మా భూములు లాక్కుంటున్నారు…

ఎస్సారెస్పీ అధికారులపై రైతుల ఫిర్యాదు

దిశ దశ, పెద్దపల్లి:

దశాబ్దాలుగా వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్న తమ భూములను ఎస్సారెస్పీ అదికారులు ఆక్రమించుకుంటున్నారని ముత్తారం మండల రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమ పూర్వీకుల కాలం నుండి సాగు చేస్తున్న భూములు తమ ఆధీనంలో ఉన్నవంటే ఎస్సారెస్పీ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శుక్రవారం మండలంలోని ఖమ్మంపల్లి, సీతంపేట, రంగయ్యపల్లి, శుక్రవారంపల్లి గ్రామాలకు చెందిన రైతులు మంథని, ఖమ్మంపల్లి రహదారిపై ధర్నా చేపట్టారు. ఎస్సారెస్పీ అధికారుల తీరుకు వ్యతిరేకంగా నినాదాలు చేసిన రైతులు తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు. ఇంతకాలం తమ భూముల వైపు కన్నెత్తి చూడని వ్యవసాయ అధికారులు ఇప్పుడు వచ్చి కెనాల్ కు 110 ఫీట్ల దూరం ఉన్న భూమి తమ శాఖకు చెందినదేనని, దానిని స్వాధీనం చేసుకుంటున్నామని చెప్తున్నారన్నారు. ఇతర ప్రాంతాల నుండి కూలీలను తీసుకొచ్చి కెనాల్ పరిసరాల్లో పనులు చేయిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పెద్దపల్లి కలెక్టర్ స్పందించి తమకు న్యాయం చేయాలని అభ్యర్థించారు. ఈ మేరకు మంథని ఆర్డీఓ కార్యాలయం ఏఓ రవిందర్ కు రైతులు వినతి పత్రం అందించారు. అయితే ఎస్సారెస్పీ రికార్డులు, భూసేకరణ విభాగం రికార్డులను పరిశీలించి అవార్డు ఎంతమేర భూమికి ఇవ్వడం జరిగింది, ఎస్సారెస్పీ పరిధిలో ఉన్న భూమి ఎంత అన్న వివరాలు సేకరించి వాస్తవ పరిస్థితులను గమనించి రైతులకు ఇబ్బంది కలగకుండా చూడాలని రెవెన్యూ అధికారులు సర్వే విభాగం యంత్రాంగాన్ని ఆదేశించినట్టు సమాచారం.

You cannot copy content of this page