తల్లిదండ్రులు పిల్లలపై ఒత్తిడి చేయొద్దు: ప్రధాని మోదీ

చదువు విషయంలో పిల్లలపై ఒత్తిడి తీసుకురావద్దని తల్లిడండ్రులు, ఉపాధ్యాయులకు ప్రధాని నరేంద్ర మోదీ సూచించారు. ఇవాళ ఢిల్లీలో జరిగిన పరీక్ష పే చర్చ-2023 కార్యక్రమంలో ప్రధాని మోదీ పాల్గొని విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. ‘పరీక్షా పే చర్చ’ తనకు కూడా పరీక్షేనని.. కోట్లాది మంది విద్యార్థులు తన పరీక్షకు హాజరవుతున్నారని వ్యాఖ్యానించారు. తమ పిల్లల నుంచి తల్లిదండ్రులు ఆశించడం సహజమే.. కానీ, స్టేటస్ కోసం వారిని ఒత్తిడి చేయొద్దని తెలిపారు.

పిల్లలను వారికి నచ్చిన రంగంలో ప్రోత్సహించాలని మోదీ మాట్లాడారు. మానసిక ఉల్లాసం ఉంటేనే పిల్లలు బాగా చదువుతారు. ప్రశాంతమైన మనసుతో పరీక్షలు రాస్తేనే సత్ఫలితాలు వస్తాయి.రోజూ ఇంట్లో అమ్మను చూస్తే.. సమయపాలన ఎలా నిర్వహించుకోవాలో తెలుస్తుందని విద్యార్థులకు సూచించారు. ఒత్తిడిలో ఉండకండి.. ఒత్తిడిలో ఆలోచించకండి.. ముందు విశ్లేషించండి, పని చేయండి.. మీరు ఆశించిన దాన్ని సాధించేవరకు మీ వంతు కృషి చేయాలని పేర్కొన్నారు.

కాగా, ఎగ్జామ్స్‌ల్లో విద్యార్థులు కాపీ కొట్టడంపైనా మోదీ మాట్లాడారు. కాపీ చేస్తే ఒక్కసారి లేదా రెండు సార్లు పరీక్షలో నెగ్గొచ్చు, కానీ, జీవితాన్ని నెగ్గలేరని వ్యాఖ్యానించారు. షార్ట్‌కట్‌ను ఎప్పుడూ తీసుకోవద్దని.. కష్టబడి జీవితంలో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. విద్యార్థుల ఒత్తిడిని మోదీ క్రికెట్‌తో పోల్చారు. క్రికెట్ గ్రౌండ్‌లో ఉన్న బ్యాటర్.. ఆడియెన్స్ అరుపులను పట్టించుకోకుండా అతనికి ఎదురుగా వస్తున్న బంతిపైన్ ఫోకస్ చేస్తాడని చెప్పారు. అలాగే విద్యార్థులు కూడా ఒత్తిడిని పక్కనబెట్టి, చదువుపై దృష్టి సారించాలని తెలిపారు.

విద్యార్థులు గెలుపు, ఓటమిని సమానంగా తీసుకోవాలని ప్రధాని మోదీ తెలిపారు. ఎవరైతే పరీక్షల పట్ల శ్రద్ధ పెడతారో వారి శ్రమ వృథా కాదన్నారు. కొంత మంది విద్యార్థులు వారి క్రియేటివిటీని పరీక్షల్లో చీటింగ్​ చేసేందుకు ఉపయోగిస్తున్నారని చెప్పారు. ఆ క్రియేటివిటీ మంచి మార్గానికి వాడుకుంటే విజయాన్ని అందుకుంటారని మోదీ సూచించారు.

You cannot copy content of this page