గ‘మ్మత్తు’ వ్యాపారం… ట్రస్మా అధ్యక్షునికి వైన్ షాప్…

దిశ దశ, కరీంనగర్:

దశాబ్దాల కాలంగా విద్యా వ్యవస్థలో ఉన్న ఆయన ఉన్నట్టుండి లిక్కర్ దందాలోకి ఎంట్రీ ఇచ్చారు. అందునా ఆయన సాదా సీదా వ్యక్తి కూడా కాదు తెలంగాణ రికగ్నైజ్డ్ స్కూల్స్ మేనేజ్ మెంట్ అసోసియేషన్ (ట్రస్మా) అధ్యక్షుడు కూడా కావడంతో హాట్ టాపిక్ గా మారింది. సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా వైన్ షాపు టెండర్ల ప్రక్రియ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అయితే కరీంనగర్ కలెక్టరేట్ ఆడిటోరియంలో జరుగుతున్న వైన్ షాపుల వేలంలో అందరికీ షాక్ ఇచ్చారు ట్రస్మా రాష్ట్ర అధ్యక్షుడు యాదగిరి శేఖర్ రావు. కరీంనగర్ లోని గెజిట్ నెంబర్ 13 దుకాణాన్ని డ్రాలో దక్కించుకున్నారాయన. ఇంతకాలం విద్యారంగంలో ఉన్న శేఖర్ రావు అనూహ్యంగా లిక్కర్ దందాలోకి ఎంట్రీ ఇవ్వడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. అయితే నిన్న మొన్నటి వరకు రాష్ట్రంలో పెద్ద ఎత్తున దరఖాస్తులు రావడానికి కారణం ఇసుక వ్యాపారులతో పాటు రియాల్టర్లు కూడా లిక్కర్ దందా చేసేందుకు ఆసక్తి చూపుతున్నారని భావించారంతా. కానీ కరీంనగర్ కలెక్టరేట్ లో చోటు చేసుకున్న ఘటనతో విద్యారంగంలోని వారు కూడా ఈ సారి మద్యం వ్యాపారం వైపు మొగ్గు చూపినట్టుగా తేలిపోయింది.

సిండికేట్..?

అయితే వైన్ షాపుల నిర్వహణ కోసం ఇంతకాలం లిక్కర్ మాఫియా మాత్రమే పట్టు సాధించుకుంటూ ముందుకు సాగింది. తాజాగా నెలకొన్న పరిణామాలు లిక్కర్ సిండికేట్ వ్యాపారులకు సవాల్ గా నిలుస్తున్నాయని చెప్పక తప్పదు. రాష్ట్ర వ్యాప్తంగా ఇతర రంగాలకు చెందిన వారు లిక్కర్ దందా చేసేందుకుం ఉత్సుకత చూపించినట్టుగా తెలుస్తోంది. తాజాగా ఎడ్యూకేషన్ వింగ్ కు సంబంధించిన సిండికేట్ కూడా మద్యం అమ్మకాలు చేసి వ్యాపారం చేసేందుకు ఆసక్తి చూపుతున్నట్టుగా స్పష్టం అయింది.

You cannot copy content of this page