కార్మికుల సమ్మె ఎఫెక్ట్…
దిశ దశ, సిద్దిపేట:
పంచాయితీ ట్రాక్టర్ డ్రైవర్ గా ఓ సర్పంచ్ భర్త వ్యవహరించాల్సి వచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా పంచాయితీ కార్మికులు తమ డిమాండ్లు నెరవేర్చాలంటూ సమ్మె బాట పట్టిన సంగతి తెలిసిందే. దీంతో గ్రామాల్లో పేరుకపోయిన చెత్తతో ప్రజలు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. వానా కాలం కూడా ప్రారంభం కావడంతో మురుగు నీరు నిలువ ఉండి ప్రజలు అనారోగ్యం బారిన పడే పరిస్థితి తయారైంది. దీంతో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసిన ఓ సర్పంచ్ గ్రామంలోని చెత్తను తొలగించడం ఆరంభించారు. అయితే చెత్తను యార్డుకు తరలించేందుకు ట్రాక్టర్ డ్రైవర్ ఎలా అని ఆలోచించిన సర్పంచ్ తన భర్తను ట్రాక్టర్ నడిపించాలని సూచించింది. దీంతో ఆయన కూడా పంచాయితీ ట్రాక్టర్ లో చెత్తను యార్డుకు తరలించే పనిలో నిమగ్నం అయ్యారు. సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం వడ్లూరులో ఆదివారం సర్పంచ్ చొరవ తీసుకోవడం చెత్త సమస్యకు పరిష్కారం దొరికినట్టయింది. గ్రామ సర్పంచ్ నలువాల అనిత తన భర్త స్వామిని ట్రాక్టర్ నడిపించాలని కోరడంతో ఆయన కూడా గ్రామస్థుల ఆరోగ్యాంగ ఉండాలని భావించి ట్రాక్టర్ లో చెత్తను డంప్ యార్డుకు రవాణా చేసేందుకు ముందుకు వచ్చారు. వర్షాలు ఇలాగే కంటిన్యూ అయితే చెత్తలో క్రిమి కీటకాలు ఏర్పడి గ్రామస్థులు అనారోగ్యం బారిన పడుతారన్న ఉద్దేశ్యంతో ఈ చర్యలకు పూనుకున్నామని సర్పంచ్ నలువాల అనిత అంటున్నారు. ఎన్నికల వరకు మీతో పని లేదని భావించే ప్రతినిధుల కన్న ఈ సర్పంచ్ భర్త కూడా తనవంతు సేవ చేయడం పట్ల పలువురు అభినందించారు. పంచాయితీ కార్మికుల సమ్మె కారణంగా మిగతా గ్రామాల్లో కూడా ఇదే పరిస్థితి తయారయ్యే అవకాశాలు లేకపోలేదన్న వాదనలు కూడా వినిపిస్తున్నాయి.
Disha Dasha
1884 posts
Prev Post