దిశ దశ, దండకారణ్యం:
అంతరాష్ట్ర సమస్యగా మారిన నక్సల్స్ కార్యకలాపాలను నిరోధించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పెషల్ ఆపరేషన్లకు శ్రీకారం చుడుతున్న సంగతి తెలిసిందే. కేంద్ర పారా మిలటరీ బలగాలను నక్సల్స్ ఏరివేతలో భాగస్వాములను చేస్తున్నాయి. అయితే ఉత్తర తెలంగాణాలో నక్సల్స్ ఉనికి పూర్తి స్థాయిలో తుడిచిపెట్టుకపోయినప్పటికీ పొరుగునే ఉన్న మహారాష్ట్ర, చత్తీస్ గడ్ లలో మావోయిస్టులు సమాంతర ప్రభుత్వాన్ని నిర్వహిస్తున్నారు. చత్తీస్ గడ్ లోని పూర్వ బస్తర్ జిల్లాలోని కీకారణ్యాలు, మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలోని కొంత ప్రాంతాన్ని దండకారణ్య అటవీ ప్రాటవీ ప్రాంతంగా పిలుచుకుంటూ అక్కడ క్రాంతికారీ జనతన్ సర్కార్ నిర్వహిస్తున్నారు మావోయిస్టులు. ఈ నేపథ్యంలో ఉత్తర తెలంగాణాలో గత వైభవం కోసం మావోయిస్టులు తహతహలాడుతున్నారు. ఉత్తర తెలంగాణాలోని సరిహద్దు అటవీ ప్రాంతంలో పార్టీ కార్యకలాపాలను పునరుద్దరించాలన్న లక్ష్యంతో మావోయిస్టులు వ్యూహాలు రచిస్తున్నారు. దీంతో నక్సల్స్ తెలంగాణాలోకి చొరబడకుండా ఉండేందుకు సరిహద్దు పోలీసులు నిరంతరం అప్రమత్తంగా వ్యవహరించాల్సి వస్తోంది. కొమ్రం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల మీదుగా ప్రవహిస్తున్న ప్రాణహిత, గోదావరి పరివాహక ప్రాంతాల్లో పోలీసు బలగాలు హై అలెర్ట్ గా ఉండక తప్పని పరిస్థితి నెలకొంది. అయితే నక్సల్స్ ఎంట్రీని కట్టడి చేసే విషయంలో గత కొంతకాలం గా సరికొత్త విధానానికి శ్రీకారం చుట్టారు తెలంగాణ పోలీసు ఉన్నతాధికారులు.
ఎస్ఐబీ రికమండేషన్…
గత ప్రభుత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా పోస్టింగుల విషయంలో పొలిటికల్ జోక్యం కంపల్సరి అన్న పద్దతి అవలంభించిన సంగతి తెలిసిందే. సంబంధిత ఎమ్మెల్యేలు లేఖలు ఇచ్చిన అధికారులకే ఆయా ప్రాంతాలకు బదిలీ చేసే విధానాన్ని కొనసాగించారు. అయితే ప్రాణహిత, ఇంద్రావతి పరివాహక ప్రాంతాల్లో పోస్టింగులకు మాత్రం ఎస్ఐబీ ప్రపోజల్ కంపల్సరీ అన్న విధానానికి శ్రీకారం చుట్టారు. దీంతో ఈ ప్రాంతంలో పనిచేయాలన్న ఆసక్తి ఉన్న పోలీసు అధికారులు అటు పొలిటికల్ లీడర్ల వద్దకు, ఇటు ఎస్ఐబీ అధికారుల వద్దకు ప్రదక్షిణలు చేసిన సందర్బాలు కూడా ఉన్నాయి. చివరకు ఎస్ఐబీ ఎవరికి ఓకే చెప్తే వారికే పోస్టింగులు ఇచ్చే ఆనవాయితీని మొదలు పెట్టారు పోలీసు ఉన్నతాధికారులు. అయితే ఈ ప్రాంతంలో పనిచేసే క్షేత్ర స్థాయి పోలీసు అధికారులు దూకుడు ప్రదర్శించాలని, యంగ్ అండ్ డైనమిక్ గా వ్యవహరించాల్సిన అవసరం ఉందంటూ ఎస్ఐబీ అధికారులు చెప్పుకొచ్చారు. దీంతో వారు ఎవరికి చెప్తే వారికే పోస్టింగ్ ఇవ్వడం మొదలు పెట్టడంతో సరికొత్త విధానం మాత్రం ఈ ఐదు జిల్లాల్లో కొనసాగింది.
