భూకంపాలను మరిపిస్తున్నారక్కడ…

పేళుల్లుకు అనుమతులు ఉన్నాయా..?

సబ్ లీజ్ ఇవ్వడం చట్టబద్దమేనా..?

దిశ దశ, కొత్తపల్లి:

గ్రానైట్ క్వారీల్లో బ్లాకుల సేకరణ… కటింగ్ మిషన్లతో సాగుతున్న రణగోణ ధ్వనుల మధ్య ఉన్న ఆ గ్రామాల్లో అసలేం జరుగుతోంది..? గ్రానైట్ క్వారీల్లో వేస్టేజ్ కోసం ఏర్పాటు చేసిన క్రషర్లలో సాగుతున్న తంతేంటీ..? బాహాటంగా సాగుతున్నా పట్టించుకోవడం లేదెందుకన్నదే అంతు చిక్కకుండా పోతోంది. కొత్తపల్లి మండలం కమాన్ పూర్, బద్దిపల్లి గ్రామాల శివార్లలోని వడ్డెపల్లి కాలనీలో అక్రమంగా క్రషింగ్ విధానంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇక్కడ ఏర్పాటు చేసిన ఓ క్రషర్ ద్వారా భారీ సైజులో ఉన్న బండరాళ్లను పగలగొట్టేందుకు ఏకంగా బ్లాస్టింగ్ చేస్తున్నా పట్టించుకునే వారు లేకుండా పోయారు. దీంతో వడ్డెపల్లి కాలనీలో నిత్యం భూకంపం వచ్చినట్టుగా భూమి కంపిస్తున్నతీరు వడ్డెపల్లి కాలనీ వాసులను కలవరపెడుతోంది. గ్రానైట్ క్వారీలోని వేస్టేజ్ ద్వారా క్రషర్ నిర్వహించుకోవల్సిన నిర్వాహకులు ఇష్టారీతిన వ్యవహరిస్తుండడం వల్లే ఈ పరిస్థితి తయారైందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రోజూ సాగుతున్న ఈ తంతుతో సమీపంలో నివసిస్తున్న వారంతా భయం గుప్పిట జీవనం సాగించాల్సి వస్తోంది. స్థానికులు పలుమార్లు ఆందోళనలు చేపట్టినా సంబంధిత విభాగాల అధికారులు మాత్రం ఈ క్రషర్ ను కట్టడి చేసేందుకు చొరవ తీసుకోకపోవడం విస్మయం కల్గిస్తోంది.

అనుమతి సరే…

గ్రానైట్ క్వారీలో సేకరించిన బ్లాకులను ఎగుమతి చేయగా మిగిలిన బండరాళ్లను క్రషర్ ద్వారా కంకరగా మార్చి విక్రయించుకునేందుకు మైనింగ్ అధికారులు అనుమతి ఇచ్చినట్టుగా తెలుస్తోంది. అయితే గ్రానైట్ క్వారీలో వేస్టేజ్ ని క్రషింగ్ చేసేందుకు మందుగుండు సామాగ్రిని ఉపయోగించేందుకు ప్రత్యేకంగా అనుమతి తీసుకోవల్సి ఉన్నప్పటికీ అక్రమంగానే ఈ తంతు సాగుతోందని స్థానికులు ఆరోపిస్తున్నారు. కేవలం మైనింగ్ విభాగం నుండి అనుమతులు తీసుకున్నప్పటికీ ఇతరాత్ర శాఖల నుండి పర్మిషన్లు తీసుకోలేదని అయినప్పటికీ దర్జాగా వ్యవహరిస్తున్నారంటూ స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అక్రమంగా సాగుతున్న ఈ పేళుల్ల వల్ల సమీపంలోని ఇండ్లలో చిన్నారులు, వృద్దులు, భయపడిపోతున్నారని వాపోతున్నారు. అయితే క్రషర్లను నిర్వహించేందుకు మినరల్ డీలర్ లైసెన్స్ ( MDL), పొల్యూషన్ సర్టిఫికెట్, నెల వారిగా ఎంతమేర క్రషింగ్ చేస్తున్నారో అందుకు సంబంధించిన పర్మిషన్ తీసుకోవల్సి ఉంటుందని తెలుస్తోంది. అలాగే బండరాళ్లను పగలగొట్టేందుకు బ్లాస్టింగ్ పర్మిషన్ అనుమతులు తీసుకున్నారా లేదా అన్న వివరాలను కూడా మైనింగ్ అధికారులు సేకరించాల్సి ఉంది. కానీ ఈ అంశాలపై దృష్టి సారించకపోవడంతో ఇష్టా రాజ్యంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

