హారన్ల మోతలా… మృత్యు ఘంటికలా..?

ఇసుక లారీల దూకుడుపై ఆందోళన

దిశ దశ, భూపాలపల్లి:

గల గల పారే గోదావరి తీరంలో నీటి సవ్వడులు మూగబోయాయి. సహజత్వానికి ప్రతీకగా నిలిచే ఆ ప్రాంతం ఇప్పుడు లారీల రాకపోకలతో దద్దరిల్లిపోతోంది. నదిలో ఇసుక సేకరణ, స్టాక్ యార్డుల్లో లోడింగ్ ప్రక్రియతో బిజీబీజీగా మారిపోయిందా ప్రాంతం. ఇక లారీల రాకపోకలతో ఎటు వైపు నుండి మృత్యువు కోరలు చాచి తమను బలి తీసుకుంటుందోనన్న భయం ఆ ప్రాంత వాసులను కలవరపెడుతోంది. ప్రకృతి ఒడిలో సెద తీరాల్సిన వారంతా ప్రమాదపుటంచున జీవనం సాగించాల్సిన భయానక పరిస్థితులు నెలకొన్నాయి. ప్రభుత్వానికి ఆదాయం, భాగ్యనగరంలోని భాగ్యవంతుల బహుళ అంతస్థుల భవనాల కోసం అవసరమైన ఇసుక ఇక్కడ అందుబాటులో ఉండడమే స్థానికులకు శాపంగా మారింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని గోదావరి పరివాహక ప్రాంత వాసులు భయం గుప్పిట జీవనం సాగించాల్సిన దుస్థితి తయరైంది.

లారీల ఇష్టారాజ్యం…

ఇసుక లారీ ఎన్ని ట్రిప్పులు కొడితే అంతే లాభం వస్తుందన్న ఆశ డ్రైవర్లలో కలుగుతుంటే… తమ లారీ ఎంత తిరిగితే అంతకు రెట్టింపు లాభం ఉంటుందని యజమానులు లెక్కలు వేసుకుంటున్నారు. కానీ డ్రైవర్లు లారీలను క్షేమంగా గమ్యం చేర్చేంత విశ్రాంతి తీసుకుంటున్నారా..? నిబంధనల మేరకు లారీ డ్రైవర్లను మారుస్తున్నారా అన్న విషయం దేవుడెరుగు. నిరంతరాయంగా 24 గంటల పాటు డ్యూటీ చేయాల్సిన డ్రైవర్ కు ఒక రోజు రెస్ట్ ఇచ్చిన తరువాతే లారీ అప్పగించాల్సి ఉంటుంది. కానీ ఇసుక వ్యాపారం మూడు ట్రిప్పులు ఆరు రకాల లాభాలు అన్న యోచనతో కొనసాగిస్తుండడమే ఇందుకు కారణంగా స్పష్టం అవుతోంది. ఆర్టీఏ నిబంధనలకు విరుద్దంగా డ్రైవర్ సిద్దంగా ఉన్నాడంటే చాలు లారీ అప్పగించి ఇసుక రీచుల బాట పట్టిస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. భారీ వాహనాలను నడిపే డ్రైవర్ల విషయంలో అమలు చేయాల్సిన నిబంధనల గురించి పట్టించుకునే వారే లేకపోవడంతో ఈ పరిస్థితి తయారైందన్న ఆందోళన స్థానికంగా వ్యక్తం అవుతోంది. సర్కారు ఆదాయానికి గండి పడిందని గమనించి వివిధ శాఖల సమన్వయంతో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసిన ప్రభుత్వం నిబంధనలకు విరుద్దంగా సాగుతున్న వ్యవహారాలపై కూడా దృష్టి సారించాల్సిన అవసరం ఉందన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. లారీల డ్రైవర్లు రెస్ట్ తీసుకున్న తరువాతే డ్యూటీలోకి ఎక్కుతున్నారా లేదా అన్న విషయంలో కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. ఒకవేళ తమ లారీపై పని చేస్తున్న డ్రైవర్ కు యజమాని విశ్రాంతి ఇచ్చిన అదే డ్రైవర్ మరో లారీ నడిపేందుకు సమాయత్తం అవుతున్నాడా అన్న విషయం కూడా తెలుసుకోవల్సిన అవసరం ఉంది. ఇసుక లారీల రాకపోకలతో మరణ మృదంగం సాగుతున్న తీరును గమనించి అధికారులు లారీల అతి వేగాన్ని కట్టడి చేయడంతో పాటు డ్రైవర్లకు డ్యూటీ అప్పగిస్తున్న తీరుపై కూడా చొరవ తీసుకోవాలని అభ్యర్థిస్తున్నారు స్థానికులు.

