ఓల్డ్ సిటీ అభివృద్దికి దూరం… కారణమేంటో ఆలోచించండి…

కేంద్ర మంత్రి బండి సంజయ్

దిశ దశ, హైదరాబాద్:

కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ మరోసారి ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ, ఆయన కుటుంబంపై విరుచుకపడ్డారు. పాత బస్తీ ప్రజలు తమ ప్రాంతం ఎందుకు అభివృద్ది చెందలేదో గమనించాలని హితవు పలికారు. ‘X’ వేదికగా ఓవైసీపి విమర్శనాస్త్రాలు సంధించిన బండి సంజయ్ అవగాహన లేకుండా మాట్లాడుతున్నారంటూ మండిపడ్డారు. అసుదుద్దీన్ ఓవైసీకి పవిత్రమైన తిరుమల ఆలయానికి, వక్ఫ్ బోర్డు భూములకు మధ్య ఉన్న తేడా తెలియదని కామెంట్ చేశారు. టీటీడీ ఆస్తులను వక్ఫ్ ఆస్తులతో పోల్చడం ఆయన అజ్ఞానాన్ని, అవగాహనా రాహిత్యాన్ని తెలియజేస్తోందని విమర్శించారు. వక్ఫ్ ఆస్తులు పేద ముస్లిం సమాజానికి ఉపయోగపడాలి తప్ప వ్యక్తిగత ప్రయోజనాలకు కాదన్న విషయం గుర్తు  పెట్టుకోవాలన్నారు. మతాన్ని వ్యాపారంతో పోల్చడం సరికాదని అయితే ఓవైసీ మాత్రం అలానే భావిస్తున్నట్టుందని బండి సంజయ్ వ్యాఖ్యానించారు. మత పరమైన కార్యకలాపాలకు, సంఘాల అభ్యున్నతికి టీటీడీ తన నిధులను వినియోగిస్తోందన్న విషయం గమనించాలని సూచించారు. పాతబస్తీ వాసులు తమ ప్రాంతం ఎందుకు అభివృద్ది సాధించలేకపోతోందన్న విషయాన్ని గమనించాలని, ఒకే పార్టీకి దశాబ్దాలుగా మద్దతు ఇస్తున్నా ఓల్డ్ సిటీలో అభివృద్ది ఛాయలు ఎందుకు కనిపించడం లేదో ఎంఐఎం నాయకులను నిలదీయాలని బండి సంజయ్ పిలుపునిచ్చారు. ఇంతకాలంగా ఎంఐఎం పార్టీకి పాత బస్లీ వాసులు అండగా నిలుస్తున్నప్పటికీ ఈ ప్రాంతం అభివృద్ది చెందకపోవడానికి కారణమేంటో ఓవైసీ చెప్పాలని డిమాండ్ చేశారు. మెట్రో వంటి మౌళిక సదూపాయాలు కల్పించకుండా ఓవైసీ కుటుంబం పాతబస్తీ వాసులను ఇబ్బందులకు గురి చేస్తోందని ఆరోపించారు. వక్ఫ్ భూములను దోపిడీ చేసి కాలేజీలు, ఆసుపత్రులు నిర్మించుకుని సంపదను కూడబెట్టుకున్న ఘనత ఓవైసీ కుటుంబానికే దక్కుతుందని దుయ్యబట్టారు. బీఆర్ఎస్, ఎంఐఎం పొత్తు వెనక ఉన్న రాజకీయ సంబంధాలను బహిరంగపర్చాల్సిన సమయం ఆసన్నమైందని, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీతో పొత్తుకు ఆ పార్టీ చేస్తున్న ప్రయత్నాలతో దాని అసలు స్వరూపాన్ని బట్టబయలు చేస్తోందని బండి సంజయ్ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం పార్టీల కార్యకర్తలు తమ నాయకుల అవకాశవాద రాజకీయాలను గమనించాలని సూచించారు. ఆయా పార్టీల కార్యకర్తలు ఇలాంటి అవకాశవాద రాజకీయ పార్టీల కోసం పనిచేసే విషయంలో పునరాలోచించాలని బండి సంజయ్ కోరారు.
https://x.com/bandisanjay_bjp/status/1852369613792879010

You cannot copy content of this page