దిశ దశ, పెద్దపల్లి:
అందరి ఆరోగ్యం కోసం పారిశుద్ధ పనులు చేస్తున్నా తమ ఇంట్లో రోగాల బారిన పడితే ఆసుపత్రికి వెల్లే పరిస్థితి లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సర్కారు అమలు చేస్తున్న మల్టీపర్పస్ విధానంతో తమకు ఇక్కట్టు తప్పడం లేదని వేతనాలు సరిగా రావడం లేదని వాపోతున్నారు. గ్రామ పంచాయితీ వ్యవస్థలో అత్యంత కీలకమైన పారిశుద్ధ విభాగంలో పని చేస్తున్న కార్మికులు ఇంటింటికి తిరిగి బిక్షాటన చేస్తున్నారు. ఆదివారం పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం కనగర్తి పంచాయితీ కార్మికులు తమ ఆకలి తీర్చుకునేందుకు జోలె పట్టక తప్పడం లేదంటున్నారు. మురికి కూపాలను శుభ్రం చేస్తున్నా వేతనాలు రాక తమ ఇళ్లలోని వారు మాత్రం అనారోగ్యానికి గురైతే చేతిలో చిల్లిగవ్వ కూడా లేని పరిస్థితుల్లో ఉన్న తాము ఏం చేయాలో అర్థం కాక దిక్కులు చూస్తూ బ్రతుకుతున్నామన్నారు. డబ్బు చాటింపు చేసి గ్రామస్థులను అప్రమత్తం చేస్తున్నా తమ డొక్కలలోపల కదులుతున్న పేగులకు పట్టెడన్నం పెట్టే పరిస్థితి లేకుండా పోయిందని కార్మికులు కన్నీటి పర్యంతం అవుతున్నారు. మల్టి పర్పస్ విధానాన్ని తొలగించి తమ వేతనాలను వెంటనే మంజూరు చేయాలని వారు వేడుకుంటున్నారు. లేనట్టయితే తమ కుటుంబాల పరిస్థితి అగమ్యగోచరంగా తయారవుతోందని పంచాయితీ కార్మికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తమను కనికరించి కష్టాల కడలి నుండి బయటకు తీసుకరావాలని అభ్యర్థిస్తున్నారు.
Disha Dasha
1884 posts
Prev Post
Next Post