పాదయాత్రలతో ప్రజల్లోకి…

నాడు ఉద్యమ ప్రస్థానాల్లో అత్యంత కీలక భూమిక పోషించిన పాయాత్రలు నేడు అధికారం కోసం ప్రజల్లోకి వెల్లేందుకు దోహదపడుతున్నాయి. బ్రిటీష్ పాలకుల విముక్తి కోసం స్వాతంత్ర్య పోరాటంలో జాతిపిత మహాత్మాగాంధీ పాదయాత్ర చేసిన సంగతి తెలిసిందే. ఆచార్య వినాభా భావే భూధానోద్యమం కోసం పాదయాత్ర జరిపారు. అయితే గత రెండు దశాబ్దాలుగా పరిశీలిస్తే మాత్రం తెలుగు రాష్ట్రాల్లోనే పాదయాత్రలు ఎక్కువ సాగుతున్నాయి. దేశ వ్యాప్తంగా ప్రజాకర్షక కార్యక్రమాలతో ఆయా ప్రాంత నాయకులు ప్రత్యక్ష్య ఎన్నికలకు సన్నద్దమవుతుంటే ఏపీ, తెలంగాణలో మాత్రం పాదయాత్రలపై ఎక్కువ నమ్మకం పెట్టుకున్నట్టుగా స్పష్టం అవుతోంది.

విముక్తి కోసం…

1930లో ఆయన దండి యాత్ర పేరిట ఉప్పు సత్యాగ్రహం పేరిట మహాత్మా గాంధీ పాదయాత్ర చేపట్టారు. అహ్మదాబాద్ నుండి దండి వరకు 400 కిలోమీటర్ల మేర పాదయాత్ర కొనసాగించారు జాతిపిత. బ్రిటీష్ పాలకుల అణిచివేత సమయంలో చేపట్టిన ఈ ఉప్పు సత్యాగ్రహ పాదయాత్ర దండి చేరుకునే సరికి తోడైన జన ప్రవాహాంతో బానిస సంకెళ్ల విముక్తి కోసం ఇక్కడి ప్రజల ఆకాంక్షలు ఏంటో చేతల్లో చూపించింది. భారత స్వాతంత్ర్య పోరాటంలో కీలక మైలురాయిగా నిలిచిన ఈ యాత్ర ప్రభావంతో దేశ వ్యాప్తంగా కూడా ఉప్పు సత్యగ్రహ సంఘాలు ఆవిర్భావం అయ్యాయంటే దండియాత్ర ఏస్థాయిలో ప్రభావం చూపించిందో అర్థం చేసుకోవచ్చు. తిరిగి 1933-34లో అంటరానితనానికి వ్యతిరేకంగా దేశవ్యాప్త పాదయాత్ర చేసిన మహాత్మగాంధీ కుల వివక్షకు వ్యతిరేకంగా చైతన్యం తీసుకొచ్చారు. అణగారిన వర్గాలను అణిచివేసే ధోరణి విడనాడాలన్న సంకల్పంతో ఈ యాత్ర చేపట్టారు.

భూధానోద్యమం…

భారత దేశంలో స్వాతంత్ర్యం తరువాత జరిగిన పాదయాత్రల్లో ఆచార్య వినాభా భావే పాదయాత్ర అత్యంత ప్రభావితం చేయగలిగిన వాటిల్లో ఒకటి. 1951లో వినోభా భావే భూదాన్ ఉద్యమంలో భాగంగా తెలంగాణ నుండి బీహార్‌లోని బుద్ద గయా వరకు నడిచారు. లక్షల ఎకరాల భూమిని భూదానోద్యమంలో భాగంగా సేకరించి భూదాన్ ట్రస్ట్ పరిధిలోకి తీసుకున్నారు.