సబ్ లీజ్…

అయితే మైనింగ్ విభాగం నుండి పర్మిషన్ తీసుకున్న వారు మాత్రమే క్రషర్లను నిర్వహించాల్సి ఉంటుందని, సబ్ లీజ్ ఇవ్వడం కూడా చట్టబద్దం కాదని తెలుస్తోంది. కానీ క్రషర్లకు అనుమతులు తీసుకున్న వారు కాకుండా ఇతరులు ఇక్కడ క్రషర్లను నిర్వహిస్తూ నిబంధనలను అతిక్రమిస్తున్నారన్న విషయంపై కూడా అధికారులు దృష్టి సారించి కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని స్థానికులు అంటున్నారు.

కట్టడి చేయకపోతే…

అక్రమంగా మందుగుండు వినియోగంపై కఠినంగా వ్యవహరించపోతే తీరని నష్టాన్ని చవి చూడాల్సి వస్తోందన్న అభిప్రాయాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. గతంలో మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లా దామరంచ సబ్ పోలీస్ స్టేషన్ పరిధిలో అక్కడి పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్బంగా అనుమానిత వ్యక్తుల నుండి పేలుడు కోసం వినియోగించే కార్డెక్స్ వైర్, మందుగుండు సామాగ్రిని అక్కడి పోలీసులు పట్టుకున్నారు. కరీంనగర్ సమీపంలోని ఓ కాలనీలో నివాసం ఉంటున్న వ్యక్తి చత్తీస్ గడ్ లోని మావోయిస్టులకు తీసుకెల్తున్న క్రమంలో దామరంచ సబ్ పోలీస్ స్టేషన్ పోలీసులు పట్టుకున్నారు. ఈ విషయంపై గడ్చిరోలి జిల్లా పోలీసులు క్షేత్ర స్థాయిలో విచారణ చేసేందుకు కరీంనగర్ వరకూ చేరుకున్నారు. ఈ సందర్బంగా కార్డెక్స్ వైర్, మందుగుండు సామాగ్రి ఏ క్వారీ పేరిట కొనుగోలు చేశారోనన్న విషయం ఆరా తీసే ప్రయత్నం చేశారు గడ్చిరోలి జిల్లా పోలీసులు. అక్రమంగా మందుగుండు సామాగ్రి వినియోగం వల్ల గుట్టు చప్పుడు కాకుండా మావోయిస్టులకు అవి చేరుతున్నాయన్న విషయం తేటతెల్లం అయింది. కరీంనగర్ సమీపంలోని గ్రానైట్ క్వారీల నుండే కార్డెక్స్ వైర్, మందుగుండు సామాగ్రి తరలిపోతుందున్న విషయం పోలీసు ఉన్నతాధికారుల దృష్టిలో కూడా ఉన్న నేపథ్యంలో ఇక్కడ అక్రమంగా వినియోగిస్తున్న పేలుడు పదార్థాలను కట్టడి చేసేందుకు స్పెషల్ ఆపరేషన్ చేపట్టాల్సిన అవసరం ఉందన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. లేనట్టయితే పేలుడు పదార్థాలు సంఘ విద్రోహ శక్తుల చేతుల్లోకి చేరినట్టయితే తీరని నష్టాన్ని చవిచూడాల్సి వస్తుంది.

You cannot copy content of this page