దిశ దశ, వరంగల్:
ఉద్యమ పార్టీపై తిరుగుబావుటా ఎగురేసిన నాయకులంతా ఓనర్ అనే పదాన్ని పేటెంట్ గా తీసుకున్నారా..? అధిష్టానం వివక్ష చూపిస్తున్న తీరును ఎత్తి చూపేందుకు ఈ పదాన్ని వాడుకుంటున్నారా..? లేక నిజంగానే ఆ పార్టీ మాది అని ఓన్ చేసుకునే పరిస్థితులు బీఆర్ఎస్ పార్టీలో లేకుండా పోయాయా..? తమకు ప్రయార్టీ ఇవ్వలేదన్న సాకు చూపించేందుకు అసమ్మతి నాయకులు కావాలనే ఈ వ్యాఖ్యలు చేస్తున్నారా..? తాజాగా ఓనర్ షిప్ అనే పదం మళ్లీ తెరపైకి రావడం అయితే సంచలనంగా మారింది…
ఆరేళ్ల క్రితం…
2018లో ముందస్తు ఎన్నికలకు వెల్లి రెండోసారి అధికారాన్ని చేజిక్కుంచుకున్నది కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ పార్టీ. అయితే క్యాబినెట్ కూర్పు విషయంలో అచూతూచి నిర్ణయం తీసుకున్నారనే చెప్పాలి. ఈ క్రమంలో ఉద్యమ ప్రస్థానం నుండి కేసీఆర్ వెన్నంటి నడిచిన వారిని కాకుండా కొత్త వారికి అవకాశం ఇచ్చే అవకాశాలు ఉన్నాయన్న ప్రచారం కూడా పెద్ద ఎత్తున సాగింది. కరీంనగర్ జిల్లా నుండి సీనియర్ అయిన ఈటల రాజేందర్ ఈ సారి అవకాశం ఇచ్చేది లేదన్న విషయాన్ని అధిష్టానం చెప్పకనే చెప్పింది. ఈ క్రమంలో రాయబారాలు నడిపినప్పటికీ ఆయన మాత్రం ససేమిరా అని తనకు కీలకమైన విభాగాలు ఇవ్వాల్సిందేనంటూ తేల్చి చెప్పారు. హుజురాబాద్ వేదికగా ఈటల రాజేందర్ చేసిన వ్యాఖ్యలు అప్పట్లో సంచలనంగా మారాయి. గులాభి జెండాకు ఓనర్లం మేం అంటూ ఈటల రాజేందర్ వ్యాఖ్యానించారు. ఉద్యమ కారులను పక్కనపెట్టి మధ్యలో పార్టీలో చేరిన వాళ్లకు గుర్తింపునిస్తున్నారంటూ ఆయన ఆరోపించారు. ఈటల రాజేందర్ చేసిన ఈ వ్యాఖ్యలు అప్పట్లో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రకంపనలు సృష్టించాయి.
తాజాగా కడియం…
తాజాగా వరంగల్ లో జరిగిన ఓ సమావేశంలో స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి కూడా ఇదే రీతిలో వ్యాఖ్యానించడం గమనార్హం. రెండు రోజుల క్రితం వరంగల్ లో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడిన కడియం శ్రీహరి బీఆర్ఎస్ పార్టీకి తాము భాగస్వాములుగా కాలేదని, ఓనర్ షిప్ తమకు దక్కలేదంటూ వ్యాఖ్యానించారు. తమ నిర్ణయాలను పరిగణనలోకి తీసుకోకుండా పట్టించుకోనట్టుగా మాట్లాడేవారన్నారు. తెలంగాణ ఆవిర్భావానికి కొంత కాలం ముందు గులాభి జెండా ఎత్తుకున్న కడియం శ్రీహరి ఎంపీగా, ఎమ్మెల్సీగా, డిప్యూటీ సీఎంగా కూడా బాధ్యతలు చేపట్టారు. తాజాగా స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే టికెట్ కూడా కెటాయించడంతో ఎమ్మెల్యేగా గెలిచారు. అంతేకాకుండా కడియం కూతురు కావ్యకు వరంగల్ ఎంపీ టికెట్ కూడా కెటాయించిన తరువాత కాంగ్రెస్ పార్టీలో చేరి సంచలనం సృష్టించారు. మొదట్లో కేసీఆర్ ను ఉద్దేశించి అంతగా వ్యాఖ్యానించని కడియం రెండు రోజుల క్రితం జరిగిన సమావేశంలో మాత్రం కేసీఆర్ వ్యవహరించిన తీరుపై విమర్శలు చేయడం సంచలనంగా మారింది. తమ ప్రతిపాదనలకు ఏ మాత్రం ప్రయారిటీ లేకుండా పోయిందని కూడా ఆయన వ్యాఖ్యానించడం గమనార్హం.
అందరూ ఆయన్నే…
బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ అటు ఉద్యమ కారుల నుండి ఇటు మధ్యలో వచ్చి పార్టీలో చేరిన వారి నుండి కూడా విమర్శలు ఎదుర్కొంటున్న తీరే చర్చనీయాంశంగా మారింది. గతంలో ఈటల రాజేందర్ గులాభి జెండాకు ఓనర్లం మేం అంటూ వ్యాఖ్యానించగా, తాజాగా కడియం తమకు పార్టీలో ఓనర్ షిప్ రాలేదంటూ వ్యాఖ్యానించడం హాట్ టాపిక్ గా మారింది. ఉద్యమ పార్టీ ఏర్పాటు నుండి కలిసి నడిచిన వారు, ఆ తరువాత పార్టీ పంచన చేరిన వారు… అధికారంలోకి వచ్చిన తరువాత గులాభి జెండా నీడన చేరిన వారు కూడా కేసీఆర్ తీరునే తప్పు పడుతుండడం విస్మయం కల్గిస్తోంది. గతంలో ఓరిజినల్ తెలంగాణ (ఓటి) బంగారు తెలంగా (బిటి) బ్యాచులంటూ కూడా తెలంగాణ వ్యాప్తంగా ప్రచారం జరిగింది. ఇలా ప్రతి అంశంలోనూ కేసీఆర్ దే తప్పంటూ వేలెత్తి చూపుతున్న తీరు మాత్రం అందరినీ ఆశ్యర్యానికి గురి చేస్తోంది.
https://x.com/TeluguScribe/status/1779713801832824878?t=YEfFU2r6aAINmWGJBqeUHQ&s=08