కాంగ్రెస్ నేతలూ…

1983లో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతగా ఉన్న మాజీ ప్రధాని చంద్రశేఖర్ ప్రజా క్షేత్రంలో నెలకొన్న సమస్యలను ప్రత్యక్ష్యంగా పరిశీలించేందుకు 6 నెలలు పాదయాత్ర నిర్వహించారు. 4,260 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేసిన చంద్రశేఖర్ కన్యాకుమారి నుండి దేశ రాజధాని ఢిల్లీ వరకు కొనసాగించారు. తాజాగా గాంధీ కుటుంబం నుండి రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర నిర్వహిస్తున్న సంగతి తెలిసింది. ఉత్తరాది, దక్షిణాది రాష్ట్రాల మీదుగా సాగుతున్న రాహుల్ గాంధీ పాదయాత్ర సుదీర్ఘ కాలం సాగుతున్నది. దేశ ప్రజలతో మమేకమై ప్రజా సమస్యలపై గళమెత్తుతూ రాహుల్ గాంధీ ముందుకు సాగుతున్నారు. 2024 ఎన్నికల్లో ఎన్డీఏ సర్కార్ ను గద్దె దించి యూపీఏ సర్కార్ కు అధికారం రావాలన్న సంకల్పంతో రాహుల్ గాంధీ పాదయాత్ర చేపట్టారు.

తెలుగు రాష్ట్రాలే టాప్…

ఇకపోతే దేశంలో ఉత్తరాది కంటే దక్షిణాది రాష్ట్రాల్లో అందునా తెలుగు స్టేట్స్ లోనే పాదయాత్రల పరంపర ఎక్కువగా కొనసాగుతోంది. వైఎస్సార్, నారా చంద్రబాబు నాయుడు కుటుంబాలు పాదయాత్రల వైపు ఎక్కువగా మొగ్గు చూపి చరిత్ర సృష్టించాయి. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కూడా పాదయాత్ర కొనసాగిస్తున్నారు. ఇప్పటి వరకు జరిగిన పాదయాత్రల్లో ఏపీ, తెలంగాణలే టాప్ ఉంటాయని చెప్పవచ్చు.

ఒకే కుటుంబం నుండి…

ఒకే కుటుంబం నుండి ముగ్గురు పాదయాత్ర చేపట్టిన చరిత్ర వైఎస్ కుటుంబానికే దక్కుతుంది. సరిగ్గా రెండు దశాబ్దాల క్రితం అంటే 2003లో ఎండకాలంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ప్రతిపక్షనేతగా ఉన్న వైఎస్ 1,467 కిలోమీటర్లు పాదయత్ర చేపట్టారు. ఉమ్మడి రాష్ట్రంలోని అన్ని జిల్లాలను కలుపుతూ వైఎస్ రాజశేఖర్ రెడ్డి చేసిన ఆ పాదయాత్రతో తెలుగు నాట ఆయన ఇమేజ్ చాలా పెరిగింది. వైఎస్సార్ పాదయాత్ర కారణంగానే 2004లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. రెండు దశాబ్దాలు కావస్తున్న వైఎస్ పాదయాత్ర గురించి నేటికి చర్చ సాగుతున్నదంటే ఆయన తీసుకున్న నిర్ణయం ఎంతటి ప్రభావం చూపిందో అర్థం చేసుకోవచ్చు. 2009 సెప్టెంబర్ 2న వైఎస్ మరణాంతరం నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా వైఎస్ రాజశేఖర్ రెడ్డి తనయుడు జగన్ మోహన్ రెడ్డి పాదయాత్ర చేపట్టారు. ఈ క్రమంలో ఆయన అరెస్ట్ తో పాదయాత్ర నిలిచిపోగా జగన్ సోదరి షర్మిల పాదయాత్ర చేశారు. 2014లో రాష్ట్రాల విభజన తరువాత ఏపీలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి వ్యతిరేకంగా మరోసారి జగన్ ఏపీలో పాదాయత్రకు శ్రీకారం చుట్టారు. దీంతో 2019లో జరిగిన ఎన్నికల్లో భారీ మెజార్టీతో జగన్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. మరో వైపున తెలంగాణలో షర్మిల కూడా 33 జిల్లాల్లో పాదయాత్ర కొనసాగిస్తున్నారు. ఇప్పటి వరకు వైఎస్ షర్మిల 3500 కిలోమీటర్లు పూర్తి చేయగా మరో విడుత చేపట్టేందుకు సమాయత్తం అవుతున్నారు.

