ఫంక్షన్ హాళ్ల తీరుపై విమర్శలు…
దిశ దశ, కరీంనగర్:
వేడుకలు నిర్వహించేందుకు ఏర్పాటు చేస్తున్న చిన్నాచితకా ఫంక్షన్ హాళ్లు నిబంధనల మేరకే నిర్మిస్తున్నారా..? ఇందుకు సంబంధిత విభాగాల అధికారులు అనుమతులు ఎలా ఇస్తున్నారు..? జనజీవనానికి ఆటంకం కల్గించే విధంగా వ్యవహరిస్తున్నా పట్టించుకునే వారు లేరా..? సర్కారు విభాగాలు వీటిపై కఠినంగా వ్యవహరించకపోతే ఎలా అన్న ఆందోళన వ్యక్తం అవుతోంది.
వేడుకల వేదికలు…
పెరుగుతున్న జనాభా అవసరాలకు అనుగుణంగా ఫంక్షన్ హాళ్లు, బాంక్విట్ హాళ్లు, కన్వెన్షన్ హాళ్లు ఇలా వివిధ రకాల పేర్లతో ఏర్పాట అవుతున్నాయి. వీటిలో సౌకర్యాలు ఎంతమేర ఉన్నాయో దేవుడెరుగు కానీ బిల్లులు మాత్రం మోత మోగిస్తున్నాయని సామాన్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఓ హాల్… అనుబంధంగా కిచెన్, భోజనం చేసేందుకు అవసరమైన మరో హాల్ ఉంటే చాలు యజమానులు ఫంక్షన్ హాళ్లను ఏర్పాటు చేసుకుంటూ సొమ్ము చేసుకుంటున్నారు. కనీసం పార్కింగ్ ప్లేసులు కూడా లేకుండానే వివిధ పేర్లపై ఏర్పాటవుతున్న ఈ వేడుకల కేంద్రాలతో అందరికీ ఇబ్బందులు తప్పడం లేదు. ఇటీవల కాలంలో సెంట్రల్ ఏసీ హాళ్లు కూడా ప్రత్యక్ష్యం అవుతుండగా వాటిలో సెక్యూరిటీ ప్రికాషన్స్ ఎంతమేర ఉన్నాయన్నది నిర్వాహకులకే తెలియాలి. విద్యుత్ సరఫరాతోనే ముడిపడి ఉన్న ఈ ఫంక్షన్ హాళ్లలో అగ్ని ప్రమాదం సంభవిస్తే సత్వరమే స్పందించేందుకు అవసరమైన అగ్ని ప్రమాద నిరోద చర్యలు మాత్రం తీసుకోవడం లేదన్న విమర్శలు ఉన్నాయి. ఇకపోతే కనీసం పార్కింగ్ ప్లేస్ కూడా లేకపోవడంతో వేడుకలకు వచ్చే వాహనాలన్ని కూడా రోడ్లపై నిలుపుతున్నారు. దీంతో ఆయా రహదారుల మీదుగా రాకపోకలు సాగించే ఇతర వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వాటి సామర్థ్యానికి తగ్గట్టుగా ఏర్పాట్లు చేయాల్సిన విషయాన్ని పట్టించుకోకుండానే ప్రారంభిస్తున్న వీటిపై కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. ఇటీవల కాలంలో కరీంనగరంతో పాటు పరిసర ప్రాంతాల్లో ప్రారంభం అయిన పంక్షన్ హాళ్ల తీరుతో ఇక్కట్లు తప్పడం లేదు.
అన్నింటా లింక్…
ఇకపోతే ఆయా ఫంక్షన్ హాళ్లు బుక్ చేసుకునే వారు ఖచ్చితంగా ఆ యాజమాన్యంతో అనుబంధం ఉన్న వాటి వద్దే ఆర్డర్ చేయాలన్న కండిషన్స్ పెడుతున్నారు. డ్రింకింగ్ వాటర్, కుకింగ్ సర్విసెస్, డెకోరేషన్, బ్యూటిషియన్స్, బ్యాండ్ మేళం, ఐస్ క్రీమ్స్ ఇలా ఒక్కటేమిటి అన్ని విషయాల్లోనూ ఫంక్షన్ హాల్స్ యాజమానులు అగ్రిమెంట్ చేసుకున్న వారి వద్దే ఆర్డర్ చేయాలని స్పష్టం చేస్తున్నారు. ఒక రకంగా చెప్పాలంటే ఫంక్షన్ హాళ్లలో వేడుకలు నిర్వహించే కుటుంబ సభ్యులు, హజరయ్యే అతిథులు మాత్రమే బయటి నుండి రావాలి తప్ప మిగతా అన్ని కూడా తాము చెప్పిన చోటే ఆర్డర్ చేయాలని కుండబద్దలు కొడుతున్నారు. నిబంధనలకు అనుగుణంగా ఫంక్షన్ హాళ్లను సిద్దం చేయని నిర్వాహకులు అక్కడ వేడుకలు నిర్వహిస్తే మాత్రం వారు చెప్పినట్టే నడుచుకోవాలన్న కండిషన్స్ పెడుతుండడం విస్మయం కల్గిస్తోంది. అటు హాళ్లకు రెంట్, కరెంట్ బిల్లుతో పాటు డయాస్, హాల్ డెకోరేషన్, ఫుడ్, వాటర్, ఐస్ క్రీమ్స్ నిర్వాహాకులు ఒప్పందం కుదుర్చుకున్న వ్యాపారుల వద్దే ఆర్డర్ చేయాల్సి వస్తుండడంతో అదనపు ఆర్థిక భారం పడుతోందన్న ఆందోళన వ్యక్తం అవుతోంది. ఫంక్షన్ హాళ్ల నిర్వాహకులు చెప్పిన చోట ఆర్డర్ ఇవ్వనట్టయితే తాము అనుమతి ఇవ్వమని కూడా కుండబద్దలు కొట్టేస్తున్నారు. ఫంక్షన్ హాళ్ల నిర్వాహకులు ఆయా రంగాల వారితో ఒప్పందాలు చేసుకుని సపరేట్ కమిషన్ మాట్లాడుకుంటున్నారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. దీంతో వారికి అద్దె చెల్లించి మరీ అదనపు భారాన్ని మోయాల్సి వస్తోందని వేడుకలు నిర్వహించుకుంటున్న వారు చెప్తున్నారు.
