జనసేన అధినేన పవన్ కల్యాణ్ ఓ వైపు రాజకీయాలు, మరోవైపు సినిమాలతో బిజీగా ఉంటున్నారు. షెడ్యూల్ ప్రకారం.. తన సినిమాలను పూర్తి చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. ఇక రాజకీయాల్లో బిజీగా ఉండటంతో పవన్ కల్యాణ్… ఇతర సినిమా ఫంక్షన్లకు హాజరు కావడం లేదు. ఈ నేపథ్యంలో కన్నడ స్టార్ హీరోలు ఉపేంద్ర, కిచ్చా సుదీప్‌లకు పవన్ కల్యాణ్ క్షమాపణలు చెప్పారు. వీరిద్దరూ కలిసి నటించిన ‘కబ్జా’ సినిమా ఈవెంట్‌కు హాజరు కాలేకపోతున్నందుకు క్షమాపణలు చెప్పారు.
కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర, కిచ్చ సుదీప్ కలిసి నటిస్తున్న సినిమా కబ్జా. శ్రియ హీరోయిన్‌గా నటిస్తుంది. ఈ సినిమాను కన్నడతో పాటు తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో మార్చి 17న రిలీజ్ చేయబోతున్నారు. ప్రస్తుతం చిత్ర యూనిట్ ప్రమోషన్స్‌తో బిజీగా ఉంది. అయితే ఇటీవల కబ్జా ఆడియో లాంచ్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి పవన్ కళ్యాణ్‌ను గెస్ట్‌గా ఆహ్వానించారు. కానీ, జనసేన పార్టీ కార్యక్రమాలు ఉండటం, పవన్ కళ్యాణ్ బిజీగా ఉండటంతో ఈ కార్యక్రమానికి వెళ్లలేకపోయారు. దీంతో తానూ రాలేకపోయినందుకు బాధపడుతున్నాను అంటూ పవన్ ఓ ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు.
తనను ‘కబ్జా’ ఆడియో ఫంక్షన్‌కు ఆహ్వానించినందుకు పవన్ కల్యాణ్ ధన్యవాదాలు తెలిపారు. అయితే, రాజకీయపరంగా ముందుగా నిర్ణయించుకున్న కార్యక్రమాల వల్ల ఈవెంట్‌కు హాజరు కాలేకపోతున్నానని చెప్పారు. ఉపేంద్ర, సుదీప్‌కు తన ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు. ఇద్దరూ వెరైటీ పాత్రలను పోషిస్తూ పలు భాషల్లో గుర్తింపును పొందారని కొనియాడారు. ఈ మూవీ సూపర్ హిట్ కావాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నానని పవన్ విష్ చేశారు.