నారా ఫ్యామిలీ…

దశాబ్దం క్రితం మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా పాదయాత్ర చేశారు. ఉమ్మడి రాష్ట్రంలోని 13 జిల్లాలను కలుపుతూ సాగిన ఈ పాదయాత్రలో 2817 కిలోమీటర్ల మేర సాగింది. ‘వస్తున్నా మీకోసం’ అని పేరు పెట్టిన ఈ పాదయాత్ర ద్వారా 2012 అక్టోడర్ 2న హిందూపురలో చేపట్టిన ఈ పాదయాత్ర 2014 ఎన్నికలే లక్ష్యంగా పెట్టుకోవడంతో పాటు అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపి ప్రజల్లో సానుకూలత కోసం ప్రయత్నించారు. అయితే తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం కోసం కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం, ఉభయ సభలు రాష్ట్ర ఏర్పాటు బిల్లును ఆమోదించడంతో చంద్రబాబు నాయుడు ఏపీకే పరిమితం కావల్సి వచ్చింది. అయినప్పటికీ 2014 ఎన్నికల్లో టీడీపీ ఏపీలో అధికారం చేపట్టడంలో పాదయాత్ర ప్రభావం చూపింది. తాజాగా 2023 జనవరి 27న ఆయన తనయుడు మాజీ మంత్రి నారా లోకేష్ పాదయాత్ర ప్రారంభిస్తున్నారు. 400 రోజులు 4వేల కిలోమీటర్ల మేర చేపడుతున్న ఈ పాదయాత్రకు ‘యువగళం’ అని నామకరణం చేశారు. చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పం నుండి ఈ పాదయాత్ర ప్రారంభం అయింది.

బీజేపీ చీఫ్…

ఇకపోతే తెలంగాణలో భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ పాదయాత్ర కొనసాగిస్తున్నారు. దక్షిణ, ఉత్తర తెలంగాణల్లోని అన్ని జిల్లాలను కలుపుతూ విడుతల వారిగా ‘ప్రజా సంగ్రామ యాత్ర’ చేపట్టారు. బీజేపీ జాతీయ నాయకత్వం దక్షిణాది రాష్ట్రాల్లో కాషాయం జెండా ఎగురవేయాలని సంకల్పించిన నేపథ్యంలో బండి సంజయ్ పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. 2022 ఆగస్టు 17న హైదరాబాద్ భాగ్యలక్ష్మీ ఆలయం వద్ద ప్రారంభించిన సంజయ్ ఇప్పటి వరకు ఐదు విడుతలుగా 1250 పాదయాత్ర చేపట్టగా ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో బస్సు యాత్రకు శ్రీకారం చుట్టాలని ఇప్పటికే అధిష్టానం సూత్ర ప్రాయంగా సూచించింది. తెలంగాణ ప్రభుత్వం ముందస్తు ఎన్నికలకు రానట్టయితే ఆరో విడుత కొడంగల్ నుండి నిజామాబాద్ వరకు కొనసాగించే అవకాశాలు ఉన్నాయి. ఆరోవిడుతతో పాదయాత్రకు పుల్ స్టాప్ పెట్టి ఆ తరువాత బస్సుయాత్రకు శ్రీకారం చుట్టే అవకాశాలు ఉన్నాయి. అయితే జాతీయ నాయకత్వం మరో ఆలోచన కూడా చేస్తున్నట్టు సమాచారం. బండి సంజయ్ పాదయాత్రను యథావిధిగా ఎన్నికల వరకు కొనసాగించి, ద్వితీయశ్రేణి నాయకులతో నియోజకవర్గాల్లోని ప్రజలతో మమేకం అయ్యేందుకు అవసరమైన కార్యాచరణ రూపొందిస్తున్నట్టుగా సమాచారం. పాలమూరు జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గంలో బీజేపీ నేత ఎల్లేని సుధాకర్ రావు తన నియోజకవర్గం వరకు పాదయాత్ర చేపట్టారు.

