూడాల్సిన పరిస్థితి ఉంటుందన్నది నిజం.
Disha Dasha
1884 posts
Prev Post