మంత్రి హరీష్ రావుపై ప్రశ్నల పరంపర
దిశ దశ, సిద్దిపేట:
పాలమాకుల గ్రామస్థులు మంత్రి హరీష్ రావు లక్ష్యంగా ప్రశ్నాస్త్రాలు సంధిస్తున్నారు. వారు మంత్రిని కలిసి ప్రశ్నించకుండా గ్రామంలోనే ఫ్లెక్సీలను ఏర్పాటు చేసి సరికొత్త తరహాలో వ్యవహరిస్తున్నారు. రాష్ట్ర మంత్రి హరీష్ రావు అంటే సిద్దిపేట అభివృద్దికి కేరాఫ్ అడ్రస్ అన్న పేరుంటే… ఆ గ్రామస్థులు మాత్రం ప్రశ్నలతో కూడిన ఫ్లెక్సీలను ఏర్పాటు చేసి సంచలనం సృష్టించారు. సర్కారు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలకు తాము అర్హులం కామా అంటూ వారు అడుగుతున్నారు. గ్రామంలోని పలు చోట్ల ఏర్పాటు చేసిన ఈ ఫ్లెక్సీలలో మాకు ఎందుకు ఇవ్వరు … మేము అర్హులం కాదా..? అని ప్రశ్నిస్తూ… మైనార్టీ లోన్, డబుల్ బెడ్ రూంలు, బిసి లోన్స్, గృహలక్ష్మీ ప్రభుత్వ పథకాలు మాకు అందని ద్రాక్షేనా..? పాలమాకుల అంటూ ఆ ప్లెక్సీల్లో ముద్రించారు. ఉన్నట్టుండి పాలమాకుల గ్రామస్థులు మంత్రి హరీష్ రావుపై ప్రశ్నలు సంధిస్తూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం చర్చనీయాంశంగా మారింది. సిద్దిపేట నియోజకవర్గం అంటే హరీష్ రావు… హరీష్ రావు అంటే సిద్దిపేట నియోజకవర్గం అని పేరుంది. బీఆర్ఎస్ పార్టీ ప్రముఖులు కూడా మంత్రి హరీష్ రావు అత్యంత బలమైన శక్తి అంటూ చర్చించుకుంటారు. అక్కడ పోటీ చేసేందుకు ప్రత్యర్థి పార్టీల నాయకులు జంకే పరిస్థితి ఉంటుంది తప్ప సాహసించేవారే ఉండరన్న ధీమాతో ఆ పార్టీ ముఖ్య నాయకత్వం ఉంటుంది. అటువంటి నాయకుడిని తమకు సంక్షేమ పథకాలు ఏవీ అని ప్రశ్నిస్తూ ఫ్లెక్సీలు ఏర్పాటు కావడం ఏంటన్నదే అంతుచిక్కకుండా పోయింది. ఏది ఏమైనా ఈ అంశంపై మంత్రి తన్నీరు హరీష్ రావు ఎలా స్పందిస్తారో చూడాలి మరి.