గతంలో ఎంతో మంది…

తెలుగు నేలపై పాదయాత్రలు చాలానే కొనసాగాయి. స్వాతంత్ర్యం తరువాత ముద్రగడ పద్మనాభం, రాయలసీమలో డాక్టర్ ఎంవి మైసూరారెడ్డి, తూర్పుగోదావరి జిల్లాలో డీసీసీ అధ్యక్షునిగా వ్యవహరించిన టీవి సత్యనారాయణ రెడ్డిలు పాదయాత్రలు చేపట్టారు. తెలంగాణలో 2016-17లో సీపీఎం నేత తమ్మినేని వీరభద్రం 4 వేల కిలోమీటర్ల మేర మహాజన పాదయాత్ర చేశారు. కరీంనగర్ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ లోకసభ పరిధిలో పాదయాత్ర చేపట్టగా, కరీంనగర్ డీసీసీ అధ్యక్షుడు కవ్వంపల్లి సత్యనారాయణ కూడా మానకొండూరు నియోజకవర్గ వ్యాప్తంగా పాదయాత్ర చేశారు. వచ్చే ఎన్నికల నాటికి పాదయాత్రలపై మరింత మంది నాయకులు నమ్మకం పెట్టుకుని ముందుకు సాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. నియోజకవర్గ స్థాయి నాయకులు కూడా నేరుగా ఓటర్లను కలిసేందుకు పాదయాత్రలనే నమ్ముకునేందుకు ప్రాధాన్యం ఇవ్వనున్నట్టుగా స్పష్టమవుతోంది.

చైనా పితామహుడు జడాంగ్ నుండి…

మావో జెడాంగ్ చైనాలో లాంగ్ మార్చ్ చేసి ప్రజాబలాన్ని సంపాదించిన నేత కావడం విశేషం. ఈయనే ప్రపంచం వ్యాప్తంగా తొలిసారి పాదయత్ర చేపట్టినట్టుగా ఇప్పటి వరకు ఉన్న సమాచారాన్ని బట్టి వెల్లడవుతోంది.
చైనాలో మావో జడాంగ్ అర్బన్ ఏరియా కార్మిక వర్గాలను కాకుండా గ్రామీణ ప్రాంతంలోని రైతాంగాన్ని అక్కున చేర్చుకోవాలన్న సంకల్పంతో ముందుకు సాగారు. భూస్వామ్య వ్యతిరేక నినాదంతో రైతాంగ సైన్యాన్ని తయారు చేసుకున్న జడాంగ్ మహిళ సమస్యల పరిష్కారం కోసం గ్రామీణ మహిళా సంఘాలను ఏర్పాటు చేశారు. 1934-35లో చేపట్టిన ఈ ‘లాంగ్ మార్చ్’ లో 6000 మైళ్ళ పాదయాత్ర చేపట్టారు. చైనా ప్రజల అభిమానాన్ని చూరగొని 1949లో చైనాలో చైనా గణతంత్రాన్ని ఏర్పాటు చేసి దేశ చరిత్ర స్థితి గతులను మార్చేయడంలో జడాంగ్ లాంగ్ మార్చ్ కీలక భూమిక పోషించింది. లక్షలాది మంది పాల్గొన్న చైనా లాంగ్ మార్చ్ పేరుకు తగ్గట్టుగానే 10 వేల కిలోమీటర్లు, ఏడాదిన్నర కాలం పాటు ఈశాన్య ప్రాంతం నుండి వాయువ్య చైనా వరకు కొనసాగింది.

You cannot copy content of this page