రూ. 2 కోట్ల ఆస్తి నష్టం…
ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి
కరీంనగర్ బీఎస్ఎన్ఎల్ కార్యాలయంలో జరిగిన అగ్ని ప్రమాదంతో ఆస్తి నష్టంతో పాటు కమ్యూనికేషన్ వ్యవస్థ కూడా ఎక్కడిక్కడ స్తంభించిపోయింది. షాట్ సర్క్యూట్ కారణంగా చోటు చేసుకున్న ఈ ప్రమాదంలో బీఎస్ఎన్ఎల్ రూ. 2 నుండి 3 కోట్ల మేర ఆస్థి నష్టం వాటిల్లి ఉంటుందని అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. టెక్నాలజీకి సంబంధించిన ఎక్విప్ మెంట్స్ కూడా ఈ అగ్ని ప్రమాదంలో దగ్దం కావడంతో సమాచార వ్యవస్థ అంతా కూడా ఎక్కడిక్కడ నిలిచిపోయింది. వివిధ ప్రభుత్వ శాఖలకు చెందిన సీయూజీ ఫోన్లతో పాటు సామాన్యులకు సంబంధించిన 3 లక్షల మోబైల్ ఫోన్లలో బుధవారం రాత్రి నుండి నెట్ వర్క్ సిగ్నల్ లేకుండా పోయింది. దీనివల్ల ఉమ్మడి కరీంనగర్ జిల్లాతో పాటు సరిహద్దుల్లోని ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, వరంగల్ జిల్లాలకు సంబందించిన మోబైల్ ఫోన్స్ మూగబోయాయి. మరో వైపున 3 వేల ల్యాండ్ ఫోన్లు కూడా కమ్యూనికేషన్ లేకుండా పోగా, బ్రాడ్ బ్యాండ్ సేవలు కూడా నిలిచిపోయాయి.
బ్యాంకుల్లోనూ…
ప్రధానంగా ఆర్థిక సంవత్సరం ముగుస్తున్న నేపథ్యంలో బ్యాంకింగ్ వ్యవస్థలో కూడా నెట్ వర్క్ సిస్టం ఎక్కడికక్కడ నిలిచిపోయింది. దీంతో బీఎస్ఎన్ఎల్ తో అనుసంధానం అయిన పలు వాణిజ్య బ్యాంకుల్లో సేవలు నిలిచిపోయాయి. దీనివల్ల అటు వినియోగదారులకు సకాలంలో సర్వీస్ అందించే అవకాశం లేకపోగా మరో వైపున ఆన్ లైన్ సిస్టంతో అప్ డేట్ చేసే విధానం కూడా నిలిచిపోయిందని తెలుస్తోంది. ఈ నెల 31న ఆర్థిక సంవత్సరం ముగస్తున్న నేపథ్యంలో వాణిజ్య బ్యాంకుల యంత్రాంగం ఇందుకు సంబందించిన పనులు చేసుకోవడంలో ఆలస్యం కానుంది.
రంగంలోకి దిగిన స్పెషల్ టీమ్స్…
బుధవారం రాత్రి జరిగిన అగ్ని ప్రమాదాన్ని పరిశీలించేందుకు బీఎస్ఎన్ఎల్ ఉన్నతాధికారులతో పాటు టెక్నికల్ టీమ్స్ రంగంలోకి దిగాయి. గురువారం ఉదయం నుండి సాంకేతిక సమస్యలను అధిగమించే ప్రయత్నాలు చేయడంలో మునిగిపోయారు. ఈ రోజు సాయంత్రానికల్లా కమ్యూనికేషన్ సిస్టం యథావిధిగా కొనసాగించేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడంలో బీఎస్ఎన్ఎల్ ఉన్నతాధికారులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఈ కార్యాలయంలో నెలకొన్న సాంకేతిక సమస్యను సమూలంగా పరిష్కరించాలంటే మరో నాల్గైదు రోజులు పట్టే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. యుద్ద ప్రాతిపదికన ఈ సమస్యను అధిగమించే పనిలో బీఎస్ఎన్ఎల్ ఉన్నతాధికారులు నిమగ్నం అయ్యారు.