దిశ దశ, హుజురాబాద్:
అక్రమాలకు పాల్పడేందుకు ఏ స్థాయికయినా దిగ జారిపోతారంటే ఇదేనేమో. కోట్లు విలువ చేసే భూమి కావడంతో అక్రమార్కుల కన్ను ఆ భూమిపై పడింది. పట్టాదారు అమెరికాలో ఉంటే ఏంటీ..? ఆన్ లైన్ రిజిస్ట్రేషన్ విధానం అయితే ఏంటీ అన్నింటిని చక్కదిద్దేందుకు పావులు కదిపితే చాలనుకున్నారు ప్రబుద్దులు కొందరు. అనుకున్నదే తడవుగా రెవెన్యూ యంత్రాంగాన్ని గుప్పిట పెట్టుకుని భూమి రిజిస్ట్రేషన్ చేసేశారు. పట్టాదారు అమెరికాలో ఉన్నా ధరణీలో రిజిస్ట్రేషన్ చేయించేందుకు తొక్కిన అడ్డదారులే అత్యంత విచిత్రంగా ఉన్నాయి.
అతన్ని దొరకబట్టి…
ప్రస్తుతం అమెరికాలో నివాసం ఉంటున్న శివప్రియకు సంబంధించిన భూమిని వేరే వారి పేరిట రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు కొంతమంది ప్రయత్నించారు. అయితే ఆమె అందుబాటులో లేనందున ధరణీ ద్వారా అక్రమంగా సేల్ డీడ్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు కుట్రకు తెరలేపారు. ఇందుకోసం శివప్రియ ఇండియాలో ఉన్నప్పుడు వినియోగించిన మొబైల్ నంబర్ కు వన్ టైం పాస్ వర్డ్ (ఓటీపీ) వస్తుందని గమనించి ఆ నెంబర్ కోసం ఆరా తీశారు. ప్రస్తుతం ఆ నెంబర్ ను ఏపీలోని గుంటూరు జిల్లాకు చెందిన వ్యక్తి వినియోగిస్తున్న విషయం తెలుసుకుని ధరణీ పోర్టల్ ద్వారా రిజిస్ట్రేషన్ ప్రక్రియకు శ్రీకారం చుట్టినట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఆ మొబైల్ నంబర్ వినియోగిస్తున్న వ్యక్తి ఆచూకి దొరకబట్టి మరీ అతని వద్దకు కొంతమంది వెళ్లగా, ధరణీ ద్వారా రిజిస్ట్రేషన్ ప్రాసెస్ చేసేందుకు వీణవకంలో మరికొంతమంది ఉన్నారు. ధరణీలో డాక్యూమెంట్లు అప్ లోడ్ చేయగానే శివప్రియ గతంలో వాడిన మొబైల్ నంబర్ వినియోగిస్తున్న అతనికి ఓటీపీ రాగానే ఆ నెంబర్ ను వీణవంకకు షేర్ చేశారు. దీంతో ఆన్ లైన్ ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసినట్టుగా తెలుస్తోంది. బహిరంగ మార్కెట్ లో కోట్లలో ధర పలుకుతుండడంతో అమెరికాలో ఉన్న శివప్రియకు సంబంధం లేకుండానే ఈ తంతు పూర్తి చేసినట్టుగా స్ఫస్టం అవుతోంది.
