కలం వీరుల నిరసన బాట…

దిశ దశ, హుజురాబాద్:

జర్నలిస్టులు మరో ఉద్యమానికి శ్రీకారం చుట్టబోతున్నారు. స్వరాష్ట్ర సాధన కోసం ఓ వైపున కలంతో మరో వైపున గళంతో తమ వాణిని వినిపించిన కలం వీరులు ప్రత్యక్ష్య పోరాటానికి నడుం బిగిస్తున్నారు. నేడు రేపు అనుకుంటూ ఏకంగా 9 ఏళ్లు గడిచినా ఆచరణలో పెట్టని హామీ ఎందుకంటూ, ఉప ఎన్నికల్లో ఇచ్చినట్టే ఇచ్చి ఊరించిన తీరేంటంటూ మనసుల్లోనే రగిలిపోతున్న జర్నలిస్టులు తమ డిమాండ్ సాధించుకునేందుకు కదనరంగంలోకి దూకబోతున్నారు. ఇప్పటి వరకు వినతి పత్రాలతోనే సరిపెట్టిన జర్నలిస్టులు తమలోని సహనాన్ని పక్కనపెట్టి పోరుబాట చేయాలని నిర్ణయించుకున్నారు. శుక్రవారం నుండి నిరవధిక నిరహార దీక్షలకు చుట్టబోతున్నామని కరీంనగర్ జిల్లా హుజురాబాద్ ప్రెస్ క్లబ్ జర్నలిస్టులు ప్రకటించారు. ఈ మేరకు స్థానిక ఏసీపీ వెంకటరెడ్డిని కలిసి తాము శాంతియుతంగా నిరవధిక రిలే నిరహారా దీక్షలు కొనసాగించబోతున్నామని వినతి పత్రం సమర్పించారు. ప్రశాంతంగా తమ డిమాండ్ల సాధన కోసం చేపడుతున్న ఈ రిలే దీక్షలకు అనుమతించాలని హుజురాబాద్ జర్నలిస్టులు అభ్యర్థించారు.

ఊరించిన ఉప ఎన్నికలు…

హుజురాబాద్ ఉప ఎన్నికల్లో తమ దశ తిరిగిపోయిందని కలలు కన్న జర్నలిస్టులకు చివరకు నిరాశే మిగిలింది. పట్టణ శివార్లలో నివేశన స్థలాలు కాకుండా డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణం చేపట్టి ఇస్తామని రాష్ట్ర మంత్రులు ప్రకటించారు. అన్ని కుల సంఘాలకు, వివిధ సొసైటీలకు స్థలాలు కెటాయిస్తూ శిలాఫలకాలు కూడా వేశారు. ఇందులో భాగంగా హుజురాబాద్ కు చెందిన 71 మంది జర్నలిస్టులకు రూ.3కోట్ల 76 లక్షలతో డబుల్ ఇళ్ల నిర్మాణం చేసేందుకు శంకుస్తాపన కూడా చేశారు. అయితే జర్నలిస్టులకు కెటాయించిన భూమి గురించి కోర్టులో వివాదం నెలకొని ఉండగా ఇప్పటి వరకు ఈ సమస్య పరిష్కారం కాకపోగా ప్రత్యామ్నాయ స్థలం అలాట్ చేసేందుకు చొరవ తీసుకోకపోవడం జర్నలిస్టులను నిరాశకు గురి చేసింది. తమకు నిర్మించి ఇస్తామని చెప్పిన డబుల్ ఇళ్ల విషయం అటుంచి కనీసం నివేశనా స్థలాలు అయినా కెటాయించాలని హుజురాబాద్ జర్నలిస్టులు పలుమార్లు అధికార పార్టీ నాయకులను అభ్యర్థించారు. ఇందుకు సుముఖత వ్యక్తం చేస్తున్న నేతలు ఆచరణలో మాత్రం పెట్టకపోవడం జర్నలిస్టులను విస్మయపరిచింది. తమకు ఇచ్చిన హామీని చేతల్లో చూపించే పరిస్థితి కానరాకపోవడంతో హుజురాబాద్ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో నిరవధిక రిలే దీక్షలు చేపట్టాలని నిర్ణయించారు. శుక్రవారం నుండి ప్రారంభం కానున్న ఈ రిలే నిరాహారా దీక్షలు తమ చేతిలో నివేశన స్థలాలు కెటాయిస్తూ పట్టా కాగితాలతో పాటు మోఖా అప్పగించే వరకు శాంతియుతంగా చేపట్టాలని భావిస్తున్నారు.

You cannot copy content of this page