అవగాహన ఉందా..?
అయితే ఎస్ఐబీ తీసుకున్న నిర్ణయం కూడా పోలీసు వర్గాల్లో చర్చనీయాంశంగా మారిందని చెప్పకతప్పదు. గతంలో అటవీ ప్రాంతాల్లో పనిచేసిన పోలీసు అధికారులకు నక్సల్స్ మూవ్ మెంట్ పై సంపూర్ణ అవగాహన ఉంటుంది… అంబూష్ ఎలా చేస్తారు..? కవ్వింపు చర్యలకు పాల్పడినప్పుడు ఏలా వ్యవహరించాలి, అడవుల్లో కూంబింగ్ ఆపరేషన్లు నిర్వహించేప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, బలగాలపై దాడులు చేసేందుకు నక్సల్స్ ఎలాంటి ప్రాంతాలను ఎంచుకునే అవకాశం ఉంది..? ఆ ప్రాంతాలకు వెల్లినప్పుడు ప్రికాషన్స్ ఏం తీసుకోవాలి, మందుపాతరలు, క్లైమోర్ మైన్స్ బారిన పడకుండా ఉండాలంటే ఏం చేయాలి ఇలా ఎన్నో అంశాలపై ప్రాక్టికల్ గా అవగాహన చేసుకున్న పోలీసు అధికారులు దూకుడుగా వ్యవహరించే అవకాశం లేదన్న వాదనలు కూడా తీసుకొచ్చారు. నక్సల్స్ మూవ్ మెంట్ గురించి సమాచారం రాగానే వెంటనే రంగంలోకి దిగి ఆపరేఫన్లలో పాల్గొనే అవకాశం ఉంటుందన్న కారణాన్ని చూపించిన అప్పటి అధికారులు నవతరానికి అవకాశం ఇవ్వాలన్న ప్రతిపాదనలు చేశారు. అయితే అసలు పీపుల్స్ వార్ కు, మావోయిస్టు పార్టీకి తేడా ఏంటీ..? నక్సల్స్ గ్రూపులు ఎన్ని ఉండేవి..? వాటిలో ఏఏ విప్లవ సంస్థలు పోలీసులను మట్టుబెట్టేందుకు వ్యవహరించే విధానం ఏంటీ..? టార్గెట్లను హతమార్చేందుకు ఎలాంటి స్కెచ్ వేసుకునేవి అన్న వివరాలపై సమగ్రమైన అవగాహన లేకపోయినప్పటికీ ఆ ప్రాంతంలో పనిచేయాల్సిన అధికారులు యంగ్ అండ్ డైనమిక్ అయి ఉండాలని భావించారు. అయితే గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని నేటి తరానికి అవగాహన కల్పించడం అత్యంత ముఖ్యమన్న విషయాన్ని కూడా విస్మరించారన్న ఆరోపణలు ఉన్నాయి. నక్సల్స్ షెల్టర్ జోన్ గురించి సమాచారం రాగానే ఆపరేషన్లకు దిగే పో్లీసు బలగాలు డెన్ లో నక్సల్స్ తీసుకునే సెక్యూరిటీ ప్రికాషన్స్ పై కూడా ఖచ్చితంగా అవగాహన ఉండాలి. లేనట్టయితే బలగాల ఉనికిని నక్సల్స్ గుర్తించినట్టయితే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు. ఇలాంటి అంశాలపై సుశిక్షుతులుగా తయారైన పోలీసు అధికారులకు మాత్రం పరివాహక ప్రాంతంలో పోస్టింగులు ఇచ్చేందుకు ఎస్ఐబీ అధికారులు విముఖత చూపారని పోలీసు వర్గాల్లో బాహాటంగానే చర్చ జరిగింది. అసలు బేసిక్ నాలెడ్జి కూడా లేని పోలీసు అధికారులను రంగంలోకి దింపడం వల్ల ఎదురయ్యే కష్టనష్టాలను అంచనా వేయకపోవడం, స్వీయ రక్షణ చర్యలు తీసుకునే విషయంలో అవగాహన లేకుండా పోయిన వారికి ప్రాధాన్యత ఇవ్వడం కూడా సరికాదన్న అభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి. అయితే ఈ ప్రాధాన్యత అంశాలను పరిగణనలోకి తీసుకోకుండానే ఎస్ఐబీ తెలంగాణ సరిహద్దులను తన చెప్పు చేతల్లోకి తెచ్చుకునే ప్రయత్నం చేసిందన్న అపవాదును మూటగట్టుకుంది.
