మైనర్ మృతదేహం స్వాధీనం చేసుకున్న పోలీసులు

మధ్యప్రదేష్ లోని కాజ్రీ చేరుకున్న బృందాలు

దిశ దశ, పెద్దపల్లి:

వలస కార్మికు కుటుంబానికి చెందిన మైనర్ మృతదేహాన్ని పెద్దపల్లి పోలీసులు స్వాధీనం చేసుకున్నట్టుగా తెలుస్తోంది. గ్యాంగ్ రేప్ కు గురై తీవ్ర అస్వస్థతకు గురైన బాలికను గుట్టు చప్పుడుకు కాకుండా ఆమె స్వస్థలానికి తరలిస్తుండగా మార్గమధ్యలో చనిపోయింది. బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డ విషయం వెలుగులోకి రాగానే పోలీసులు రంగంలోకి దిగి దర్యాప్తు చేపట్టారు. పెద్దపల్లి జిల్లా కేంద్రం సమీపంలోని అప్పన్నపేటలో జరిగిన ఈ ఘటనపై రామగుండం సీపీ రెమా రాజేశ్వరి ప్రత్యేకంగా మానిటరింగ్ చేస్తున్నారు. రెండు ప్రత్యేక బృందాలను మధ్యప్రదేష్ కు పంపించి బాధితురాలి మృతదేహాన్ని స్వాధీనం చేసుకోవాలని ఆదేశించడంతో ఏసీపీ ఎడ్ల మహేష్ నేతృత్వంలో పోలీసులు బయలు దేరారు. గురువారం సాయంత్రం మధ్యప్రదేష్ లోని బాల్కెడ జిల్లా కాజ్రీ గ్రామానికి చేరుకున్న పోలీసులు ఆమె మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా బాధితురాలి వెంట వెల్లిన వారి నుండి కూడా ఏసీపీ మహేష్ పలు విషయాలను రాబట్టే ప్రయత్నం చేసినట్టుగా తెలుస్తోంది. బాధితురాలు తీవ్ర అస్వస్థతకు గురైనప్పటికీ పెద్దపల్లి పోలీసులకు సమాచారం ఇవ్వకుండా మధ్యప్రదేష్ కు ఎలా తీసుకెళ్లారంటూ ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. ఘటన జరిగిన తరువాత బాధితురాలు ఏం చెప్పింది..? మార్గ మధ్యలో గ్యాంగ్ రేప్ గురించి ఏమైనా చెప్పిందా అన్న వివరాలను కూడా పోలీసు బృందాలు తెలుసుకున్నట్టు విశ్వసనీయంగా తెలుస్తోంది. మైనర్ డెడ్ బాడీని తీసుకుని శుక్రవారం ఉదయం కల్లా పెద్దపల్లికి చేరుకునే అవకాశాలు ఉన్నట్టుగా సమాచారం.


కఠినంగా శిక్షించాలి: నారాయణ రావు, పౌరహక్కుల సంఘం ప్రధాన కార్యదర్శి

గ్యాంగ్ రేప్ కు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని పౌరహక్కుల సంఘం ప్రధాన కార్యదర్శి నారాయణ రావు డిమాండ్ చేశారు. గురువారం వలస కార్మికుల కుటుంబాలతో పూర్తి వివరాలు సేకరించేందుకు పౌరహక్కుల సంఘం అప్పన్నపేటను సందర్శించింది. అనంతరం నారాయణ రావు మీడియాతో మాట్లాడుతూ… వలస కార్మికుల విషయంలు అమలు చేయాల్సిన చట్టాలను అధికార యంత్రాంగం పట్టించుకోవడం లేదన్నారు. మైనర్ విషయంలో రక్షణ లేకుండా పోవడం ఆందోళన కల్గిస్తోందన్నారు.


రికార్డులేవి..?: కుమారస్వామి, సహాయ కార్యదర్శి

పారిశ్రామికంగా ఎదిగిన పెద్దపల్లి జిల్లాలో కార్మికుల సంక్షేమంపై దృష్టి పెట్టకపోవడం విచారకరమని పౌరహక్కుల సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి కుమారస్వామి అన్నారు. వివిధ శాఖల వద్ద వలస కూలీలు వివరాలు ఉండాలని, కానీ జిల్లాలో ఎక్కడ కూడా చొరవ తీసుకోకపోవడం ఆందోళన కల్గిస్తోందన్నారు. మైనర్ బాలికపై అత్యాచారం, హత్యాచారానికి ఒడిగట్టిన ఘటనే కాకుండా గతంలో జిల్లాలోని రాఘావాపూర్ ఇటుకబట్టిల్లో సూల్జా బాను అనే గర్భిణీని కొట్టి చంపిన ఘటన, క్రేన్ పడడంతో బాలుడు చనిపోవడం, ఓవర్ లోడ్ తో వెల్తున్న ట్రాక్టర్ బోల్తా ఘటనలో ముగ్గురు వలస కార్మికులు చనిపోయారన్నారు. ఇలాంటి ఘటనలు జిల్లాలో చాలా జరిగాయని నిర్మాణ రంగంతో పాటు ఇటుక బట్టీల్లో పని చేసేందుకు వచ్చే వలస కార్మికులపై జరుగుతున్న ఘటనలు ఆందోళన కల్గిస్తున్నాయని కుమారస్వామి అన్నారు. ఇప్పటికైనా జిల్లా యంత్రాంగం వలస కార్మికుల విషయంలో ప్రత్యేక దృష్టి సారించాలని డిమాండ్ చేశారు.

You cannot copy content of this page