దిశ దశ, పెద్దపల్లి:
పెద్దపల్లి లోకసభ నియోజకవర్గ రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఇక్కడి నుండి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఆశించిన నేత గోమాస శ్రీనివాస్ బీజేపీలో చేరారు. కొద్ది సేపటి క్రితం న్యూ ఢిల్లీలో తెలంగాణ ఇంఛార్జి తురుణ్ ఛుగ్, ఎంపీ డాక్టర్ లక్ష్మణ్ జీ, పొంగులేటి సుధాకర్ రెడ్డి సమక్షంలో కాషాయం కండువా కప్పుకున్నారు. 2009లో 50 వేల స్వల్ప ఓట్ల మెజార్టీతో పెద్దపల్లి ఎంపీగా ఓడిపోయిన గోమాస శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీ తరుపున టికెట్ కోసం తీవ్రంగా ప్రయత్నాలు చేశారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గేతో పాటు ఇతర ముఖ్య నేతలతో ఉన్న సాన్నిహిత్యంతో టికెట్ వస్తుందని ఆశించిన గోమాస శ్రీనివాస్ బీజేపీలో చేరడం సంచలనంగా మారింది. మంథని సెగ్మెంట్ పరిధిలోని భూపాలపల్లి జిల్లా కాటారం మండలం గూడురుకు చెందిన గోమాస శ్రీనివాస్ ఈ సారి పెద్దపల్లి బరిలో నిలవాలన్న లక్ష్యంతోనే పావులు కదుపుతున్నారు.
బీజీపీ అభ్యర్థిగా..?
పెద్దపల్లి నుండి బీజేపీ తరుపున పోటీ చేసే అభ్యర్థులు బలమైన వారు లేకపోవడం గోమాస శ్రీనివాస్ కు కలిసివచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇక్కడి నుండి శ్రీనివాస్ టికెట్ ఆశిస్తున్న క్రమంలో కాషాయం కండువా కప్పుకోవడంతో శ్రీనివాస్ ఈ సారి ఇక్కడి నుండి బరిలో నిలిచే అవకాశాలే మెండుగా ఉన్నాయి. నియోజకవర్గంలోని మహర్ సామాజిక వర్గం కూడా బలంగా ఉండడంతో పాటు ఈ ప్రాంతంలో తనకు ఉన్న వ్యక్తిగత పరిచయాలు కూడా లాభిస్తాయని గోమాస శ్రీనివాస్ వర్గీయులు అంటున్నారు. ప్రస్తుతం మోడి మానియాతో పాటు బీజేపీకి సానుకూల వాతావరణం నెలకొని ఉన్నందున గోమాసకు టికెట్ దక్కితే గెలిచే అవకాశాలు ఉంటాయని వారు చెప్తున్నారు.