మహాలక్ష్మీ స్కీంతో ఆర్టీసీ కళకళ: ఎండీ విసి సజ్జనార్

దిశ దశ, హైదరాబాద్:

హాలక్ష్మీ పథకం ద్వారా మహిళలకు అమలు చేస్తున్న ఉచిత బస్సు సౌకర్యంతో ఆర్టీసీ కళకళలాడుతోందని టీఎస్ఆర్టీసీ ఎండీ విసి సజ్జనార్ పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ పథకాన్ని 11 రోజుల్లోనే 3 కోట్ల మంది మహిళలు వినియోగించుకున్నారన్నారు. ప్రస్తుత గణాంకాలు ఆర్టీసీ ఆల్ టైం రికార్డును బ్రేక్ చేస్తున్నాయని కూడా ఆయన తెలిపారు.
రోజుకు సగటున 30 లక్షల మంది మహిళలు ప్రయాణం చేస్తున్నారని, పురుషులతో కలుపుకుంటే రోజుకు 51 లక్షల మందిని గమ్యస్థానాలకు చేర్చుతున్నామన్నారు. ప్రయాణికుల్లో 62 శాతం మంది మహిళలే ఉంటున్నారని సజ్జనార్ వెల్లడించారు.

పెరిగిన ఓ ఆర్…

మహిళల ఉచిత ప్రయాణ స్కీం వల్ల సంస్థ ఆక్యూపెన్సీ రేషియో(ఓఆర్) గణనీయంగా పెరిగిందని, గతంలో 69 శాతం మాత్రమే ఓఆర్ ఉండగా ఇప్పుడు 88 శాతానికి పెరిగిందని సజ్జనార్ తెలిపారు. ఈ నెల 16న 17 డిపోలు, 17న 20 డిపోలు, 18న 45 డిపోల్లో 100 శాతానికి పైగా ఓఆర్ నమోదయందన్నారు. గత మూడు రోజుల్లో యాదగిరిగుట్ట, వేములవాడ, దుబ్బాక, గజ్వేల్-ప్రజ్ఞాపూర్, హుజురాబాద్, మేడ్చల్, ముషీరాబాద్, మియాపూర్-2, జీడిమెట్ల, కుషాయిగూడ డిపోలు 100 శాతం ఓఆర్ సాధించాయని ఆర్టీసీ ఎండి తెలిపారు. ఈ స్కీమ్ లో ప్రయాణించే మహిళలకు ఈ నెల 15 నుండి జీరో టికెట్లు ఇచ్చే విధానాన్ని చేపట్టిందన్నారు.

వర్చువల్ మీటింగ్…

మహిళలకు ఉచిత ప్రయాణం స్కీం ప్రారంభమైన నేపథ్యంలో బుధవారం వర్చువల్ మీటింగ్ ఏర్పాటు చేసిన ఆర్టీసీ ఎండీ సజ్జనార్ 30 డిపోలకు చెందిన డ్రైవర్లు, కండక్టర్లతో స్వయంగా మాట్లాడారు. ఫ్రీ సర్వీస్ పథకం ఎలా సాగుతోంది, డ్యూటీల్లో తలెత్తుతున్న ఇబ్బందులను గురించి అడిగి తెలుసుకున్నారు. ప్రాక్టికల్ గా ఎదురవుతున్న ఇబ్బందులు, ప్రత్యామ్నాయ చర్యల గురించి చర్చించారు.

ఒరిజనల్ ఐడీ మస్ట్…

ఉచిత ప్రయాణం స్కీంలో ప్రయాణించే మహిళలు కొందరు ఒరిజనల్ గుర్తింపు కార్డులు తీసుకురావాలని ఎండీ సజ్జనార్ సూచించారు. గుర్తింపు కార్డుల జిరాక్స్ కాపీలు కానీ, స్మార్ట్ ఫోన్ లలో సాప్ట్ కాపీలు చూపించినట్టయితే ఈ స్కీం వర్తించదన్నారు. ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం పొందాలనుకున్న వారు ఖచ్చితంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేసిన ఒరిజినల్ ఆధార్, ఓటర్, డ్రైవింగ్ వంటి గుర్తింపు కార్డులను చూపించి జీరో టికెట్లను తీసుకోవాలని కోరారు. గుర్తింపు కార్డుల్లో ఫొటోలు స్పష్టంగా కనిపించాలని, లేనట్టయితే ఐడీ ప్రూఫ్ లను అప్ డేట్ చేసుకోవాలన్నారు. ఈ స్కీం కేవలం తెలంగాణ రాష్ట్రానికి చెందిన వారికి మాత్రమే ఉచిత ప్రయాణం అమలు చేస్తామని ఇతర రాష్ట్రాల ప్రయాణీకులు విధిగా టికెట్లు తీసుకోవల్సిందేనని ఆయన స్పష్టం చేశారు. చిత్తశుద్ధితో సమర్థవంతంగా ఈ స్కీంను విజయవంతంగా అమలు చేస్తున్న టీఎస్ఆర్టీసీ యంత్రాంగాన్ని ఈ సందర్భంగా ప్రశసించారు. ఫ్రీ సర్వీస్ ద్వారా ప్రయాణించే ప్రతి ఒక్కరు కూడా జీరో టికెట్ తీసుకోవాలన్నారు. జీరో టికెట్ల ద్వారా ఆర్టీసీకి తెలంగాణ ప్రభుత్వం రియంబర్స్ మెంట్ ద్వారా డబ్బులు జమ చేస్తుందన్నారు.

2050 కొత్త బస్సులు

ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా కొత్త బస్సులు అందుబాటులోకి రానున్నాయని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తెలిపారు. నాలుగైదు నెలల్లో 2050 కొత్త బస్సులు రానున్నాయని ఇందుకు అవసరమైన ప్రణాళికలు తయారు చేస్తున్నామని ప్రకటించారు. ఇందులో 1050 డీజిల్, 1000 ఎలక్ట్రిక్ బస్సులు ఉంటాయన్నారు.

You cannot copy content of this page