హోటల్స్ తీరిలా…
ఇకపోతే కొన్ని హోటళ్లలో కూడా బాంక్విట్ హాల్స్ అందుబాటులో ఉన్నాయి. ఇక్కడ ఫంక్షన్ చేసే వారు ఇచ్చే ఫుడ్ ఆర్డర్ ను బట్టి బాంక్విట్ హాల్ ఇస్తామన్న కండిషన్ విధిస్తున్నారు. ప్లేట్ కు ఇంత అని చెప్పి వేడకులు నిర్వహించే వారి ముక్కుపిండి మరీ వసూలు చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. వేడుకలు నిర్వహించుకునేవారు ఎక్కువ సమయం వినియోగించుకున్నట్టయితే ప్రతి గంటకు ఇంత అని వేలల్లో చార్జీలు వసూలు చేస్తున్నారు. అయితే ఆయా హోటల్స్ వద్ద నామ మాత్రంగా ఉండే పార్కింగ్ స్థలాల్లో బాంక్విట్ హాళ్లలో ఫంక్షన్ జరుపుకునే వారి వాహనాలు నిలుపుకునే పరిస్థితి కూడా ఉండడం లేదు. దీంతో అటు హోటళ్లకు వెల్లే సాధారణ కన్జ్యూమర్స్, ఫంక్షన్స్ కు వచ్చే గెస్టుల వాహనాలతో పరిసర ప్రాంతాలన్ని రద్దీగా మారిపోతున్నాయి. వేడుకలు నిర్వహించుకునే మంచి రోజుల్లో అయితే ఆయా బాంక్విట్ హాళ్లను నిర్వహిస్తున్న హోటళ్లున్న రహదారులన్ని కూడా కిక్కిరిసిపోతున్న పరిస్థితి ఏర్పడింది.
బల్దియా జోక్యం..?
వాణిజ్య అవసరాల కోసం ఏర్పాటు చేస్తున్న ఫంక్షన్ హాళ్లు నిబంధనల మేరకు ఏర్పాటు చేస్తున్నారా లేదా అన్న విషయంపై బల్దియా దృష్టి సారించకపోవడం విస్మయానికి గురి చేస్తోంది. ఫైర్ సేఫ్టీ మేజర్స్ తీసుకున్నారా లేదా..? పంక్షన్ హాల్ నిర్మాణానికి అనుగుణంగా పార్కింగ్ స్థలం ఏర్పాటు చేశారా లేదా..? అన్న సాధారణ విషయాలపై కూడా దృష్టి సారించడం లేదు. దీంతో ఫంక్షన్ హాళ్ల వద్ద అనుకోని ప్రమాదం జరిగినట్టయితే ఎవరు బాధ్యత వహిస్తారో బల్దియా అధికారులకే తెలియాలి. బాంక్విట్, కన్వెన్షన్ హాళ్లు అడ్డగోలుగా రెంట్ వసూలు చేయడమే కాకుండా ఇతర వ్యాపారులతో టై అప్ అయి వేడుకలు నిర్వహించుకుంటున్న వారిని నిలువు దోపిడీ చేస్తున్నందున కార్పోరేషన్ యంత్రాంగం కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. అలాగే ఫైర్, ట్రాఫిక్ అధికారులు కూడా వీటిపై ప్రత్యేకంగా దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. కొంతమంది ప్రజా ప్రతినిధులు నిబంధనలకు విరుద్దంగా ఏర్పాటు చేస్తున్న ఈ వేడుకల కేంద్రాలను ప్రారంభిస్తున్న తీరుపై కూడా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.