మావోయిస్టు సమత ప్రకటన
దండకారణ్యంలో జరిగిన ఎదురు కాల్పుల్లో పోలీసులపై ప్రతీకార దాడి చేసి తాము సఫలం అయ్యామని సౌత్ సబ్ జోనల్ బ్యూరో ప్రతినిధి సమత ఓ ప్రకటనలో వెల్లడించారు. దండకారణ్య అటవీప్రాంతంలోని సుక్మాజిల్లా జార్గుండా అటవీ ప్రాంతలో జరిగిన ఈ ఘటనలో పీఎల్జీఏ కారణంగా ఆరుగురు పోలీసులు మరణించగా, మరో 12 మంది గాయపడ్డారన్నారు. జాగర్‌గుండ సమీపంలో రోడ్ ఓపెనింగ్, కూంబింగ్ ఆపరేషన్లు చేస్తున్న పోలీసులపై పీఎల్జీఏ దాడి చేయడంతో పాటు గుండ్రే నయా పోలీస్ క్యాంపు వద్ద ఔట్ పోస్టుపై దాడి చేసి ఒక పోలీసులను హతం చేయగా నలుగురికి గాయాలయ్యాయని సమత పేర్కొన్నారు. ఔట్ పోస్టు నుండి ఏకె 47తో పాటు మరో రెండు ఆయుధాలు, 1,9ఎంఎం పిస్టల్, వాకీ టాకీ, దో ఈంచ్ మోట్రార్, మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకుందని వివరించారు. అయితే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రం ఈ ఘటనపై తప్పుడు కథనాలు ప్రచారం చేస్తున్నారని, మావోయిస్టు పార్టీకి ఎలాంటి నష్టం వాటిల్లలేదని స్పష్టం చేశారు. దండకారణ్య అటవీ ప్రాంతంలోని భూములను దోచుకునేందుకు కొత్తగా పోలీస్ క్యాంపులు ఏర్పాటు చేశారని ఆరోపించారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా, చత్తీస్ గడ్ సీఎం భూపేష్ భఘేల్, బస్తర్ ఐజీ సందర్ రాజ్ లు ఈ ఘటనకు బాధ్యలుగా పేర్కొన్నారు. అంబానీ, అదానీ, టాటా, వైదాంత, జిందాల్ వంటి కార్పోరేట్ సంస్థల ప్రయోజనాల కోసం పోలీసులను అడవుల్లోకి దింపారని సమత ఆరోపించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దోపీడీ చేసేందుకే ప్రజలపై అణిచివేతను పెంచాయని, గ్రామాలపై దాడులు చేస్తూ, గ్రామీణలను పట్టుకుని కొట్టడం జైళ్లో పెట్టడం, చంపడం చిత్రహింసలకు గురి చేయడం వంటి చర్యలకు పాల్పడున్నారన్నారు. మహిళలపై కూడా దౌర్జన్యాలకు దిగుతున్నారని, ప్రజల ఇళ్లలోకి చొరబడి సోదాలు చేయడం, ఎన్ కౌంటర్లలో హతమార్చుతున్నారని సమత మండిపడ్డారు. వైమానిక దాడులు, డ్రోన్లతో దాడులు చేస్తూ ఫాసిస్టు అణిచివేత పద్దతులు కొనసాగిస్తున్నారన్నారు. జాగర్‌గుండలో పాఠశాల విద్యార్థులను, ఉపాధ్యాయులను సిబ్బందిని చింతల్ నార్ వ్యాపారులను తీవ్రంగా కొట్టారని ఆరోపించారు. ఇలాంటి అమానవీయ చర్యలకు నిరసనగానే జాగర్‌గుండ సమీపంలో పీఎల్జీఏ చర్యలకు పూనకుందన్నారు. దండాకరణ్య అటవీ ప్రాంతంలోని ఖనిజ సంపదను తరలించేందుకు కమ్యూనికేషన్ వ్యవస్థను విస్తరిస్తున్నారని ఈ చర్యలను అటవీ ప్రాంత ప్రజలు అడ్డుకుంటున్నారన్నారు.
పోలీసుల మృతిపై సంతాపం
పీఎల్జీఏ దాడిలో ప్రాణాలు కోల్పోయిన పోలీసు కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నామని మావోయిస్టు పార్టీ సౌత్ సబ్ జోనల్ బ్యూరో ప్రతినిధి సమత ప్రకటించారు. విప్లవ పోరాటంలో భాగస్వాములుగా ఉన్న వారిని శతృవు విభజించారని ఆరోపించారు. తప్పుడు ప్రజ శత్రుత్వంలో పాలు పంచుకోవద్దని సమత పిలుపునిచ్చారు.