Pawan Kalyan: Who will benefit from the Janasena contest in Telangana? Whose loss?

ప్రధానాంశాలు:

  • తెలంగాణ రాజకీయాల్లోకి పవన్ కల్యాణ్ ఎంట్రీ
  • బీజేపీ, టీడీపీతో కలిసి పోటీ చేస్తారా?
  • సీఎం కేసీఆర్‌కు ఇబ్బందులు వస్తాయా?

Pawan Kalyan: తెలంగాణలో రానున్న అసెంబ్లీ ఎన్నికలు ఇప్పటినుంచే రక్తికట్టిస్తున్నాయి. మరోసారి అధికారాన్ని దక్కించుకుని ముచ్చటగా మూడోసారి హ్యాట్రిక్ కొట్టాలనే లక్ష్యంగా టీఆర్ఎస్ పావులు కదుపుతోంది. టీఆర్ఎస్‌కు మద్దతుగా వామపక్ష పార్టీలు ఉండగా.. వ్యతిరేకంగా చాలా పార్టీలు పోటీలోకి దిగుతుండటంతో రాబోయే ఎన్నికలు ఇప్పటినుంచే రంజుగా మారాయి. ఇప్పటికే టీఆర్ఎస్‌కు వ్యతిరేకంగా కాంగ్రెస్,బీజేపీ, తెలంగాణ జనసమితి, బీఎస్సీ, వైఎస్సార్‌టీపీ బరిలోకి దిగబోతున్నాయి. ఇప్పుడే లేటెస్ట్‌గా జనసేన కూడా పోటీలోకి రావడం తెలంగాణ పొలిటికల్ సర్కిల్స్‌లో హాట్‌టాపిక్‌గా మారింది.

మంగళవారం మంగళగిరిలోని జనసేన కార్యాలయంలో కార్యకర్తలతో నిర్వహించిన సమావేశంలో తెలంగాణ జనసేన నేతలు కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణ రాజకీయాలపై పవన్ కల్యాణ్ స్పందించిన విషయం తెలిసిందే. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలోనూ పోటీ చేస్తామని క్లారిటీ ఇచ్చారు. 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోటీ చేయాలా? లేదా 14 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోటీ చేయాలా? అనేది త్వరలో నిర్ణయించుకుంటామని చెప్పారు. రెండు లేదా మూడు లోక్ సభ స్థానాల్లో పోటీ చేయనున్నట్లు పవన్ వెల్లడించారు. తెలంగాణ నుంచే తాను పోరాట పటిమ నేర్చుకున్నానంటూ తెలంగాణ ఉద్యమంలో అమరుడైన శ్రీకాంతాచారిని గుర్తు చేశారు. కొండగట్టు నుంచి తెలంగాణ రాజకీయాలను ప్రారంభిస్తానన్నారు.

కొండగట్టు ఆంజనేయస్వామి దేవాలయం ఎప్పటినుంచో పవన్‌కు సెంటిమెంట్‌గా మారింది. తెలంగాణలో ఏ రాజకీయ కార్యక్రమం ప్రారంభించాలన్నా.. అక్కడ నుంచే పవన్ ప్రారంభించేవారు. కొండగట్టు దేవాలయం అభివృద్ధి కోసం గతంలో పవన్ రూ.11 లక్షల విరాళం ఇచ్చారంటే.. పవన్ కు ఆ ఆలయం ఎంత సెంటిమెంట్ అనేది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పుడు కూడా అదే సెంటిమెంట్‌ను కొనసాగిస్తూ తెలంగాణ రాజకీయాల్లోకి పవన్ మళ్లీ అడుగుపెట్టనున్నారు. దీంతో టీ పాలిటిక్స్‌లో పవన్ ఎంట్రీ ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

ఏపీలో టీడీపీ, జనసేన పొత్తు దాదాపు ఖాయమైందనే ప్రచారం క్రమంలో తెలంగాణలోనూ టీడీపీ, బీజేపీతో కలిసి పవన్ పనిచేస్తారా? అనే చర్చ తెరపైకి వచ్చింది. వచ్చే తెలంగాణ ఎన్నికలను చావో.. రేవో అన్నట్లుగా భావిస్తున్న బీజేపీ.. ఇక్కడ గెలుపే టార్గెట్‌గా వ్యూహలు రచిస్తోంది. తెలంగాణలో కాషాయ జెండా ఎగురవేసేందుకు మోదీ, అమిత్ షా పక్కా స్కెచ్‌లు రూపొందిస్తున్నారు. ఇలాంటి తరుణంలో పవన్ మద్దతు బీజేపీకి కీలకంగా మారింది. పవన్ సపోర్టును బీజేపీ తీసుకోనుందనే టాక్ రాజకీయ వర్గాల్లో ఎప్పటినుంచో వినిపిస్తోంది. చంద్రబాబు కూడా బీజేపీతో కలిసేందుకు ఆసక్తి చూపుతుండటంతో… కేసీఆర్‌ను ఓడించేందుకు బీజేపీతో టీడీపీ, జనసేన కలిసి పోటీ చేసే అవకాశముందనే ప్రచారం సాగుతోంది.

ఒకవేళ ఆ మూడు పార్టీలు కలిసి పోటీ చేస్తే.. అధికార టీఆర్ఎస్‌కు చిక్కులు తప్పవని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. తెలంగాణలో టీడీపీ బలహీనపడిపోయినా.. క్యాడర్ బలంగానే ఉందనే ప్రచారం ఉంది. ఇక పవన్‌కు ఏపీలో కంటే తెలంగాణలోనే ఎక్కువమంది అభిమానులు ఉన్నట్లు చెబుతారు. వచ్చే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, టీడీపీ, జనసేన కలిస్తే మాత్రం టీఆర్ఎస్‌కు ట్రబుల్స్ వచ్చే అకకాశముందనే విశ్లేషణలు రాజకీయ వర్గాల నుంచి వినిపిస్తున్నాయి. టీడీపీ, జనసేన మద్దతు దొరికితే మాత్రం తెలంగాణలో అధికారంలోకి రావాలన్న బీజేపీకి కొంతవరకైనా లాభం జరుగుతుందని చెబుతున్నారు.

You cannot copy content of this page