ఉనికి లేదు కాబట్టి…
చాలా వరకు జరిగిన ఆపరేషన్లు అవగాహన లేని పోలీసు అధికారులతోనే జరిపించారు. అయితే సరిహద్దుల్లో నక్సల్స్ కార్యకలాపాలు ఏ మాత్రం కూడా లేకపోవడమే వారికి లాభించిందని చెప్పవచ్చు. సరిహధ్దు ప్రాంతాలపై సంపూర్ణ అవగాహన ఉన్న మావోయిస్టులు అదును చూసి అటాక్ చేస్తే మాత్రం భారీ నష్టాన్ని చవిచూడాల్సి వచ్చేదన్న ఆందోళన వ్యక్తం చేసిన పోలీసు అధికారులు చాలామంది ఉన్నారు. కూంబింగ్ ఆపరేషన్లను మానిటరింగ్ చేసేందుకు నియమించిన స్పెషల్ బ్రాంచ్ వింగ్ అధికారులు కూడా అటవీ ప్రాంతాలకు సంబంధించిన మ్యాపులను పరిశిలిస్తూ సలహాలు సూచనలు ఇచ్చిన ఘటనలు ఉన్నాయి. కానీ మావోయిస్టులు ఎలాంటి షెల్టర్ ఎలాంటి ప్రాంతాల్లో ఏర్పాటు చేసుకుంటారు, అంబూష్ నిర్వహించి దాడులు ఎలా చేస్తారు అన్న విషయాలపై మాత్రం అవగాహన లేని వారికే ఈ బాధ్యతలకు పురమాయించారని పోలీసు వర్గాలు అంటున్నాయి. మందుపాతరలు పేల్చడం, స్టేషన్లపై దాడులు చేయడం, బస్సులను బాంబులుగా మార్చడం, కూంబింగ్ బలగాలపై క్లైమోర్ మైన్స్ తో దాడి చేయడం వంటి తొలి ప్రయోగాలన్ని కూడా ఇక్కడి అటవీ ప్రాంతంలోనే చోటు చేసుకున్నాయి. ఇలాంటి ప్రాక్టికల్ దాడులను ఎదుర్కొన్న అనుభవాలను పాఠాలుగా మల్చుకున్న పోలీసు అధికారులు ఏజ్ బార్ అన్న కారణంతో ఆ ఇలాకాలో పోస్టింగులు ఇచ్చేందుకే ప్రయారీటీ ఇవ్వలేదన్న వాదనలు ఉన్నాయి. ఒకరో ఇద్దరో పోలీసు అధికారులకు సరిహధ్దు జిల్లాల్లో పోస్టింగ్ ఇచ్చారు కానీ మిగతా విషయంలో ఎస్ఐబీ రికమండేషన్ ఫైనల్ అన్నట్టుగా సాగిందన్న ప్రచారం ఉంది. నిఘా వర్గంలో భాగంగా ఉన్న ఎస్ఐబీ వింగ్ అంతా కూడా హైదరాబాద్ కేంద్రీకృతంగానే తన కార్యకలాపాలను కొనసాగిస్తుంటుంది. టెక్నాలజీ ఆధారంగా మాత్రమే ఆపరేఫన్లను నిర్వహిస్తుంటుంది. కానీ నక్సల్స్ కు పట్టున్న ప్రాంతాల్లో ప్రాక్టికల్ ఆపరేషన్లలో పాల్గొన్న వారికున్నంత అవగాహన మాత్రం అందులో పనిచేస్తున్న చాలామందికి ఉండదన్నది వాస్తవం. కొత్తగా ఈ ప్రాంతంలో పోస్టింగ్ అయిన యువ అధికారులకు, కూంబింగ్ బలగాలకు సంపూర్ణ అవగాహన కల్పించేందుకు అయినా ప్రాక్టికల్ అనుభవాలను పాఠాలుగా మల్చి చెప్పించే ప్రయత్నం చేయకపోవడం విస్మయం కల్గిస్తోందని పోలీసు వర్గాలే అంటున్నాయి.