నాలుగేళ్ల ట్యాక్స్ చెల్లించడం లేదెందుకు..?
దిశ దశ, కరీంనగర్:
ప్రజా అవసరాలకు ఉపయోగించే విషయంలో కూడా బిల్లు చెల్లించకపోతే సరఫరా నిలిపేయడంలో వెనకాడని ట్రాన్స్ కో అధికారులు పంచాయితీ పన్ను చెల్లించడంలో మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. దీంతో విసుగు చెందిన ఓ పంచాయితీ కార్యదర్శి ట్రాన్స్ కో అధికారులకు నోటీసులు జారీ చేశారు. కరీంనగర్ సమీపంలోని దుర్శేడు పంచాయితీ పరిధిలో 220/132/33 కెవి సబ్ స్టేషన్ ఉంది. ఈ సబ్ స్టేషన్ కు సంబందించిన ట్యాక్స్ దాదాపు నాలుగేళ్లుగా ట్రాన్స్ కో పంచాయితీకి చెల్లించడం లేదు. రూ. 7.28 లక్షల మేర పన్ను చెల్లించాల్సి ఉన్నందున వెంటనే కట్టాలంటూ నోటీసులు జారీ చేసింది. ఈ మేరకు దుర్శేడు పంచాయితీ సెక్రటరీ ట్రాన్స్ కో ఏఈకి నోటీసులు జారీ చేసి ఈ నెల 31 లోగా పెండింగ్ ట్యాక్స్ చెల్లించాలని కోరారు. ఆర్థిక సంవత్సరం ముగుస్తున్న నేపథ్యంలో వెంటనే పన్ను చెల్లించాలని లేనట్టయితే పంచాయితీరాజ్ యాక్టు ప్రకారం చర్యలు తీసుకుంటామని కూడా ఆ నోటీసులో వెల్లడించారు. గతంతో కూడా పెండింగ్ ట్యాక్స్ గురించి దుర్శేడు పంచాయితీ కార్యదర్శి నోటీసులు జారీ చేసినట్టుగా తెలుస్తోంది. అయినప్పటికీ ట్రాన్స్ కో నుండి ఎలాంటి స్పందన లేకపోవడంతో తాజాగా మరో నోటీసు ఇవ్వడం గమనార్హం. ట్రాన్స్ కో అధికారులు మాత్రం వినియోగదారులే అయిన ప్రజా అవసరాలకు వినియోగించే విద్యుత్ విషయంలో ఏ మాత్రం సంకోచించకుండా బిల్లు కట్టనట్టయితే విద్యుత్ సరఫరా నిలిపేస్తున్నారు. కానీ పంచాయితీ ట్యాక్స్ ఏండ్లుగా చెల్లించకపోవడం విస్మయం కల్గిస్తోంది. తమ సంస్థకు రావల్సిన బకాయిల విషయంలో ఓ తీరుగా, సంస్థ చెల్లించాల్సిన పన్ను విషయంలో ఓ రకంగా ట్రాన్స్ కో అధికారులు వ్యవహరిస్తుండడం గమనార్హం.