బినామీలుగా ఉన్న పాపానికి ఇక్కట్లు తప్పవా..?

పట్టాదారుల్లో మొదలైన దడ…

నర్సింగాపూర్ భూముల కథ

దిశ దశ, జగిత్యాల:

వడ్డించే వాడు మనవాడైతే చాలనుకుని ఇష్టారీతిన పేర్లు రికార్డుల్లోకి ఎక్కించిన కొంతమంది ప్రముఖుల పుణ్యమా అని ఇప్పుడు సామాన్యులు భయాందోళనకు గురవుతున్నారు. ప్రభుత్వ భూమికి సంబంధించిన రికార్డుల్లో తమ పేర్లు రాయించుకుని పెద్దల ఆధీనంలోనే ఉందని, ఇప్పుడు విచారణల పేరిట అధికారులు తమను పిలిపించి కేసులు పెడితే ఎలా అని కలవరడపుతున్నారు. 142 మంది పేరిట ఉన్న ఈ భూములన్ని కూడా ముగ్గురు లేదా నలుగురి చేతుల్లోనే ఉన్నాయని కేవలం తమ పేర్లు రాయించుకుంటామని చెప్తే సరేనన్నామని వారు వాపోతున్నారు. 80 ఎకరాల వరకు ఉన్న ఈ భూమి ప్రముఖులకు సంబంధించిన వారి పేరిట రికార్డుల్లో ఉన్నట్టుగా రెవెన్యూ అధికారులు గుర్తించిన సంగతి తెలిసిందే. 437 సర్వే నంబర్ భూమిని ఆక్రమించుకునేందుకు పెద్దలు అధికారులను మచ్చిక చేసుకుని దురాక్రమణ చేసుకున్న తీరు గురించి వెలుగులోకి వచ్చిన తరువాత తప్పించుకునేందుకు ప్రముఖులు కొత్త దారులు వెతుక్కుంటున్నారన్న ప్రచారం కూడా ఊపందుకుంది. ఇందులో బీఆర్ఎస్, బీజేపీలకు చెందిన తాజా మాజీ ప్రజా ప్రతినిధుల బంధువుల పేర్లు కూడా ఉండడం సంచలనంగా మారింది. భూమి ఆక్రమణకు గురైందని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఫిర్యాదు ఇచ్చే వరకూ కూడా రెవెన్యూ అధికారులు పట్టించుకున్న పాపాన పోలేదు. ఇందులో ప్రముఖులు ఉండడమే అసలు కారణమని కూడా స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. అయితే తాజాగా ఈ భూమి గుట్టు అంతా బట్టబయలు కావడంతో రికార్డుల్లో పేర్లు ఉన్న బినామీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నట్టుగా సమాచారం.

చర్యలు ఉంటాయా…?

నర్సింగాపూర్ భూముల విషయంలో రాజకీయ నాయకుల పేర్లు ప్రముఖంగా వినిపిస్తుండడం జగిత్యాల జిల్లా వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ భూమికి సంబంధించిన నివేదిక ఆధారంగా కలెక్టర్ చర్యకు పూనుకుంటారా లేదా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కేవలం భూమిని ప్రభుత్వానికి అప్పగించి చేతులు దులుపుకునే ఆలోచనలో ఉన్నట్టుగా జగిత్యాలలో ప్రచారం జరుగుతోంది. ప్రముఖులందరిని తప్పించాలన్న ఒత్తిళ్లు తీసుకొచ్చేందుకు సమాయత్తం అవుతున్నారన్న చర్చ కూడా జగిత్యాలలో సాగుతోంది. భారీ స్కాం వెలుగులోకి తెచ్చిన ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఈ విషయంలో వెనకడుగు వేసే అవకాశం లేదని బాధ్యులపై చర్యలు తీసుకునే వరకు పట్టువదలరని సన్నిహితులు అయితే చెప్తున్నారు. కాబట్టి నర్సింగాపూర్ భూముల వెనక ఉన్న వారందరిపై చర్యలు తీసుకునే అవకాశాలు ఉంటాయన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. పేదల పేరిట భూములు అక్రమించుకుని, రికార్డులను టాంపరింగ్ చేసిన వారిపై క్రిమినల్ చర్యలు కూడా తీసుకున్నట్టయితే బావుంటుందని జగిత్యాల ప్రాంత వాసులు అంటున్నారు. ఈ భూమిలో దర్జాగా ఇటుకబట్టీలను ఏర్పాటు చేసి రూ. లక్షల్లో ఆదాయం గడించిన బడా బాబులపై కఠినంగా వ్యవహరించేందుకు చొరవ చూపిస్తే బావుంటుందని లేనట్టయితే ప్రజల్లో కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకతను మూటగట్టుకునే ప్రమాదం ఉంటుందని అంటున్నవారూ లేకపోలేదు. రానున్న స్థానిక ఎన్నికల దృష్ట్యా భూ కబ్జాలకు పాల్పడిన వారిపై ప్రభుత్వం వ్యవహరించే తీరుతోనే ఈ ప్రాంత ప్రజల్లో సానుకూలత దక్కుతుందన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

You cannot copy content of this page