ఢిల్లీలోని ఆప్ నేత మనీశ్ సిసోడియా అరెస్ట్‌ను ఖండిస్తూ.. ప్రధాని నరేంద్ర మోదీకి తొమ్మిది మందితో కూడిన విపక్ష బృందం లేఖ రాసింది. తెలంగాణ సీఎం కేసీఆర్, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్ సీఎం భగవంత్ మాన్, ఆర్జేడీ నేత తేజస్వియాదవ్, జేకేఎన్‌సీ నేత ఫరూక్ అబ్దుల్లా, ఎన్‌సీపీ అధినేత శరద్‌పవార్, శివసేన యూబీటీ ఉద్ధవ్ ఠాక్రే, సమాజ్ వాదీ పార్టీ నేత అఖిలేష్ యాదవ్.. ప్రధాని మోదీకి జాయింట్‌గా లేఖ రాశారు.
కేంద్ర ప్రభుత్వం ప్రజాస్వామ్య విలువలను కాల రాస్తోందని విపక్షాలు లేఖల పేర్కొన్నాయి. దేశంలో దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తున్నారని మండిపడ్డారు. గవర్నర్ వ్యవస్థను రాజకీయాలకు వాడుకుంటున్నారని తెలిపారు. ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదు.. దేశం ప్రజాస్వామ్యం నుంచి నిరంకుశత్వం వైపు పయనిస్తోందని విమర్శించారు. ప్రతిపక్షాలపై ఇలాంటి చర్యలు నిరంకుశత్వమేనని విపక్ష నేతలు అభిప్రాయపడ్డారు. భారత్ ఇంకా ప్రజాస్వామ్య దేశమేనని నమ్ముతున్నామని.. ప్రజాతీర్పును గౌరవించాలని విపక్షాలు లేఖలో పేర్కొన్నారు.
ఢీల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాను సీబీఐ ఎలాంటి సాక్ష్యాధారాలు లేకుండా అక్రమాలకు సంబంధించి అరెస్ట్ చేయడం సరి కాదని లేఖలో పేర్కొన్నారు. సిసోడియాపై వచ్చిన ఆరోపణలు పూర్తిగా నిరాధారమైనవి, రాజకీయ కుట్రతో కూడినవని చెప్పారు. అతని అరెస్ట్ దేశవ్యాప్తంగా ప్రజలను ఆగ్రహానికి గురి చేసిందన్నారు. ఢిల్లీ పాఠశాల విద్యలో సంస్కరణలు తెచ్చిన మనీశ్ సిసోడియా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందారని చెప్పారు. నిరంకుశ బీజేపీ పాలనలో దేశ ప్రజాస్వామ్య విలువలు ముప్పుగా ఉన్నాయని ప్రపంచం భావిస్తోందని లేఖలో పేర్కొన్నారు.
కేంద్ర ఏజెన్సీలు తరచుగా కేంద్రంలోని పాలక వ్యవస్థ చేతిలో పనిచేస్తున్నాయనే అనుమానాన్ని రేకెత్తిస్తున్నాయని చెప్పారు. విపక్షాలకు చెందిన ముఖ్యమైన సభ్యులను లక్ష్యంగా చేసుకున్న తీరును చూస్తుంటే ప్రతిపక్షాలను రూపుమాపాలనే ఉద్దేశ్యంతో దర్యాప్తు సంస్థలను ఉపయోగిస్తోందన్న ఆరోపణకు బలం చేకూరుస్తోందన్నారు. మీ ప్రభుత్వం ప్రతిపక్షాలకు వ్యతిరేకంగా ఉపయోగించిందని ఆరోపించిన ఏజెన్సీల జాబితా కేవలం ఈడీకే పరిమితం కాలేదని లేఖలో తెలిపారు.