ఆపరేటర్ పై నమ్మకంతోనే: తహసీల్దార్ వింత ఫిర్యాదు…
ధరణీ ఆపరేటర్ పై నమ్మకం ఉంచి తాను రిజిస్ట్రేషన్ అప్రూవల్ ఇచ్చానని తహసీల్దార్ తిరుమల్ రావు అంటున్నారు. ఈ మేరకు మార్చి 6న వీణవంక పోలీసులకు ఫిర్యాదు చేశారు. తాను 2023 అసెంబ్లీ ఎన్నికల డ్యూటీలో ఉన్నానని ఆర్డోఓ కార్యాలయంలో ఉన్న తనకు ఆపరేటర్ అరుణ్ చౌదరి ఫోన్ చేయడంతో అప్రవూల్ ఇచ్చానంటున్నారు. ప్రత్యక్ష్యంగా తహసీల్దార్ కార్యాలయంలో లేనప్పుడు ఈ వ్యవసాయ భూమి రిజిస్ట్రేషన్ ప్రక్రియకు అప్రూవల్ చేసేంత అవసరం ఏంటీ..? ఎలక్షన్ కమిషన్ వేసిన విధుల్లో నిమగ్నం ఉన్నప్పుడు తిరుమత్ రావు కు ఔట్ సోర్సింగ్ ఉద్యోగి అయిన ధరణీ ఆపరేటర్ ఫోన్ చేయగానే ఎలా అప్రూవల్ ఇస్తారన్నదే పజిల్ గా మారింది. పట్టదారు, కొనుగోలు దారుతో పాటు సాక్షులను ప్రత్యక్ష్యంగా చూడకుండా, రెవెన్యూ రికార్డులను కూడా పరిశీలించకుండా అసలు తన కార్యాలయంలో లేకుండానే రిజిస్ట్రేషన్ ప్రక్రియను ఎలా పూర్తి చేస్తారన్న ప్రశ్న తలెత్తుతోంది. రెవెన్యూ ఉద్యోగి కూడా కానీ ఔట్ సోర్సింగ్ ఎంప్లాయ్ మాటలను విశ్వసించానని తహసీల్దార్ చెప్తున్న తీరు కూడా విస్మయానికి గురి చేస్తోంది. వీణవంక పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో తహసీల్దార్ ఈ వివరాలను పేర్కొన్న తహసీల్దార్ బాధ్యతరాహిత్యంగా వ్యవహరించారన్న విషయం స్ఫస్టంగా అర్థమవుతోందని అధికారులు గుర్తించినట్టుగా సమాచారం. అలాగే గత ఏడాది నవంబర్ లో అప్రూవల్ చేస్తే ఇప్పుడు ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేయడం గమనార్హం. ప్రధానంగా రిజిస్ట్రేషన్ ప్రక్రియకు సంబంధించిన స్లాట్ బుక్ చేసినప్పుడే రిజిస్ట్రేషన్ అప్రూవల్ ఇవ్వాల్సిన నిబందన కూడా లేదని తెలుస్తోంది. తహసీల్దార్లు ఇతర పనుల్లో బిజీగా ఉన్నట్టయితే రిజిస్ట్రేషన్ ప్రక్రియను వాయిదా వేసే అధికారం కూడా ఉన్నట్టుగా తెలుస్తోంది. అలాంటప్పుడు ఈ రిజిస్ట్రేషన్ విషయంలో ఎందుకు ఉదారంగా వ్యవహరించారన్నదే అంతుచిక్కకుండా పోతోంది.
సస్పెన్షన్…
ఈ భూమి విషయంలో వెలుగులోకి వచ్చిన పలు అంశాలను పరిశీలించిన జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి తహసీల్దార్ తిరుమల్ రావుకు సస్పెన్షన్ విధిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అతనిపై క్రమశిక్షణా చర్యల్లో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది.
ప్రముఖుల హస్తం…
వీణవంకకు చెందిన శివప్రియకు సంబంధించిన భూమి రిజిస్ట్రేషన్ విషయంలో ఓ టీమ్ భారీ నెట్ వర్క్ తయారు చేసుకున్నట్టుగా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ వ్యవహారం వెనక మండలానికి చెందిన పలువురు కొంతమంది ములాఖత్ అయి డాక్యూమెంట్లను క్రియేట్ చేసి రిజిస్ట్రేషన్ ప్రక్రియను కానిచ్చేసినట్టుగా తెలుస్తోంది. ధరణీలో ఈజీగా అప్రూవల్ చేయించుకోవచ్చన్న ధీమాతోనే సిండికేట్ గా మారిన కొంతమంది ఈ వ్యవహారాన్ని చాకచక్యంగా చక్కదిద్దినప్పటికీ డామిట్ కథ అడ్డం తిరిగింది అన్న రీతిలో బాగోతం బట్టబయలు అయింది.