కాంగ్రెస్ పార్టీలో ఎవరికి వారే యయునా తీరే…
దిశ దశ, కరీంనగర్:
కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీలో అసలేం జరుగుతోంది..? ఓ వైపున కినుక వహించిన నాయకులు, మరో వైపున శ్రీముఖాలు అందడం, పార్టీ కార్యక్రమాల్లో ఎవరికి వారే అన్నట్టుగా వ్యవహరిస్తుండడం చర్చకు దారి తీస్తోంది.
ఎమ్మెస్సార్ జయంతి…
కొద్ది రోజులుగా కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీలో మంత్రి పొన్నం ప్రభాకర్ కు, మిగతా నాయకులకు మధ్య గ్యాప్ ఏర్పడినట్టుగా స్పష్టం అవుతోంది. ఇటీవల కరీంనగర్ డీసీసీ కార్యాలయంలో వ్యతిరేకులు సమావేశం నిర్వహిచుకుని తమలోని బాధను వెల్లగక్కిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కరీంనగర్ సెగ్మెంట్ ఇంఛార్జి పురుమళ్ల శ్రీనివాస్ కు డిసిప్లేనరీ యాక్షన్ కమిటీ ఛైర్మన్ చిన్నారెడ్డి షోకాజ్ నోటీసు కూడా ఇచ్చారు. ఆ తరువాత కాంగ్రెస్ పార్టీలో పరిస్థితి అంతా చక్కబడిందని భావించినప్పటికీ అనూహ్యంగా పార్టీ సీనియర్ నేత ఎం సత్యనారాయణ రావు (MSR) 91వ జయంతి సందర్భంగా ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా వ్యవహరించడం గమనార్హం. సీతన్న అని కూడా పిలుచుకునే సీనియర్ నేత జయంతి వేడుకల్లోనూ పార్టీ నాయకుల్లో అభిప్రాయ బేధాలు బయటపడడం గమనార్హం. మంత్రి పొన్నం ప్రభాకర్, మాజీ ఎమ్మెల్యే ఆరేపల్లి మోహన్, వైద్యుల అంజన్ కుమార్, మెన్నేని రోహిత్ రావు తదితరులు ఇందిరా భవన్ లో నిర్వహించిన ఎమ్మెస్సార్ జయంతి వేడుకలకు హాజరయ్యారు. సీతన్నకు నివాళులు అర్పించిన మంత్రి అక్కడి నుండి వెల్లిపోయారు. మంత్రి పొన్నం ప్రభాకర్ ఇందిరా భవన్ నుండి వెల్లిన పది, 15 నిమిషాల్లో కరీంనగర్ కు చెందిన మిగతా పార్టీ లీడర్లు చకాచకా అక్కడకు చేరుకున్నారు. వీరు కూడా ఎమ్మెస్సార్ కు జన్మదిన వేడుకలు నిర్వహించారు. వీరిలో డీసీసీ అధ్యక్షుడు కవ్వంపల్లి సత్యనారాయణ, సుడా ఛైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డితో పాటు పలువురు నాయకులు ఉన్నారు. అక్కడి నుండి ఇందిరా చౌక్ కు వెల్లిన నేతలు వీరంతా కేక్ కట్ చేసి ఎమ్మెస్సార్ సేవలను స్మరించుకున్నారు. అయితే మంత్రి పొన్నం, డీసీసీ అధ్యక్షుడు కవ్వంపల్లి, ఇతర నాయకులు వేర్వేరుగా నిర్వహించిన జయంతి వేడుకల్లో ఇంఛార్జి పురుమళ్ల శ్రీనివాస్ ఉన్నారు.
ఆ విషయంలో క్లాస్…
అయితే ఎమ్మెస్సార్ జయంతిని పురస్కరించుకుని పార్టీ శ్రేణులకు సమాచారం ఇచ్చిన విషయంలో జరిగిన తప్పిదాలను గమనించిన డీసీసీ అధ్యక్షుడు కవ్వంపల్లి బాధ్యులపై ఆగ్రహం వ్యక్తం చేసినట్టుగా తెలుస్తోంది. అందులో కరీంనగర్ నియోజకవర్గ ఇంఛార్జి పురుమళ్ల శ్రీనివాస్ పేరు ఎందుకు లేదని, దీనికి ఎవరు బాధ్యులో చెప్పాలని ఎమ్మెస్సార్ జయంతి వేడుకలకు ఆహ్వానించిన వ్యక్తిని ప్రశ్నించినట్టుగా తెలుస్తోంది. ఎమ్మెల్యే, పార్టీ ఇంఛార్జిలను సముచిత స్థానం కల్పించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పలుమార్లు చెప్పినప్పటికీ ఎమ్మెస్సార్ జయంతి వేడుకల్లో పురుమళ్ల శ్రీనివాస్ పేరు చేర్చకపోవడానికి కారణమేంటని ఆరా తీసినట్టుగా తెలుస్తోంది. ఈ విషయంపై పార్టీ వర్గాల్లో తీవ్రంగా చర్చ జరుగుతున్నట్టుగా సమాచారం. ఏది ఏమైనా మంత్రి పొన్నం ప్రభాకర్ వెళ్లిపోయే వరకు కూడా మిగతా నాయకులు ఎమ్మెస్సార్ జయంతి వేడుకల వద్దకు రాకపోవడం కాంగ్రెస్ పార్టీలో హాట్ టాపిక్ గా మారింది.