వరస ఘటనలు…

ఇటీవల కాటారం సెంటర్ లో ఇసుక లారీ ప్రమాదంలో ఒకరు శాశ్వతంగా కాళ్లు కోల్పోయారు. సోషల్ మీడియాలో ఈ ప్రమాదం గురించి వైరల్ కావడంతో మానవత్వంతో బాధితుని చికిత్స కోసం పలువురు ఆర్థిక సాయం చేశారు. కాళేశ్వరం ఎస్సీ కాలనీలోని ఓ ఇంటిపైకి లారీ దూసుకెళ్లడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఇంట్లో నివసిస్తున్న వారు ప్రాణాపాయం నుండి బయటపడగా ఇళ్లు ద్వంసం కావడంతో వారు నిరాశ్రయులు అయ్యారు. గురువారం కాటారం మండల కేంద్రంలో ఇసుక లారీ ఏకంగా డివైడర్ల మీదుగా దూసుకెళ్లింది. ఈ మూడు ఘటనలను గమనిస్తే మాత్రం లారీల డ్రైవర్లు తీవ్రమైన ఒత్తిడికి గురవుతున్నట్టుగా స్పష్టం అవుతోంది. తొందరగా గమ్యం చేరాలన్న ఆతృత, ఇసుక లోడ్ కోసం క్యూలో లారీని నిలబెట్టాలన్న బాధ, మరో ట్రిప్పు కొడితే అదనపు ఆదాయం వస్తుందన్న ఆశ ఇలా ఎన్న రకాల మానసిక సంఘర్షణలకు గురవుతున్న డ్రైవర్లు అతివేగంతో నడపుతుండడంతో అదుపుతప్పుతున్న సందర్భాలు చోటు చేసుకుంటున్నాయి. డ్రైవింగ్ చేస్తూ ఒక్క క్షణం కునుకు తీసినా వాహనం అదుపు తప్పే అవకాశం ఉంటుందన్నది వాస్తవం. దీంతో సామాన్యులు కూడా ప్రాణాలు కోల్పోయే ప్రమాదం కూడా ఉంటుంది. కాబట్టి ఇసుక లారీలు నడిపే డ్రైవర్ల విషయంలో కూడా ప్రత్యేక చొరవ తీసుకోవల్సిన అవసరం ఉంది. గతంలో ట్రాఫిక్ నియంత్రణ కోసం TGMDC కాంట్రాక్టు ఎంప్లాయిస్ ను నియమించి ట్రాఫిక్ క్రమబద్దీకరణ చర్యలు తీసుకునే వారు. కానీ ఇటీవల కాలంలో ఈ విధానానికి మంగళం పాడడంతో ఇసుక లారీలను కట్టడి చేసే అవకాశం లేకుండా పోయిందన్న వాదనలు స్థానికంగా వినిపిస్తున్నాయి. పోలీసు అధికారులైన చొరవ తీసుకున్న ఇసుక లారీలను కట్టడి చేసేందుకు చొరవ తీసుకోవాలని ఈ ప్రాంత వాసులు కోరుతున్నారు.

You cannot copy content of this page